jangao
-
జనగామలో 144 సెక్షన్ ఎత్తివేత
జనగామ : జనగామలో కొనసాగుతున్న 144 సెక్షన్‌ను తొలగించామని డీఎస్పీ పద్మనాభరెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లా ఉద్యమ సమయంలో జరిగిన విధ్వంసాల దృష్టా్య శాంతిభద్రతల పరిరక్షణకు 144 సెక్షన్‌ను అమలు చేశామని చెప్పారు. ఇది అమల్లో ఉన్న సమయంలో జనజీవనానికి ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదన్నారు. ఆందోళనకారులు అల్లర్లకు పాల్పడితే 144 సెక్షన్ తిరిగి అమలులోకి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ నేతల సంబురాలు.. జనగామలో 85 రోజులుగా కొనసాగుతున్న 144 సెక్షన్‌ను పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య కృషితోనే తొలగించారని కాంగ్రెస్ నాయకులు ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచా పేల్చి నినాదాలు చేశారు. పొన్నాల లక్ష్మయ్య డీజీపీ అనురాగ్‌శర్మను కలిసి 144 సెక్షన్ ఎత్తివేయాలని కోరారని గుర్తు చేశారు. జిల్లా సాధన కోసం ప్రత్యేక కార్యాచరణ చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు ధర్మపురి శ్రీనివాస్, మేకల రాంప్రసాద్, వెన్నెం సత్యనిరంజన్‌రెడ్డి, ఆలేటి సిద్దిరాములు, జక్కుల వేణుమాధవ్, మినుకూరి మహేందర్ రెడ్డి, ఎండి మాజీద్, రంగు రవి, పట్టూరి శ్రీను, బొట్ల చిన శ్రీను, బూడిద గోపి, పండ్ల రాజు, కొండ కిరణ్ పాల్గొన్నారు. కాగా, మాజీ ఎమ్మెల్యే సీహెచ్ రాజారెడ్డి కూడా సంబురాలకు హాజరయ్యారు. -
వద్దన్న హన్మకొండను ఎట్లిస్తరు?
జనగామ : జనగామ జిల్లా చేయాలని ఉద్యమిస్తుంటే కాదన్న సర్కారు.. వద్దన్న హన్మకొండను ప్రకటించడం విస్మయానికి గురిచేసిందని తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. పట్టణంలోని జూబ్లీగార్డెన్‌లో ఆదివారం టీపీటీఎఫ్ అధ్యక్షుడు డి.శ్రీని వాస్ అధ్యక్షతన జరిగిన ‘జనగామ జిల్లా ఏర్పాటు – చారిత్రక ఆవశ్యకత’పై జరిగిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదన లేకుండా చివరి నిమిషంలో హన్మకొండను తెరపైకి తేవడం ప్రజల అభిప్రాయాలకు విలువ ఇవ్వడంలేదని స్పష్టం చేస్తోందన్నారు. పాలకుర్తి సోమన్న, బమ్మెర పోతన్న, సర్వాయి పాపన్న, చుక్క సత్తెయ్య మూలంగా సాయుధ పోరాటానికి ముందు నుంచే జనగామ ప్రాంత అస్థిత్వం కొనసాగిందన్నారు. జనగామ ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ఎవరికీ అభ్యంతరం లేదని, మరో ప్రాంతంలో కలిపేస్తామంటేనే సమస్యలు వస్తున్నాయని చెప్పారు. జిల్లాల పునర్విభజనకు మెుదట ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి, ఆ తర్వాత కలెక్టర్ల నివేదికల ఆధారంగా తుదినిర్ణయం తీసుకుంటే బాగుండేదన్నారు. కేవలం జనాభా లెక్కలు, భౌగోళిక స్థితి గతుల ఆధారంగా జిల్లాల పునర్విభజన చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నా రు. చేర్యాల, మద్దూరు మండలాలను గజ్వేల్ రెవెన్యూ డివిజన్లో కలిపితే పరిపాలనా సౌలభ్యం ఎలా అవుతుందో పాలకులే చెప్పాలన్నారు. జనగామ జిల్లా కావాలని ప్రజల్లో బలమైన నినాదం కొనసాగుతుందని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయాలని సూచిం చారు. వీక్షణం ఎడిటర్ వేణుగోపాల్, మాజీ ఎమ్మెల్యే సీహెచ్.రాజారెడ్డి, జేఏసీ చైర్మన్ ఆరు ట్ల దశమంతరెడ్డి, డాక్టర్ లక్ష్మినారాయణ, ఓయూ బాలలక్ష్మి, దాసరి కళావతి, పోకల లిం గయ్య, ఆకుల వేణుగోపాల్‌రావు ఉన్నారు. -
జిల్లా ఇవ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తా
జనగామ : జిల్లాల జాబితాలో జనగామకు అన్యాయం చేస్తే ఆమరణ దీక్షకు సైతం వెనుకాడబోనని మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ అన్నారు. జిల్లా సాధన కోసం జేఏసీ తలపెట్టిన రిలేదీక్షలను మంగళవారం ఆయన సందర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జనగామను జిల్లా చేస్తరని నమ్మకం ఉంది.. లేని పక్షంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సోనియమ్మను ఒప్పించి ప్రజల ఆకాంక్ష సాకారం చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో 11వ జిల్లా జనగామ చేస్తానని మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ ఘోరంగా మోసం చేశాడన్నారు. ఈ ప్రాంత ప్రజల బతుకులు ఆగం చేసేందుకే యాదాద్రిలో కలిపే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. మై హోం రామేశ్వరావు భూముల కోసమే యాదాద్రిని తెరపైకి తీసుకువచ్చాడన్నారు. నేషనల్ హైవేతోపాటు రైల్వే వ్యాగన్ పాయిం ట్, విద్య, వైద్యంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జనగామను జిల్లా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయిం దని, జనగామ జిల్లా కోసం ముక్తకంఠంతో అభిప్రాయాలను తెలిపితే సీఎం కనీసం స్పందించడంలేదన్నారు. మరో రెండు నెలల్లో వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ స్థానంలో నేనే వస్తున్నా.. ఏంటో చెప్పను.. చమత్కారం చూస్తారు అంటూ కొసమెరుపు ఇచ్చారు. ఆయన వెంట నాయకులు చెంచారపు శ్రీనివాస్‌రెడ్డి, ఎండీ.అన్వర్, ధర్మపురి శ్రీనివాస్, మేడ శ్రీనివాస్, ఆకుల వేణుగోపాల్‌రావు, మంగ సత్యం, ఆలేటి సిద్దిరాములు, రంగరాజు ప్రవీణ్‌కుమార్, రంగు రవి, బక్క శ్రీనివాస్ ఉన్నారు.