ఐదేళ్లలో అవినీతి అంతం
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటన
రామ్‌లీలా మైదానంలో లక్ష మంది జనం మధ్య సీఎంగా ప్రమాణం
డిప్యూటీ సీఎంగా సిసోడియా.. మరో ఐదుగురు ప్రమాణ స్వీకారం
ఐదేళ్లలో దేశంలో తొలి అవినీతి రహిత రాష్ట్రంగా ఢిల్లీని తీర్చిదిద్దుతాం
ఐదేళ్ల పాటు ఢిల్లీలోనే ఉంటా.. వీఐపీ సంస్కృతికి స్వస్తి..
‘జన్‌లోక్‌పాల్’ను తీసుకొస్తాం.. మాకు మీడియా డెడ్లైన్లు పెట్టవద్దు
సీఎంగా ప్రమాణం తర్వాత ప్రజలనుద్దేశించి కేజ్రీవాల్ ప్రసంగం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో అవినీతిని ఐదేళ్లలో అంతం చేస్తామని ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కిందటిసారి తాము భావోద్వేగంతో పనిచేశామని.. ఈసారి ఐదేళ్లలో అవినీతిని క్రమేణా అంతం చేయగలమన్న నమ్మకం తమకుందని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలు తమకు ఐదేళ్లు అధికారం అప్పగించారని.. ఈ ఐదేళ్లూ కేవలం ఢిల్లీకి అంకితమై ప్రజాసేవను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని.. ఢిల్లీని వదిలి ఎక్కడికీ వెళ్లబోనని స్పష్టంచేశారు. ఎన్నికల్లో తన ప్రత్యర్థులైన బీజేపీ నేత కిరణ్‌బేడీ, కాంగ్రెస్ నేత అజయ్మాకెన్ల సూచనలు, సహకారంతో ఢిల్లీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. తమ ప్రభుత్వం జన్ లోక్‌పాల్ బిల్లును త్వరలో తెస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు, సహకారం ఉండాలని తాము కోరుకుంటున్నామని.. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రం హోదా ఇస్తామని హామీ ఇచ్చిన బీజేపీ ఆ హామీని నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు అధికారం తమదేనన్న అహంకారానికి లోనుకారాదని హితవుపలికారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. శనివారం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రామ్‌లీలా మైదానంలో లక్ష మందికి పైగా పాల్గొన్న భారీ జనసందోహం మధ్య లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఢిల్లీ 8వ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. మరో ఆరుగురు పార్టీ నేతల్లో మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా.. అసీమ్ అహ్మద్‌ఖాన్, సత్యేందర్ జైన్, గోపాల్‌రాయ్, సందీప్‌కుమార్, జితేంద్రసింగ్ తోమర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఏడాది కాలంలో రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కేజ్రీవాల్ అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అధికారాన్ని వదులుకున్న ఏడాది తరువాత మళ్లీ ఢిల్లీ ప్రభుత్వ పగ్గాలు స్వీకరించిన కేజ్రీవాల్ ప్రసంగంలో ఈసారి రాజకీయ పరిణతి కనిపించింది. గతంలో ఆయనలో కనిపించిన తొందరపాటు ఈసారి కనిపించలేదు. తనవద్ద ఐదేళ్ల సమయం, పూర్తి మెజారిటీ ఉందన్న గ్రహింపు ఆయన మాటలలో ప్రతిఫలించింది.
అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం...
అవినీతిపై హజారే ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్.. అవినీతిపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. దేశంలో తొలి అవినీతి రహిత రాష్ట్రంగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తంచేశారు. అవినీతి నియంత్రణకు మళ్లీ హెల్ప్‌లైన్ ప్రారంభిస్తామన్నారు. ‘‘ఎవరైనా లంచం అడిగితే ఇవ్వండి. దానిని స్టింగ్ ఆపరేషన్ చేసి వాయిస్‌ను రికార్డు చేసి నాకు అందించండి. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు. జన్‌లోక్‌పాల్ బిల్లు తేవాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.. సాధ్యమైన త్వరగా బిల్లు తేవడానికి ప్రయత్నిస్తామన్నారు. అయితే.. దీనిపై తమకు సమయపరిధి పెట్టవద్దని మీడియాకు విజ్ఞప్తిచేశారు.
