అగ్నిపర్వతం
పది కిలోమీటర్ల వెడల్పు.. అర కిలోమీటర్‌కుపైగా ఎత్తున్న సొరంగం.. టిక్..టిక్..టిక్‌మంటూ కాలం గడుస్తోంది.. ఉన్నట్టుండి అకస్మాత్తుగా.. కళ్లుమూసి తెరిచేలోగా... సొరంగంలోని లావా కాస్తా ఒక్కపెట్టున పైకి ఎగజిమ్మింది... ఏమిటిది? ఇదేదో సస్పెన్స్ సినిమా కథ అనుకునేరు! అక్షరాలా వాస్తవం. సముద్రపు అడుగున వేల ఏళ్లపాటు నిద్రాణంగా ఉన్న ఓ అగ్నిపర్వతం క్రియాశీలకమైందని.. ముందస్తు హెచ్చరికల్లేకుండా ఎప్పుడైనా పేలిపోవచ్చునని చెబుతున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. ఈ విపత్తుతో కనీసం 10 కోట్ల మంది ప్రాణాలకు ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.
ఎక్కడిది?
జపాన్ దక్షిణ ప్రాంతంలో కికాయి కాల్‌డెరా అనే పేరుతో ఓ అగ్నిపర్వతముంది. భూమ్మీద కనిపించేది కొంచెమే అయినా అడుగున భారీ సైజులో ఉంటుంది. 7,300 ఏళ్ల కింద బద్దలై లావా ఎగజిమ్మిందని.. ఫలితంగా అక్కడి జొమోన్ నాగరికత పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందని చరిత్రకారుల అంచనా.
ఎలా తెలిసింది..?
జపాన్‌లోని కోబె విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఇటీవల ఈ అగ్నిపర్వత ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించారు. ఫుకేమరూ అనే పరిశోధక నౌకతో అగ్నిపర్వత ప్రాంతానికి వెళ్లిన శాస్త్రవేత్తలు సముద్రపు అడుగుభాగంలో ఓ భారీ లావా గోపురాన్ని గుర్తించారు. ఈ గోపురం వేల ఏళ్లుగా పేరుకుపోయిన లావా పరిమాణం కొంచెం అటూ ఇటుగా 32 ఘనపు కిలోమీటర్లు! అంటే 32 పక్కన 12 సున్నాలు పెడితే వచ్చే సంఖ్యలో ఉన్నన్ని లీటర్ల లావా అన్నమాట!
ఏం జరుగుతుంది..?
ఇది ఆషామాషీ సైజున్న అగ్నిపర్వతం కాదు. పైగా వేల ఏళ్లుగా నిద్రాణంగా ఉన్నది. గతంలో ఎగసిన లావా కాస్తా అగ్నిపర్వతంపై పేరుకుపోవడంతో లోపల లావా తీవ్రమైన ఒత్తిడితో పేరుకుపోతూ వస్తోంది. జపాన్ శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాల్లో రయోలైట్స్ అనే ప్రత్యేకమైన రాళ్లు ఉన్నాయి. ఈ రాళ్లు అందులో లావా ఇంకా ఉందనేందుకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. లావా ఎగజిమ్మితే సల్ఫర్ డయాక్సైడ్‌తో కూడిన బూడిద కొన్ని కిలోమీటర్ల ఎత్తుకు చేరుతుంది. ఫలితంగా ధూళి మేఘాలు ఏర్పడి కొంతకాలం సూర్యుడి వెలుగు భూమిని చేరకుండా పోతుంది. దీంతో కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోతాయి. సముద్రపు అడుగున జరిగే ప్రక్రియ కాబట్టి సునామీ వచ్చి అమెరికా తీరాన్ని తాకుతుందని అంచనా. కికాయి అగ్నిపర్వతాన్ని మరింత అధ్యయనం చేయడం ద్వారా విస్ఫోటనం జరిగే సమయాన్ని అంచనా వేసేందుకు జపాన్ శాస్త్రవేత్తలు యత్నిస్తున్నారు.
నిదర్శనాలేంటి?
కికాయి అగ్నిపర్వతంలోని లావా మళ్లీ క్రియాశీలమైందని శాస్త్రవేత్తలు వేసిన అంచనాలు నిజమే అనేందుకు ఇప్పటికే కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో చిన్న చిన్న అగ్నిపర్వతాలు పేలిపోతుండటమే కాకుండా.. ఊహించని రీతిలో వరుస భూకంపాలు వస్తున్నాయి. ఇండోనేసియా నుంచి మొదలుకుని ఫిలిప్పీన్స్, జపాన్, ఉత్తర, దక్షిణ అమెరికా పశ్చిమ తీరప్రాంతం మొత్తాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు. ప్రపంచంలోనే అత్యధిక అగ్నిపర్వతాలు ఉన్న ప్రాంతం ఇదే. టెక్టానిక్ ప్లేట్ల క్రియాశీలత కారణంగా ఇక్కడ భూకంపాలు ఎక్కువగా సంభవిస్తాయి. అమెరికా తీరంలోని సెయింట్ ఆండ్రియాస్ ఫాల్ట్ వద్ద కూడా ఓ భారీ భూకంపం ఎప్పుడైనా రావచ్చని అంచనాలు చాలాకాలంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment