మన్యంలో నోబెల్‌ వెలుగులు | Maybe the Nobel Lit | Sakshi
Sakshi News home page

మన్యంలో నోబెల్‌ వెలుగులు

Published Fri, Oct 10 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

మన్యంలో నోబెల్‌ వెలుగులు

మన్యంలో నోబెల్‌ వెలుగులు

  • విద్యుత్ పొదుపులో గిరిజనుల భాగస్వామ్యం
  •  సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీ బల్బుల వినియోగం
  •  1002 మంది గిరిజనులు ఆదర్శం
  • పాడేరు : తక్కువ విద్యుత్‌తోనే ఎక్కువ వెలుగులు పంచుతూ... పర్యావరణానికి మేలు చేకూర్చే నీలి ఎల్‌ఈడీ సాంకేతికతను ఆవిష్కరించిన ముగ్గురు జపాన్ శాస్త్రవేత్తలకు ఈ ఏడాది భౌతిక శాస్త్ర నోబెల్ దక్కింది. ఎల్‌ఈడీ, సీఎఫ్‌ఎల్ బల్బులను వినియోగిస్తూ విద్యుత్‌ను పొదుపు చేస్తున్న పాడేరు మండలం డి.గొందూరు, బర్సింగి పంచాయతీ ప్రజల కృషి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పరిశీలనకు వెళ్లింది. కరెంటు కొరత తీవ్రంగా వేధిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రెండు విషయాలూ సమాజానికి
    స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.

    డి.గొం దూరు, బర్సింగి గ్రామాల్లోని 1002 మంది గిరిజనులు తమ నివాసాల్లో సీఎఫ్‌ఎల్, ఎల్‌ఈడీ బల్బులను వినియోగించుకుంటున్నారు. గతంలో మామూలు బల్బుల వినియోగంతో రెండు బల్బులు వాడినా రూ.200 నుంచి 300 బిల్లులు వస్తుండటంతో వ్యవసాయంపైనే ఆధారపడి జీవించే ఈ గిరిజనులంతా అధిక బిల్లులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం ఈ గిరిజనులంతా విద్యుత్‌ను పొదుపు చేస్తునే మరోవైపు అధిక కాంతిని ఇస్తున్న ఎల్‌ఈడీ బల్బులను వినియోగిస్తున్నారు.
     
    గతంలో వెలుగు సంస్థ సీఎఫ్‌ఎల్ బల్బులను పంపిణీ చేయగా వాటిని గత 3 ఏళ్ల నుంచి అనేక గిరిజన కుటుంబాలు వినియోగిస్తున్నాయి. ఇప్పటికీ ఈ బల్బులు చెక్కు చెదరకుండా పని చేస్తుండటంతో గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఎల్‌ఈడీ బల్బులను ఈ రెండు పంచాయతీల పరిధిలోని డి.గొందూరు, కరకపుట్టు, మద్దులబంద, గుర్రంపనుకు, వాకపల్లి, పాలమాను శంక, బర్సింగి, జి.కొత్తూరు, కురిడిమెట్ట, గడివలస తదితర గ్రామాల్లోని 1002 మంది గిరిజనులు సబ్సిడీ ధరపై కొనుగోలు చేశారు.

    తమ పాత బల్బులను ఇచ్చి ఒకొక్క ఎల్‌ఈడీ బల్బును రూ.200 ధరతో గ్రామానికి వచ్చిన ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొనుగోలు చేశారు. దీంతో గత నెల రోజుల నుంచి ఎల్‌ఈడీ బల్బుల వెలుగులతో ఈ గ్రామాలు విరాజిల్లుతున్నాయి. కాంతి అధికంగా ఉండటంతో గిరిజనులు ఈ బల్బులను చూసి సంబరపడుతున్నారు. సుదీర్ఘకాలంపాటు ఎల్‌ఈడీ బల్బులు పని చేసే వీలుండటంతో బల్బుల ఖర్చు కూడా మిగులుతుందని పేర్కొంటున్నారు.
     
    ఎల్‌ఈడీ కాంతి అద్భుతం
    ఎల్‌ఈడీ బల్బు ద్వారా అధిక కాంతి ఏర్పడుతుంది. గతంలో సాధారణ బల్బు వినియోగించినప్పుడు ఎర్రని కాంతితో ఇబ్బందులు పడేవాళ్లం. తెల్లటి కాంతిని ఇస్తున్న ఎల్‌ఈడీ బల్బులు అద్భుతంగా ఉన్నాయి. విద్యుత్ బిల్లులు కూడా తక్కువగా వస్తున్నాయి.
     - డిప్పల ముత్యాలమ్మ, డి.గొందూరు గ్రామం, పాడేరు మండలం
     
     విద్యుత్ ఆదా.. అధిక కాంతి
     గతంలో పంపిణీ చేసిన సీఎఫ్‌ఎల్, ఇటీవల కొనుగోలు చేసిన ఎల్‌ఈడీ బల్బులను గృహ అవసరాలకు వినియోగిస్తున్నాను. విద్యుత్ బిల్లులు తక్కువగా రావడం సంతోషంగా ఉంది. ఇంట్లో పిల్లలు చదువుకోవడానికి కూడా అధిక కాంతి ఎంతో మేలు చేస్తుంది.
     - పి.బొజ్జన్న, కురిడిమెట్ట, పాడేరు మండలం
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement