
అన్నా దీక్ష ఆరంభం
జన్ లోక్‌పాల్ ధ్యేయంగా అనేక ఉద్యమాలు చేపట్టిన ప్రముఖ గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే దాని కోసం మరోసారి ఉద్యమించారు.
లోక్‌పాల్ ఆమోదం దాకా విరమించనని వెల్లడి
ప్రజలు మార్పు కోరుతున్నారన్నది ఢిల్లీ ఫలితాలతో స్పష్టం
శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెడతామన్న కేంద్రం
జన్ లోక్‌పాల్ ధ్యేయంగా అనేక ఉద్యమాలు చేపట్టిన ప్రముఖ గాంధేయవాది, అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు అన్నా హజారే దాని కోసం మరోసారి ఉద్యమించారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదానికి పట్టుబడుతూ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో ఉన్న సొంతూరు రాలేగావ్ సిద్ధిలో మంగళవారం ఆమరణ దీక్షకు దిగారు. యాదవ్‌బాబా ఆలయ వేదికగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి అభిమానులు భారీగా తరలివచ్చారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చూసైనా జన్‌లోక్‌పాల్ బిల్లు ఆవశ్యకతను నిజాయితీగా అంగీకరించాలని కాంగ్రెస్‌ను కోరారు. తక్షణమే జన్‌లోక్‌పాల్ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లు జాప్యానికి కాంగ్రెస్ నేతృత్వంలోని అధికార యూపీఏ సహా ప్రధాన విపక్షం బీజేపీలదే బాధ్యతని మండిపడ్డారు.
‘లోక్‌పాల్ ఆమోదం విషయమై ప్రధాని మన్మోహన్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా సహా బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలు నాకు హామీ ఇచ్చి మాటతప్పారు. ఇటు నన్ను, అటు ప్రజలను మోసం చేశారు. ఫలితంగా తాజా ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు’ అని అన్నా దుయ్యబట్టారు. ప్రభుత్వానికి మంచి బుద్ధి పుట్టించాలని భగవంతుణ్ణి వేడుకున్నట్టు చెప్పారు. గతంలో ఢిల్లీలో దీక్ష చేపట్టిన సమయంలో సోనియా స్వయంగా తనకు లేఖ రాశారని, లోక్‌పాల్‌ను తెచ్చేందుకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని, దీక్ష విరమించాలని కోరి, తర్వాత మోసం చేశారని ఆగ్రహించారు. ఎలాంటి రాజకీయ జెండాలూ లేకుండా వస్తామంటే ఆప్ నేత కేజ్రీవాల్ సహా అందరినీ దీక్షా వేదిక వద్దకు ఆహ్వానిస్తానని అన్నా చెప్పారు. లోక్‌పాల్ కోసం గడిచిన మూడేళ్లలో అన్నా నాలుగోసారి దీక్షకు దిగడం గమనార్హం.
ప్రజలు మార్పు కోరుతున్నారు..
దేశ ప్రజలు రాజకీయంగా మార్పు కోరుకుంటున్నారని, ఢిల్లీ ఫలితాల్లో ఈ అభిప్రాయం సుస్పష్టమైందని అన్నా ఉద్ఘాటించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ పార్టీ ముందుకొస్తే ఫలితం ఎలా ఉంటుందో ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమన్నారు. మోడీ ప్రభంజనం కొనసాగుతుందని భావిస్తున్న బీజేపీ అలాంటిదేమీ లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్‌కు తన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయని, తాను మాత్రం రాజకీయాల్లోకి రాబోనని స్పష్టం చేశారు. ఢిల్లీలో ఎవరికీ స్పష్టమైన మెజార్టీ రానందున మళ్లీ ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమమని, పొత్తుల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని అన్నా అన్నారు.
ప్రస్తుత సమావేశాల్లోనే ఆమోదం: కేంద్రం
ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే లోక్‌పాల్ బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి వి.నారాయణ స్వామి ఢిల్లీలో పార్లమెంటు ఆవరణలో మీడియాకు చెప్పారు. బిల్లు విషయమై రాజ్యసభ చైర్మన్‌కు ఇప్పటికే నోటీసు కూడా అందించామన్నారు. అన్నా దీక్షను విరమించాలని మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవాన్ విజ్ఞప్తి చేశారు.