Japanese scientists
-
హృదయ కాలేయం@వరాహం
గుండె సమస్య వచ్చిందా.. కొత్త గుండె కావాలా.. నో ఫికర్.. రంధి ఎందుకు పంది ఉందిగా.. మూత్ర పిండాలు చెడిపోయాయి.. కొత్తవి కావాలా.. అలా పందుల ఫాం దాకా వెళ్లొస్తే సరి.. కాలేయం కరాబ్ అయిందా.. అరే బాయ్.. వరాహం ఉందిగా.. అదే వెయ్యి వరహాలు లెక్క! అసలేంటి? పంది ఉంటే.. ప్రాబ్లెమ్ లేకపోవడమేంటి? పందికి మనకు ఉన్న ఆ లంకె ఏంటి? అన్నీ అనుకున్నట్లు జరిగితే.. సమీప భవిష్యత్తులో పంది మనపాలిట వరాహావతారమే కానుంది. ఎందుకంటే.. మనకు ఏ అవయవం కావాలన్నా.. పంది శరీరం నుంచి తీసుకోవచ్చంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. మన అవయవాలను పందిలో పెంచుకో వచ్చని వారు చెబుతున్నారు. మన మూల కణాలను (స్టెమ్‌సెల్స్) వేరే జంతువులోకి చొప్పించి.. మన అవయవాలను పెంచే అవకాశాలపై ప్రొఫెసర్ హిరోమిట్సు నకౌచీ అనే శాస్త్రవేత్త తన బృందం తో కలసి పదేళ్లుగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా మానవుల అవయవాలను ఏదైనా క్షీరదంలో ప్రవేశపెట్టి.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్ ప్రభుత్వం వీరికి అనుమతిచ్చింది. ఇలా పెంచుతారట.. ఇప్పటికే మూల కణాలను ఉపయోగించి అవయవాలను వృద్ధి చేసే ప్రయోగాలు చాలానే జరిగాయి. - ఏ అవయవాన్ని పెంచాలనుకుంటున్నామో ముందు శాస్త్రవేత్తలు నిర్ణయించుకుంటారు. - మన మూల కణాలను క్షీరదం (జంతువు) పిండంలోకి ఎక్కించి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా డీఎన్ఏలో మార్పులు చేస్తారు. - డీఎన్ఏ మార్పులు చేయడం ద్వారా మనకు కావాల్సిన అవయవం మళ్లీ పెరగకుండా ఉండేందుకు దోహదపడుతుంది. - దీనివల్ల పిండం ఎదుగుతున్న కొద్దీ దాని శరీరం లో వేరే (మానవుడి) అవయవం పెరిగినా ఇబ్బందులు రాకుండా ఉంటుంది. - ఆ తర్వాత ఆ పిండాన్ని తల్లి క్షీరదం గర్భంలోకి ఎక్కిస్తారు. - గర్భంలో సాధారణ జంతువు మాదిరిగానే పెరుగుతుంది. - అయితే పుట్టబోయే జంతువులో మనకు కావాల్సిన అవయవం సాధారణంగా పెరుగు తుంటుంది. కానీ అందులోని ప్రతి కణం మాత్రం మానవుడిదే. - ఆ జంతువు ఎదిగిన తర్వాత మనకు కావాల్సిన అవయవాన్ని ఆ జంతువును చంపేసి తీసుకుని రోగి శరీరంలోకి మార్పిడి చేసుకోవచ్చు. సాధ్యమయ్యే పనేనా.. మన మూల కణాలను జంతువు తన శరీరంలో ఎలా వాడుకుంటుందనే విషయంపై ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది. ఉదాహరణకు మూల కణాలు మనం అనుకున్న అవయవం కాకుండా వేరే భాగాల్లో ముఖ్యంగా జంతువు మెదడులోకి వెళ్లి.. మనలాగే తెలివి మీరితే ఏం చేస్తారన్న దానికి పరిశోధకుల దగ్గర సమాధానం లేదు. ఎంతవరకు మానవుల లాగా వాటి శరీరాలు మారిపోతాయన్నది కూడా సమాధానం లేని ప్రశ్నే. తొలుత ఎలుకలపై ఇలాంటి పరిశోధనలు చేసి, ఆ తర్వాత పందుల పిండాల్లోకి మన మూలకణాలను ఎక్కించి పెంచుతానని ప్రొఫెసర్ హిరోమిట్సు చెబుతున్నాడు. ఇలా మన మూలకణాలున్న పిండాలు పూర్తిగా గర్భంలో ఎదిగి ఆ జంతువు ప్రసవం అయ్యే వరకు ఉంచేలా అనుమతినిస్తూ జపాన్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, ఫ్రాన్స్ ఇలాంటి ప్రయోగాలకు వారి దేశాల్లో అనుమతివ్వలేదు. అయితే ఈ వివాదాస్పదమైన ప్రయోగం వల్ల భవిష్యత్తులో మానవ విలువల విషయంలో సమస్యలు వస్తాయని, ఇలాంటివి ఇప్పటివరకు ప్రయోగ దశలోనే ఆగిపోయాయని, మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో చూద్దామని చాలా మంది పెదవి విరుస్తున్నారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ముంచుకొస్తున్న ప్రళయాగ్ని!