ఆప్ టోపీలతో బెదిరిస్తే రెండింతలు శిక్ష...
ఆప్ టోపీలు ధరించి ఎవరు రౌడీయిజం చేసినా వారిని తక్షణమే అరెస్టు చేసి రెండితలు శిక్ష విధించాలని పోలీసు యంత్రాంగాన్ని కేజ్రీవాల్ ఆదేశించారు. ‘‘కొందరు వైద్యులు నా వద్దకు వచ్చి.. కొన్నిసార్లు టోపీలు ధరించిన కొందరు మా ఆసుపత్రులకు వచ్చి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఆప్ కార్యకర్తలు ఇలా చేయరని నా నమ్మకం. ఉద్యోగాలు, కుటుంబాలను త్యాగం చేసిన వారు మా పార్టీలో ఉన్నారు. విపక్షాలకు చెందిన వారు మా టోపీలు ధరించి మమ్మల్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నం కావచ్చు. రౌడీయిజం చేసేవారెవరైనా సరే రెండింతలు శిక్ష వేయాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
ఎర్ర బుగ్గకు నో.. కారు, బంగ్లాకు ఓకే...
వీఐపీ సంస్కృతికి తాము వ్యతిరేకమని.. ఢిల్లీ నగరంలో వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతామని కేజ్రీవాల్ ఉద్ఘాటించారు. ఎర్రబుగ్గ కార్లను తాను గానీ తన మంత్రులు గానీ, అధికారులు గానీ వాడబోరని తెలిపారు. తద్వారా వీఐపీల వల్ల జరిగే ట్రాఫిక్ జామ్‌ల నుంచి విముక్తి కల్పిస్తామన్నారు. తనకు నాలుగైదు గదులున్న ఇల్లు సరిపోతుందని, అయితే సీఎంగాగా పనిచేయడానికి పెద్ద ఇల్లు అవసరం కనుక బంగ్లానే తీసుకుంటానన్నారు. అధికారిక నివాసం, కారు తీసుకోవడాన్ని వాస్తవిక దృక్పథంతో చూడాలని, నాలుగైదు గదులకు మించి పెద్ద బంగ్లా తీసుకోబోనన్నారు.
మతపరమైన దాడులను ఢిల్లీ క్షమించదు...
ఐదేళ్ల పాటు సేవ చేయాలని దేవుడు, ఢిల్లీవాసులు ఆదేశించారని.. తాను ఐదేళ్ల పాటు ఢిల్లీలోనే ఉంటానని, ఎక్కడికీ పోనని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ప్రజల కోసం తమ ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తుందని చెప్పారు. 70 సీట్లలో 67 సీట్లను గెలవడం దేవుడు చేసిన అద్భుతమేనంటూ అన్ని మతాలు, కులాల వారు, పేదలు, ధనికులు ఓట్లు వేయడం ద్వారా ఈ విజయం సాధించామన్నారు. ఢిల్లీలో చర్చిలపై జరిగిన దాడుల గురించి ప్రస్తావిస్తూ వాటిని ఢిల్లీ క్షమించదని చెప్పారు. ఢిల్లీ పోలీసులు తమ పరిధిలో లేకపోయినప్పటికీ వారి సహకారంతో నగరంలో అన్ని మతాలవారికి భద్రత కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తుందని పేర్కొన్నారు. మతరాజకీయాలు చేయకుండా అన్ని మతాల వారు సోదరభావంతో మెలగాలన్నారు.
