ఆ ద్రోహంలో బాబుకూ భాగం
నేటి నుంచి విస్తృత ప్రచారం: పీసీసీ
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేపట్టి ఈ నెల 26 నాటికి రెండేళ్లవుతున్న దృష్ట్యా.. ఎన్నికల సందర్భంగా రాష్ట్రానికి ఆయన ఇచ్చిన హామీల వైఫల్యాలపై గురువారం నుంచి విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించినట్లు పీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం తెలిపారు. ఏపీకి మోదీ చేస్తున్న ద్రోహంలో చంద్రబాబు భాగస్వామ్యం ఉందనే విషయం కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. బుధవారం ఇందిర భవన్‌లో ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమం ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయమై ఈ నెల 30న జరిగే పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వేంకటేశ్వరస్వామి సాక్షిగా ఎన్నికల ప్రచార సభలో మోదీ చెప్పారని, బీజేపీ రాష్ట్ర ఎన్నికల ప్రణాళికలో కూడా ఇదే హామీ ఇచ్చిందన్నారు. అయితే హామీలను తుంగలో తొక్కి ప్రధాని మోదీ ఏపీకి తీరని ద్రోహం తలపెట్టారనే విషయాన్ని ప్రజలకు గుర్తు చేసేలా ప్రచారం నిర్వహిస్తామన్నారు. మోదీ, చంద్రబాబు మోసాలపై సభలు, సమావేశాలు, సదస్సులు, కరపత్రాల ద్వారా గ్రామ స్థాయి వరకు ప్రచారం చేస్తామని వివరించారు. ప్రత్యేక హోదా అమలుపై సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అన్ని రాజకీయ పక్షాలతో కలిసి కేంద్రంపై పోరాటం చేయాలని డిమాండ్ చేశారు.