గంగ, జమున...మిస్టర్ ఇండియా!
వారిద్దరూ తమ జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అవిభక్త కవలలు, అసహజ రూపం కావటంతో అనేక అవమానాలు, ఛీత్కారాలు చవిచూశారు. దేవుడి శాపం వల్లే ఇలా నాలుగు చేతులు, మూడు కాళ్లు, ఒకే ఉదరంతో జన్మించారని కన్నవాళ్లు కూడా వదిలేశారు. దీంతో పొట్ట కూటికోసం ఓ ట్రావెలింగ్ సర్కస్‌లో చేరారు. 45 ఏళ్లు వచ్చేవరకు ఏ తోడూ లేకండా ఒంటరిగానే గడిపారు. కానీ, ఏడు నెలల క్రితం ఓ రోజు ఇద్దరూ ప్రేమలో పడ్డారు. స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్న జసీముద్దీన్ అహ్మద్ ను చూడగానే ఇద్దరూ మనసు మనసు పారేసుకున్నారు.
ఇద్దరి పరిస్థితిని చూసిన అహ్మద్ కూడా చలించిపోయాడు. వారికి అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి ముగ్గురూ కలిసే ఉంటున్నారు. అహ్మద్ కూడా అదే సర్కస్ కంపెనీలో సౌండ్ ఇంజనీర్‌గా పార్ట్‌టైం జాబ్‌లో చేరాడు. గంగ, జమునలు ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉన్నారు. అహ్మద్ చాలా మంచి వ్యక్తి అని, తమను ఎంతో బాగా చూసుకుంటున్నాడని, అతడిని తాము మిస్టర్ ఇండియా అని పిలుస్తామని గంగ వెల్లడించింది.
జీవితాంతం అతడి అండ ఉంటే, ఇక తమకు ఏమీ అక్కర్లేదని చెబుతోంది. ప్రస్తుతం తాము చాలా సంతోషంగా ఉన్నామని ఈ అవిభక్త కవలలు చెబుతున్నారు. అహ్మద్ కూడా వారిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడని చెబుతున్నారు. వారి బాధలు తన బాధలుగా భావిస్తూ అన్నింటా అండగా నిలబడుతున్నాడని గంగ, జమునా మురిసిపోతున్నారు.