వర్గీకరణ వ్యతిరేక ఉద్యమం తీవ్రతరం
- మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య ప్రకటించారు. మాదిగలు చేపట్టనున్న ఉద్యమాలకు దీటుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 12వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఉద్యమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హలో మాల-చలో ఢిల్లీ పేరుతో మహాధర్నాను నిర్వహిస్తున్నామని చెప్పారు. వర్గీకరణ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని ఆయన కోరారు. మహాధర్నాకు మాలలు, ఉప కులాలు, కార్యకర్తలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు, మేధావులు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు మద్దతు పలకాలని కోరారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గైని గంగారాం, సెక్రటరీ జనరల్ జంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.