పాక్‌పై విరుచుకుపడ్డ భారత సైన్యం
పాక్ సైనిక బలగాలు భారతీయ సైనికుడి శరీరాన్ని ఛిద్రం చేయడం, మరో ఇద్దరిని హతమార్చిన ఘటన ఒక్కసారిగా భారత సైన్యం రక్తాన్ని ఉడికించింది. నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌పై భారీ స్థాయిలో దాడులతో విరుచుకుపడ్డారు. దీటుగా సమాధానం ఇవ్వడం తమకు తెలుసని స్పష్టం చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతం మొత్తం తుపాకుల మోతతో దద్దరిల్లింది. పూంఛ్, రాజౌరి, కేల్, మచిల్.. ఇలాంటి ప్రాంతాలన్నీ హాట్ జోన్లుగా మారిపోయాయి.
మంగళవారం నాడు పాకిస్థానీ కమాండోలు ఒక సైనికుడి తల నరికి, మరో ఇద్దరిని కూడా హతమార్చారు. మచిల్ ప్రాంతంలో నియంత్రణరేఖను దాటి వచ్చి మరీ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని మచిల్ సెక్టార్లో పెట్రోలింగ్ చేస్తున్న సైనికులను పాక్ కమాండోలు చుట్టుముట్టారు. ఈ సెక్టార్లో భారత, పాకిస్థానీ సైనిక పోస్టులు దగ్గరగా ఉంటాయి. దానికితోడు ఈ ప్రాంతమంతా దట్టమైన అడవులు ఉండటంతో ఉగ్రవాదులు లేదా సైనికులు చొరబడటం సులభం అవుతుంది. మూడు వారాల క్రితమే అదే ప్రాంతంలో మరో సైనికుడిని కూడా తల నరికి చంపారు. ఈ పిరికిపందల చర్యకు గట్టి ప్రతీకారం ఉండి తీరుతుందని ఆర్మీ ఓ ప్రకటనలో తెలిపింది. పాకిస్థానీ ఆర్మీ పోస్టుల మీద దాడికి భారత సైన్యం 120 ఎంఎం హెవీ మోర్టార్లను, మిషన్ గన్లను ఉపయోగించింది. అయితే, భారత సైన్యం తమమీద ఎలాంటి దాడి చేయలేదని పాకిస్థాన్ అంటోంది.