jat agitation
-
జాట్ల ఆందోళన వాయిదా
న్యూఢిల్లీ: జాట్ల ఆందోళన 15రోజులు వాయిదా పడింది. సోమవారం తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం రద్దైంది. హరియాణా సీఎం ఎం.ఎల్.ఖట్టర్‌తో భేటీ అనంతరం జాట్ నేతలు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, కళాశాల సీట్లలో రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న జాట్లు సోమవారం చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ట్రాక్టర్లలో వచ్చిన ఆందోళనకారులను ఆదివారం ధనిగోపాల్ గ్రామంలోని సిర్సా–హిస్సార్ ఢిల్లీ నేషనల్ హైవే వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఇరుపక్షాల మధ్య ఘర్షణ జరిగింది. ఎస్పీ, డీఎస్పీతో సహా 35 మందికి గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో జాట్ నేతలతోæ ఖట్టర్, జాట్ వర్గానికి చెందిన కేంద్ర మంత్రులు బీరేంద్ర సింగ్, పీపీ చౌదరి ఆదివారం చర్చించారు. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం తర్వాత జాట్ కోటా ప్రక్రియ ప్రారంభమవుతుందని ఖట్టర్ హామీ ఇచ్చారు. -
మెట్రో సర్వీసులకు బ్రేక్
జాట్ల సమ్మె కారణంగా ఢిల్లీ వెలుపల మెట్రోరైలు సేవలను ఆదివారం రాత్రి నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీఎంఆర్సీ ప్రకటించింది. సోమవారం నుంచి తమ సమ్మెను ఉధృతం చేయనున్నట్లు జాట్ సంస్థలు ప్రకటించడంతో ఈ చర్య తీసుకున్నారు. ఆదివారం రాత్రి 8 గంటల తర్వాత సెంట్రల్ ఢిల్లీలోని 12 మెట్రో స్టేషన్లు కూడా మూతపడతాయని, అయితే ఇంటర్‌ఛేంజ్ సదుపాయం మాత్రం అన్నిచోట్లా అందుబాటులో ఉంటుందని డీఎంఆర్సీ ప్రకటించింది. గురు ద్రోణాచార్య నుంచి హుడా సిటీసెంటర్‌కు, కౌశాంబి నుంచి వైశాలి వరకు, నోయిడా సెక్టార్ -15 నుంచి నోయిడా సిటీ వరకు, సరాయ్ నుంచి ఎస్కార్ట్స్ ముజేశ్వర్ వరకు మళ్లీ ప్రకటించేవరకు సేవలను ఆపేస్తున్నామని ఢిల్లీ మెట్రో అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, ఉద్యోగ్ భవన్, లోక్ కళ్యాణ్ మార్గ్, జన్‌పథ్, మండీ హౌస్, బారాఖంబా రోడ్, ఆర్కే ఆశ్రమ్ మార్గ్, ప్రగతి మైదాన్, ఖాన్ మార్కెట్, శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్లను కూడా మూసేస్తున్నారు. మార్చి 20వ తేదీన పార్లమెంటు వెలుపల భారీ నిరసన నిర్వహిస్తామని జాట్ గ్రూపులు తెలిపాయి. ప్రభుత్వోద్యోగాలతో పాటు విద్యాసంస్థల్లో కూడా తమకు రిజర్వేషన్లు కావాలని జాట్లు డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటు గత సంవత్సరం ఆందోళనలో మరణించినవారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలంటున్నారు. -
ఢిల్లీ-హర్యానా సరిహద్దులో 144 సెక్షన్
న్యూఢిల్లీ: జాట్ల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ-హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఇతర ప్రాంతాల్లోనూ నిషేధ ఆజ్ఞలు అమలు చేస్తున్నారు. వాయువ్య, ఆగ్నేయ, నైరుతి ఢిల్లీల్లోని కాలనీలు, గ్రామాల్లో ఈ ఆంక్షలు విధించామని ఢిల్లీ పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత జాట్ల ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకుని 144 సెక్షన్ విధించినట్టు వెల్లడించారు. శాంతిభద్రతలను ఎటువంటి భంగం కలగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నట్టు తెలిపారు. -
‘గ్యాంగ్ రేప్’లపై విచారణ
జాట్ల ఆందోళన సమయంలో జరిగిన అఘాయిత్యాలను చూశామని కొందరి వెల్లడి చండీగఢ్: జాట్ల ఉద్యమ సమయంలో సామూహిక అత్యాచారాల ఆరోపణలపై ఏర్పాటైన కమిటీ శనివారం విచారణ ప్రారంభించింది. హరియాణా డీఐజీ రాజశ్రీ సింగ్ నేతృత్వంలోని ఇద్దరు మహిళా డీఎస్పీల బృందం సోనెపట్ జిల్లా ముర్తాల్ ప్రాంతంలో పర్యటించింది. ప్రత్యక్షసాక్షులు, బాధితులు తమను సంప్రదించలేదని కమిటీ చెప్పగా... మహిళలపై అల్లరిమూక దాడి చేయడం చూశామంటూ ముగ్గురు లారీ డ్రైవర్లు మీడియాకు వెల్లడించారు. ‘ఆ దృశ్యాల్ని చూశాను. మహిళలు, అమ్మాయిలపై అల్లరిమూక దాడి చేసి బట్టలు చించేశారు. పొలాల్లోకి పారిపోతుండగా వారిని వెంబడించారు. కొందర్ని బలవంతంగా లాక్కెళ్లారు’ అని నిరంజన్‌సింగ్ వివరించాడు. నోరువిప్పవద్దంటూ తమపై పోలీసులు ఒత్తిడి తెస్తున్నారని సుఖ్విందర్ అనే డ్రైవర్ ఆరోపించాడు. దర్యాప్తులో దొరికిన దుస్తుల్ని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపామని డీఐజీ తెలిపారు. జాట్ల ఆందోళన సమయంలో 10 మంది మహిళలపై 40 మంది గుంపు లైంగిక దాడికి పాల్పడ్డారని, ముర్తాల్‌లో మహిళల బట్టలు, లోదుస్తులు దొరికాయన్న వార్తలొచ్చాయి. విచారణకు జాతీయ మహిళా కమిషన్ సభ్యుల బృందం ముర్తాల్ వెళ్లనుందని కేంద్రం తెలిపింది.