పది కిలోమీటర్ల వెడల్పు.. అర కిలోమీటర్‌కుపైగా ఎత్తున్న సొరంగం.. టిక్..టిక్..టిక్మంటూ కాలం గడుస్తోంది.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా.. కళ్లుమూసి తెరిచేలోగా... సొరంగంలోని లావా కాస్తా ఒక్కపెట్టున పైకి ఎగజిమ్మింది... ఏమిటిది? ఇదేదో సస్పెన్స్ సినిమా కథ అనుకునేరు! అక్షరాలా వాస్తవం. సముద్రపు అడుగున వేల ఏళ్లపాటు నిద్రాణంగా ఉన్న ఓ అగ్నిపర్వతం క్రియాశీలకమైందని.. ముందస్తు హెచ్చరికల్లేకుండా ఎప్పుడైనా పేలిపోవచ్చునని చెబుతున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఈ విపత్తుతో కనీసం 10 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. ఎక్కడిది? జపాన్ దక్షిణ ప్రాంతంలో కికాయి కాల్డెరా అనే పేరుతో ఓ అగ్నిపర్వతముంది. భూమ్మీద కనిపించేది కొంచెమే అయినా అడుగున భారీ సైజులో ఉంటుంది. 7,300 ఏళ్ల కింద బద్దలై లావా ఎగజిమ్మిందని.. ఫలితంగా అక్కడి జొమోన్ నాగరికత పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని చరిత్రకారుల అంచనా. ఎలా తెలిసింది..? జపాన్‌లోని కోబె విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ అగ్నిపర్వత ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. ఫుకేమరూ అనే పరిశోధక నౌకతో అగ్నిపర్వత ప్రాంతానికి వెళ్లిన శాస్త్రవేత్తలు సముద్రపు అడుగుభాగంలో ఓ భారీ లావా గోపురాన్ని గుర్తించారు. ఈ గోపురం వేల ఏళ్లుగా పేరుకుపోయిన లావా పరిమాణం కొంచెం అటూ ఇటుగా 32 ఘనపు కిలోమీటర్లు! అంటే 32 పక్కన 12 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యలో ఉన్నన్ని లీటర్ల లావా అన్నమాట! ఏం జరుగుతుంది..? ఇది ఆషామాషీ సైజున్న అగ్నిపర్వతం కాదు. పైగా వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్నది. గతంలో ఎగసిన లావా కాస్తా అగ్నిపర్వతంపై పేరుకుపోవడంతో లోపల లావా తీవ్రమైన ఒత్తిడితో పేరుకుపోతూ వస్తోంది. జపాన్ శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాల్లో రయోలైట్స్ అనే ప్రత్యేకమైన రాళ్లు ఉన్నాయి. ఈ రాళ్లు అందులో లావా ఇంకా ఉందనేందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. లావా ఎగజిమ్మితే సల్ఫర్ డయాక్సైడ్తో కూడిన బూడిద కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. ఫలితంగా ధూళి మేఘాలు ఏర్పడి కొంతకాలం సూర్యుడి వెలుగు భూమిని చేరకుండా పోతుంది. దీంతో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతాయి. సముద్రపు అడుగున జరిగే ప్రక్రియ కాబట్టి సునామీ వచ్చి అమెరికా తీరాన్ని తాకుతుందని అంచనా. కికాయి అగ్నిపర్వతాన్ని మరింత అధ్యయనం చేయడం ద్వారా విస్ఫోటనం జరిగే సమయాన్ని అంచనా వేసేందుకు జపాన్ శాస్త్రవేత్తలు యత్నిస్తున్నారు. నిదర్శనాలేంటి? కికాయి అగ్నిపర్వతంలోని లావా మళ్లీ క్రియాశీలమైందని శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు నిజమే అనేందుకు ఇప్పటికే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో చిన్న చిన్న అగ్నిపర్వతాలు పేలిపోతుండటమే కాకుండా.. ఊహించని రీతిలో వరుస భూకంపాలు వస్తున్నాయి. ఇండోనేసియా నుంచి మొదలుకుని ఫిలిప్పీన్స్, జపాన్, ఉత్తర, దక్షిణ అమెరికా పశ్చిమ తీరప్రాంతం మొత్తాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతం ఇదే. టెక్టానిక్ ప్లేట్ల క్రియాశీలత కారణంగా ఇక్కడ భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. అమెరికా తీరంలోని సెయింట్ ఆండ్రియాస్ ఫాల్ట్ వద్ద కూడా ఓ భారీ భూకంపం ఎప్పుడైనా రావచ్చని అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి. -
