మురిసిన మంగళాద్రి
మంగళగిరిలోని పానకాల స్వామి తీర్థంనాడు కొండపైనుంచి చూస్తే ఇసుకేసినా రాలునా అన్నట్టుగా కనిపించే భక్త ప్రవాహం... ఆ స్వామి విశిష్టత.. విశ్వాసం.. కాదనలేని సత్యాలు... భక్తుల కొంగు బంగారంలా కోరిన కోర్కెలు తీర్చేవాడని ప్రగాఢ నమ్మకం. అందుకే.. భక్త జనుల పరవళ్లు.. ప్రవాహాలు.. ఆ స్వామి సాక్షిగా మంగళాద్రిలో జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’కి సైతం పోటెత్తిన జనసంద్రం. మహానేత తనయ, జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిలకు పలికిన స్వాగతం తీర్థంనాటి రథోత్సవాన్ని జ్ఞప్తికి తెచ్చింది.
సాక్షి, గుంటూరు మహానేత వైఎస్సార్ తనయ, జననేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఎన్నికల ప్రచార భేరికి జనం బ్రహ్మరథం పట్టారు. మండు టెండను లెక్క చేయకుండా షర్మిలతో పాటు కదం తొక్కారు. అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. జిల్లాలో ఐదో రోజుల నుంచి అవిశ్రాంతంగా పర్యటిస్తున్న షర్మిల మంగళవారం పిడుగురాళ్ల నుంచి బయలుదేరి సత్తెనపల్లి, గుంటూరు, పెదకాకాని మీదుగా ఉదయం 11.30 గంటలకు మంగళగిరి చేరుకున్నారు.
మంగళగిరి శివారు చినకాకాని జాతీయ రహదారి వై జంక్షన్ నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. పాత మంగళగిరి సీతారామ కోవెల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తల ఆనంద సందోహాల నడుమ షర్మిల రోడ్ షో ప్రారంభమైంది. బోస్ బొమ్మ సెంటర్, మహాత్మాగాంధీ రోడ్, కూరగాయల మా ర్కెట్ మీదుగా మిద్దె సెంటరుకు చేరుకుని అక్కడ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. రోడ్ షోలో మంగళగిరి నియోజకవర్గంలో గ్రామ గ్రామాన షర్మిలను చూసేందుకు మహిళలు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. మిద్దె సెంటరు, తాడేపల్లి పట్టణ సెంటర్లో షర్మిల ప్రసంగంతో పార్టీ శ్రేణులు, వైఎస్‌ను అభిమానించే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ద్విగుణీకృతమైంది. జన క్షేమాన్ని కాంక్షించి, అనునిత్యం పేద ప్రజల కోసం పరితపించిన వైఎస్ మరణించిన తరువాత కాంగ్రెస్ సర్కారు సంక్షేమానికి పాడె కట్టి, అభివృద్ధిని అటకెక్కించిందని షర్మిల మండిపడ్డారు.
బాబు తొమ్మిదేళ్ల హయాంలో ప్రజలకు మేలు చేసే పనులేవైనా చేశారా? అని షర్మిల ప్రశ్నించినప్పుడు ‘జనం నుంచి లేదు.. లేదు.. అని’ పెద్ద ఎత్తున స్పందన లభించింది. వైఎస్ హయాంలో సంక్షేమ పథకాలు గుర్తు చేస్తూ షర్మిల చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపింది. జగన్ జనం కోసమే అహర్నిశలు పాటు పడుతున్నారనీ, ఒక్క అవకాశం ఇస్తే జగనన్న తన జీవితాన్ని ధారపోసేందుకు సిద్ధంగా ఉన్నారని ఉద్వేగభరితంగా చేసిన షర్మిల ప్రసంగం ప్రతి ఒక్కరిలో ఉత్తేజాన్ని నింపింది. మిద్దె సెంటరు నుంచి షర్మిల కాన్వాయ్ మంగళగిరి పట్టణంలో రాజీవ్‌గాంధీ సెం టరు, గాలిగోపురం, అంబేద్కర్ సెంటర్, గౌతమ బుద్ధరోడ్డు మీదుగా యర్రబాలెం, నులకపేట, ప్రకాష్‌నగర్, డోలాస్‌నగర్, ముగ్గురోడ్డు నుంచి తాడేపల్లి పట్టణానికి చేరుకుంది. దారి పొడవునా అందరికీ అభివాదం చేస్తూ షర్మిల రోడ్ షో, ఎన్నికల ప్రచారం విజయవంతమైంది.
ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించండి ..
మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆర్కే అన్న, గుంటూరు పార్లమెంటు అభ్యర్థి బాలశౌరి, మున్సిపల్ అభ్యర్థి చిల్లపల్లి మోహనరావులను గెలిపించాలని షర్మిల చేసిన వినతికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. రానున్న ఎన్నికల్లో జెడ్పీటీసీలుగా భీమిరెడ్డి జయలక్ష్మి, యేళ్ళ జయలక్ష్మి, ఎంపీపీలుగా రత్నకుమారి, భారతీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్‌గా పోటీ చేస్తున్న స్వరూపరాణిలను అఖండ మెజార్టీతో గెలిపించాలని షర్మిల కోరారు.
వైఎస్ కుటుంబానికి అండగా నిలవండి : ఆర్కే
పేదవాడి ముఖాన చిరునవ్వు చూడాలనే దివంగత మహానేత వైఎస్ ఆశయాన్ని నెరవేర్చగల సత్తా ఉన్న నేత జగన్ ఒక్కరేనని మంగళగిరి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. పేదవారికి మేమున్నామనే భరోసా కల్పించిన జగన్, షర్మిల, విజయమ్మలకు అండగా నిలవాలని కోరారు. ఇతర పార్టీలు గాలికి కొట్టుకుపోయేలా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు.
ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన ఘనత వైఎస్‌దే : బాలశౌరి
చేనేత వర్గానికి 18 శాతం ఉన్న ఎక్సైజ్ డ్యూటీని ప్రధానితో మాట్లాడి తగ్గించిన ఘనత మహానేత వైఎస్‌దేనని గుంటూరు పార్లమెంటు అభ్యర్థి బాలశౌరి అన్నారు. మంగళగిరి జనభేరి సభలో బాలశౌరి మాట్లాడుతూ రత్నాల చెరువును అభివృద్ధి చేసి, చేనేత కార్మికుల కోసం డ్రైనేజి వ్యవస్థను బాగు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఎవరిని అడిగినా వైఎస్ పాలనే మేలని ముక్తకంఠంతో చెబుతున్నారన్నారు.