Janga Gautam
-
సీఎంగా మరోనేతకు ఛాన్స్ ఇవ్వాలి!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు మాట మారుస్తారని, ఆయన మాటలు మారుస్తున్న తీరును గమనిస్తే సీఎం మానసిక స్థితిమీద అనుమానం కలుగుతోందని ఏపీసీసీ నేతలు మండిపడ్డారు. హోదా విషయంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాలుగేళ్లలో పలు సందర్భాల్లో చంద్రబాబు తడవకొక మాట మాట్లాడారని, నిన్న (మంగళవారం) టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చంద్రబాబు మాటలు లీకుల రూపంలో మీడియాకు ఇచ్చారని ఆరోపించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు బుధవారం ఇక్కడి ఇందిరాభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లీకుల రూపంలో మీడియాకు లీకులిస్తూ సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా మారారని అర్థమవుతోందని, ఆయనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. సీఎం స్థానంలో టీడీపీ మరొకరికి అవకాశం కల్పించి ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం సొంతజిల్లా చిత్తూరులో చంద్రబాబుకు అబద్ధాల నాయుడిగా నిక్ నేమ్ ఉండగా, ఇప్పుడు లీకుల నాయుడిగా మరోపేరు జత చేరిందన్నారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ కాదని, అది ఏపీ హక్కు అని చంద్రబాబు ఇప్పటికైనా గుర్తించాలన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన చట్టబద్ధమైన హామీలను సాధించడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఏపీసీసీ ప్రధాన కార్యదర్శులు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతల నుంచి తప్పుకుని మరో నేతకు చంద్రబాబు అవకాశం ఇవ్వాలని ఏపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన వాటిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్లో ఎంపీ మల్లికార్జున ఖర్గే రూల్ 184 కింద నోటీసు ఇచ్చారని, టీడీపీ, వైఎస్ఆర్సీపీ నేతలు లోక్‌సభలో చర్చలో పాల్గొనాలని సూచించారు. మార్చి 6, 7, 8 తేదీల్లో ఛలో పార్లమెంట్ పేరిట అంతిమ పోరాటానికి పిలుపునిస్తూ ఏపీపీసీ ఉద్యమ కార్యాచరణ ఢిల్లీలో చేపట్టనున్నామని, ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కలసి రావాల్సిందిగా కోరుతూ ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి లేఖలు రాయనున్నట్లు గిడుగు రుద్రరాజు, జంగా గౌతమ్, ఎస్.రాజాలు వెల్లడించారు. -
నాని, బోండాపై చర్యలు తీసుకోండి: ఏపీసీసీ
విజయవాడ: ఏపీ రవాణాశాఖ కమిషనర్‌పై దాడిచేసిన ఎంపీ కేశినేని, టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమపై చర్యలు తీసుకోవాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అండతోనే అధికారులపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకే రక్షణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కమిషనర్ తాను నోరు తెరిస్తే చాలా అక్రమాలు బయటపడతాయని అన్నారు. ఆ నిజాలేంటో చెప్పాలి. ఏ ఒత్తిడితో వాస్తవాలను అణచివేస్తున్నారో చెప్పాలన్నారు. వనజాక్షిపై దాడి చేసిన వారిని వెనకేసుకొచ్చిన ముఖ్యమంత్రి రవాణా శాఖ కమిషనర్‌పై దాడి చేసినవారిని కూడా వెనకేసుకొస్తారా లేక చర్యలు తీసుకుంటారా అని గౌతమ్ ప్రశ్నించారు. -
ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలా వ్యవహరిస్తోంది
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం విమర్శించారు. హైదరాబాద్ లోని ఇందిరా భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సదావర్తి భూములు తిరిగి వేలం వేయడానికి సిద్దంగా ఉందంటూ దేవాదాయ శాఖ ప్రకటించడంపై మండి పడ్డారు. సదావర్తి భూములవేలంలో ప్రభుత్వ తన పొరపాట్లను తప్పించుకునేందుకు కొత్త తప్పులు చేస్తోందని అన్నారు. పిఎల్ ఆర్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కోట్ చేసిన 28 కోట్లను బేస్ ప్రైజ్ గా నిర్ణయించి టెండర్ నిర్వహిస్తామనటం దారుణమన్నారు. ముందు వేలాన్ని పూర్తిగా రద్దు చేసి.. కొత్త వేలాన్ని చేపట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ - బీజేపీల దొంగాటను బయట పెడతాం.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా 10ఏళ్లు అమలు చేస్తామని మానిఫెస్టోలో ప్రకటించిన బీజేపీ రాష్ట్రానికి ద్రోహం చేసిందని మాజీ మంత్రి డాక్టర్ శైలజానాథ్ విమర్శించారు. ప్రత్యేక హోదాపై టీడీపీ, బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయని.. వీటిని బయట పెట్టేందుకు ఆగస్టు 1న విజయవాడలో సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. -
ఆ ద్రోహంలో బాబుకూ భాగం
నేటి నుంచి విస్తృత ప్రచారం: పీసీసీ సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేపట్టి ఈ నెల 26 నాటికి రెండేళ్లవుతున్న దృష్ట్యా.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీల వైఫల్యాలపై గురువారం నుంచి విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం తెలిపారు. ఏపీకి మోదీ చేస్తున్న ద్రోహంలో చంద్రబాబు భాగస్వామ్యం ఉందనే విషయం కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. బుధవారం ఇందిర భవన్లో ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయమై ఈ నెల 30న జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఎన్నికల ప్రచార సభలో మోదీ చెప్పారని, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రణాళికలో కూడా ఇదే హామీ ఇచ్చిందన్నారు. అయితే హామీలను తుంగలో తొక్కి ప్రధాని మోదీ ఏపీకి తీరని ద్రోహం తలపెట్టారనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేసేలా ప్రచారం నిర్వహిస్తామన్నారు. మోదీ, చంద్రబాబు మోసాలపై సభలు, సమావేశాలు, సదస్సులు, కరపత్రాల ద్వారా గ్రామ స్థాయి వరకు ప్రచారం చేస్తామని వివరించారు. ప్రత్యేక హోదా అమలుపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పక్షాలతో కలిసి కేంద్రంపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.