కిరణ్, మాకెన్‌ల సూచనలు తీసుకుంటాం
ఎన్నికల్లో తన ప్రత్యర్థి అయిన బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ తన అక్క వంటివారని.. ఢిల్లీని అభివృద్ధి చేయడానికి ఆమె సహాయాన్ని తీసుకుంటామని కేజ్రీవాల్ చెప్పారు. అలాగే.. పాలనానుభవం ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ మాకెన్ సలహాలూ తీసుకుంటామన్నారు. శాసనసభలో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను కూడా తమవారిగానే పరిగణిస్తామని.. తాము మొత్తం ఢిల్లీ కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్రం హోదా కల్పిస్తామని బీజేపీ చాలా కాలంగా హామీ ఇస్తోందని.. కానీ వారికి అవకాశం రాలేదని.. ఇప్పుడా హామీని నెరవేర్చే అవకాశం వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసినప్పుడు తాను ఆయనకు చెప్పినట్లు కేజ్రీవాల్ తెలిపారు. ‘‘కేంద్రంలో, ఢిల్లీలో సంపూర్ణ మెజార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ రెండు ప్రభుత్వాలు తలచుకుంటే ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా ఇప్పించవచ్చు. ఆ దిశగా మేం కృషిచేస్తాం’’ అని కేజ్రీవాల్ చెప్పారు.
ఇంటి భోజనంతో మంత్రులకు విందు
కొత్తగా ప్రమాణం చేసిన మంత్రివర్గ సహచరులకు కేజ్రీవాల్ తన ఇంట్లో వండి తెచ్చిన భోజనంతో విందు ఇచ్చారు. ప్రమాణం తర్వాత ఢిల్లీ సచివాలయంలోని తన ఆఫీసులో ఆరుగురు మంత్రులకూ ఈ విందు ఇచ్చారు. సచివాలయం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి.ఎం.స్పోలియా తదితర ఉన్నతాధికారులు కొత్త ముఖ్యమంత్రి, మంత్రులకు స్వాగతం పలికారు. మంత్రులందరూ శనివారమే బాధ్యతలు స్వీకరించి పనిప్రారంభించారు. కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులు, అధికారులతో తొలి భేటీ నిర్వహించి.. భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
అహంకారం కాదు.. ఆత్మావలోకనం కావాలి..
అధికారం తమదే అన్న అహంకారానికి లోనుకారాదని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, పార్టీ కార్యకర్తలకు కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కిందటిసారి అహంకారానికి లోనైనందువల్లే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో గుణపాఠం నేర్చుకున్నామని వ్యాఖ్యానించారు. అలాంటి అహంకారం వల్లే బీజేపీ, కాంగ్రెస్‌లు తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యాయన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలిచిన తరువాత తమ పార్టీకి చెందినవారు కొందరు తాము ఇతర రాష్ట్రాలలో పోటీచేస్తామని ప్రకటిస్తున్నారని.. ఇందులోనూ అహంకార ఛాయలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నిరంతరం ఆత్మావలోకనం చేసుకుంటూ ముందుకు సాగాలని.. అహంకారానికి లోనైతే లక్ష్యాన్ని సాధించలేమని చెప్పారు.
ప్రమాణస్వీకారానికి కేజ్రీవాల్ ఎప్పటిలా తన సాధారణ సామాన్యుడి దుస్తుల్లోనే వచ్చారు. నీలి రంగు స్వెటర్, గ్రే కలర్ ప్యాంటు ధరించారు. అయితే.. ఢిల్లీ వాతావరణం శనివారం నాడు కొంత వేడిగా ఉండటంతో.. తన ట్రేడ్ మార్క్ అయిన ‘మఫ్లర్’ను ధరించలేదు. కేజ్రీవాల్‌తో పాటు ప్రమాణ స్వీకారం చేసిన వారందరూ ‘నేను సామాన్యుడిని’ అనే నినాదంతో కూడిన పార్టీ టోపీలు ధరించారు.