రేపు కాపు జేఏసీ ఏర్పాటు
అనంతపురం న్యూటౌన్ : కాపులను బీసీల్లో చేర్చాలన్న ప్రధాన డిమాండుతో ఉద్యమానికి సన్నద్ధులు కావడానికి జేఏసీలు ఏర్పాటు చేస్తున్నట్టు కేటీబీ రాష్ట్ర నాయకులు జంగటి అమర్నాథ్ తెలిపారు. స్థానిక కేటీబీ(కాపు,తెలగ, బలిజ) సంక్షేమ సంఘం కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్నాథ్, రాయలసీమ బలిజ మహాసంఘం అధ్యక్షులు వెంకట్రాముడు మాట్లాడారు. గురువారం ఉదయం 10.30 గంటలకు స్థానిక రాయల్ ఫంక్షన్ హాలులో జిల్లా జేఏసీ ఏర్పాటవుతుందని, మహిళలు, లాయర్లు, డాక్టర్లు, వ్యాపారులు, ఉపాధ్యాయులు..ఇలా ప్రతి వర్గానికి ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
అలాగే గ్రామగ్రామాన జేఏసీలను విస్తరింపజేస్తామన్నారు. విశ్రాంత డీజీపీ ఎంవీ.కృష్ణారావు, విశ్రాంత ప్రిన్సిపల్ సెక్రటరీ కేవీరావు, ఆర్టీఐ కమీషనర్ విజయబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి మార్గదర్శనం చేస్తారన్నారు. ముఖ్యంగా ఈ ఏడు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన ఆచార్య విజయకృష్ణమనాయుడు, సూర్యనారాయణను ఘనంగా సత్కరిస్తామన్నారు. బలిజలంతా జేఏసీల్లో భాగస్వామ్యులు కావాలని కోరారు. కార్యక్రమంలో కేటీబీ నాయకులు భవానీ రవికుమార్, హర్ష, చంద్రమౌళి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.