మన్యంలో నోబెల్ వెలుగులు
విద్యుత్ పొదుపులో గిరిజనుల భాగస్వామ్యం సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బుల వినియోగం 1002 మంది గిరిజనులు ఆదర్శం పాడేరు : తక్కువ విద్యుత్‌తోనే ఎక్కువ వెలుగులు పంచుతూ... పర్యావరణానికి మేలు చేకూర్చే నీలి ఎల్ఈడీ సాంకేతికతను ఆవిష్కరించిన ముగ్గురు జపాన్ శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ దక్కింది. ఎల్ఈడీ, సీఎఫ్ఎల్ బల్బులను వినియోగిస్తూ విద్యుత్‌ను పొదుపు చేస్తున్న పాడేరు మండలం డి.గొందూరు, బర్సింగి పంచాయతీ ప్రజల కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలనకు వెళ్లింది. కరెంటు కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు విషయాలూ సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. డి.గొం దూరు, బర్సింగి గ్రామాల్లోని 1002 మంది గిరిజనులు తమ నివాసాల్లో సీఎఫ్ఎల్, ఎల్ఈడీ బల్బులను వినియోగించుకుంటున్నారు. గతంలో మామూలు బల్బుల వినియోగంతో రెండు బల్బులు వాడినా రూ.200 నుంచి 300 బిల్లులు వస్తుండటంతో వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే ఈ గిరిజనులంతా అధిక బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం ఈ గిరిజనులంతా విద్యుత్‌ను పొదుపు చేస్తునే మరోవైపు అధిక కాంతిని ఇస్తున్న ఎల్ఈడీ బల్బులను వినియోగిస్తున్నారు. గతంలో వెలుగు సంస్థ సీఎఫ్ఎల్ బల్బులను పంపిణీ చేయగా వాటిని గత 3 ఏళ్ల నుంచి అనేక గిరిజన కుటుంబాలు వినియోగిస్తున్నాయి. ఇప్పటికీ ఈ బల్బులు చెక్కు చెదరకుండా పని చేస్తుండటంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఎల్ఈడీ బల్బులను ఈ రెండు పంచాయతీల పరిధిలోని డి.గొందూరు, కరకపుట్టు, మద్దులబంద, గుర్రంపనుకు, వాకపల్లి, పాలమాను శంక, బర్సింగి, జి.కొత్తూరు, కురిడిమెట్ట, గడివలస తదితర గ్రామాల్లోని 1002 మంది గిరిజనులు సబ్సిడీ ధరపై కొనుగోలు చేశారు. తమ పాత బల్బులను ఇచ్చి ఒకొక్క ఎల్ఈడీ బల్బును రూ.200 ధరతో గ్రామానికి వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. దీంతో గత నెల రోజుల నుంచి ఎల్ఈడీ బల్బుల వెలుగులతో ఈ గ్రామాలు విరాజిల్లుతున్నాయి. కాంతి అధికంగా ఉండటంతో గిరిజనులు ఈ బల్బులను చూసి సంబరపడుతున్నారు. సుదీర్ఘకాలంపాటు ఎల్ఈడీ బల్బులు పని చేసే వీలుండటంతో బల్బుల ఖర్చు కూడా మిగులుతుందని పేర్కొంటున్నారు. ఎల్ఈడీ కాంతి అద్భుతం ఎల్ఈడీ బల్బు ద్వారా అధిక కాంతి ఏర్పడుతుంది. గతంలో సాధారణ బల్బు వినియోగించినప్పుడు ఎర్రని కాంతితో ఇబ్బందులు పడేవాళ్లం. తెల్లటి కాంతిని ఇస్తున్న ఎల్ఈడీ బల్బులు అద్భుతంగా ఉన్నాయి. విద్యుత్ బిల్లులు కూడా తక్కువగా వస్తున్నాయి. - డిప్పల ముత్యాలమ్మ, డి.గొందూరు గ్రామం, పాడేరు మండలం విద్యుత్ ఆదా.. అధిక కాంతి గతంలో పంపిణీ చేసిన సీఎఫ్ఎల్, ఇటీవల కొనుగోలు చేసిన ఎల్ఈడీ బల్బులను గృహ అవసరాలకు వినియోగిస్తున్నాను. విద్యుత్ బిల్లులు తక్కువగా రావడం సంతోషంగా ఉంది. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి కూడా అధిక కాంతి ఎంతో మేలు చేస్తుంది. - పి.బొజ్జన్న, కురిడిమెట్ట, పాడేరు మండలం