పెరగనున్న పెట్రోల్, కరెంటు, కార్ల ధరలు!
న్యూఢిల్లీ: దేశంలో కరెంటు చార్జీలతో పాటు, పెట్రోల్, కార్ల ధరలు పెరగనున్నాయా? ప్రస్తుత పరిస్థితులు ఈ విషయాన్నే సూచిస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీ వల్ల వాతావరణంలో కాలుష్యకారకాలు పెరిగిపోతుండటంతో ఎన్విరాన్ మెంటల్, ఎమిషన్ రూల్స్ ను ప్రభుత్వం కఠినతరం చేసింది. దీంతో ఒక యూనిట్ విద్యత్తు ధర 40 నుంచి 50 పైసలు, ఒక లీటర్ పెట్రోల్ ధర 70 పైసలు, కారు ధర రూ. లక్ష నుంచి లక్షన్నరకు వరకు సంస్థలు పెంచే అవకాశం కనిపిస్తోంది.
రూపాయి విలువలో హెచ్చుతగ్గులు, అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధరలను బట్టి రేట్లు మారే అవకాశం ఉంది. బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలకు సంబంధించిన నిబంధనలను గత ఏడాది డిసెంబర్ లోనే ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ కేంద్రాలు ఉత్పత్తి చేసే ఒక మెగావాట్ విద్యుత్తుకు కోటి రూపాయలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ భారాన్ని వినియోగదారులపై విద్యుత్తు కేంద్రాలు మోపనున్నాయి.
అంతేకాకుండా కేంద్రాల నుంచి విడుదలయ్యే సల్ఫర్ డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, పాదరసం తదితర వ్యర్ధాలపై ఆంక్షలు కూడా ఉన్నాయి. కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో సరికొత్త టెక్నాలజీని వినియోగించాలని కూడా నిబంధనల్లో ఉంది. ఆటో ఫ్యూయల్ విజన్ అండ్ పాలసీ 2025 ప్రకారం ఇంధనాల వినియోగంపై రూ.75పైసలను సెస్ రూపంలో వసూలు చేయాలని నిర్ణయించారు.