Jaya Shankar district
-
పోలీసుల దాష్టీకానికి యువకుడు బలి!
జయశంకర్ భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పోలీసుల దాష్టీకానికి ఓ యువకుడు మృతి చెందాడన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. బైక్ ఎన్ఓసీ విషయంలో బాలిజీ మోటర్స్ షోరూం యజమానితో ఈ నెల 10న ప్రశాంత్, శ్రావన్ అనే ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. దీనిపై షోరూం యజమాని గణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రశాంత్, శ్రావన్‌లను పోలీసు స్టేషన్‌కు పిలిపించిన ఎస్ఐ ఉదయ్ కిరణ్ వేధించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐ ఉదయ్ కిరణ్ వేధింపులు భరించలేకనే ఈ నెల 12 న ప్రశాంత్ పోలిసు స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. 12 రోజులుగా చికిత్స పొందుతూ.. మృతి చెందాడు. ఈ ఘటనలో గణపురం ఎస్ఐ ఉదయ్ కిరణ్, షోరూం యజమానిపై కేసులు నమోదు అయ్యాయి. ఎస్ఐ ఉదయ్‌కిరణ్‌కు సస్పెండ్ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. -
జయశంకర్ జిల్లా కార్యాలయాలకు హంగులు
గోడలకు రంగులు.. గదుల్లో ఏసీల ఏర్పాటు తాత్కాలిక భవనాలకు కొనసాగుతున్న మరమ్మతులు మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తి భూపాలపల్లి : కొత్తగా ఏర్పాటవుతున్న ఆచార్య జయశంక ర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల్లో మరమ్మతు పనులు చురుగ్గా సాగుతున్నాయి. అక్టోబర్ 1లోపు జిల్లా కార్యాలయాలను అన్ని విధాలుగా సిద్ధం చేసి 11 నుంచి పాలన కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు స్థానిక రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు పనులను ముమ్మరం చేశారు. మరో నాలుగు రోజుల్లో పనులు పూర్తవుతాయని స్థానిక రెవెన్యూ అధికారులు తెలుపుతున్నారు. కలెక్టరేట్లో చురుగ్గా పనులు.. భూపాలపల్లి పట్టణంలోని మంజూర్‌నగర్‌లో ఉన్న ఇందూ అతిథిగృహంలో కింది అంతస్తు మొత్తాన్ని కలెక్టరేట్‌కు కేటాయించారు. ఇందులో కలెక్టర్, జేసీ, డీఆర్ఓ, ఏఓ, కలెక్టర్ కార్యాలయ సెక్షన్లు, వీడియో, సమావేశపు గదులకు కేటాయించారు. అలాగే పై అంతస్తులో డీఎం సీఎస్, డీఎస్ఓ, డీపీఓ, ఎ¯ŒSఐసీ వీసీ, రికార్డ్సŠ, ఐఅండ్‌పీఆర్, డీఆర్డీఏ, సీపీ ఓ శాఖలకు కేటాయించారు. ఆయా శాఖలకు కేటాయిం చిన గదుల్లో పనులు త్వరితగతిన సాగుతున్నాయి. ఇందూ అతిథిగృహంలోని 32 గదులకు నంబర్లు రాయించారు. అలాగే భవనం చుట్టూ పూల మొక్కలను నాటేందుకు ప్రస్తుతం ఉన్న పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. కలెక్టర్, జేసీకి కేటాయించిన గదుల్లో ఏసీలను ఏర్పాటు చేశారు. భవనం కొత్తదే అయినప్పటికీ ఇప్పటివరకు వినియోగంలో లేదు. దీంతో మరో మారు గదుల్లో పెయింటింగ్ చేస్తున్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయ నున్న తహసీల్దార్ కార్యాలయం వెనక భాగంలోని దేవాదుల డేటాబేస్ సెంటర్ భవనంలో పనులు కొనసాగుతున్నాయి. ఈ భవనంలో గోడలకు పగుళ్లు రావడంతో రెండు రోజులుగా మరమ్మతు పనులు చేపడుతున్నారు. కార్యాలయం చుట్టూ మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్డీఓ గదిలో ఏసీని ఏర్పాటు చేశారు. ఇందులో మరో మారు రంగులు వేయిస్తున్నారు. సిద్ధంగా ఐటీఐ భవనం.. భూపాలపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ భవనంలో టూరిజం, జీఎం ఇండసీ్ట్రస్, ట్రెజరీ, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఆర్అండ్బీ, వ్యవసాయశాఖ, మార్కెటింగ్, మైనింగ్, కోఆపరేటివ్ కార్యాలయాలకు కేటాయించారు. అయితే ఈ భవనంలో నిర్మాణ, మరమ్మతు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. దీంతో అధికారులు భవనానికి తాళం వేసి ఉం చారు. ఇదిలా ఉండగా, ఎస్పీ కార్యాలయానికి కేటాయించిన సింగరేణి మైనింగ్ ఒకేషనల్ ట్రైనింగ్ సెంటర్లో ఇంకా పనులు ప్రారంభం కాలేదు. పోలీసు ఉన్నతాధికారులు రెండు రోజుల్లో భవనాన్ని పరిశీలించి పనులు చేయించనున్నట్లు తెలిసింది. కొత్త భవనాలతో తప్పిన తంటా.. నూతనంగా ఏర్పాటవుతున్న ఆచార్య జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు కొత్త భవనాలు రెడీగా ఉండడంతో అధికారులకు తిప్పలు తప్పాయి. సింగరేణి ఇందూ అతిథి గృహం, ప్రభుత్వ ఐటీఐ, దేవాదుల డాటా బేస్ సెంటర్ భవనాలు నిర్మించి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వినియోగంలో లేవు. ఇంతకాలం అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో అధికారులు ఆయా భవనాల్లో మరమ్మతు పనులు పెద్ద మొత్తంలో చేపట్టాల్సిన అవసరం లేకుండా పోయింది. -
జిల్లా కార్యాలయాలు కొలిక్కి
భవనాల అప్పగింతకు సింగరేణి సంస్థ అంగీకారం స్పీకర్ చొరవతో తొలగిన సమస్య భూపాలపల్లి : జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు భవనాల సమస్య తొలగిపోయింది. జిల్లా కార్యాలయాలను సింగరేణి భవనాల్లో ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. కానీ సింగరేణి స్థానిక అధికారులు ఆయా భవనాలను ఇవ్వడం వీలు కాదంటూ ఇటీవల ప్రకటన విడుదల చేశారు. దీంతో భవనాల విషయమై అయోమయం నెలకొంది. చివరికి ఆయా భవనాలను అప్పగించేందుకు సింగరేణి సూత్రప్రాయంగా అంగీకరించింది. భూపాలపల్లి పట్టణం మంజూర్‌నగర్‌లోని సింగరేణి ఇందూ అతిథిగృహంలో కలెక్టరేట్‌తోపాటు మరో 10 శాఖల కార్యాలయాలు, మైనింగ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్(ఎంవీటీసీ)లో ఎస్పీ కార్యాలయం, సీఈఆర్ క్లబ్లో ఎక్సైజ్, పీఆర్ ఇంజనీరింగ్, దేవాదు ల డేట్బేస్ సెంటర్లో ఆర్డీవో, ప్రభుత్వ ఐటీఐలో పలు శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ములుగు ఆర్డీవో మహేం దర్జీ ఆయా భవనాలను పరిశీలించారు. ఏయే గదులను ఏశాఖకు కేటాయించాలో వారం రోజుల క్రితమే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. సింగరేణికి చెందిన ఇందూ అతిథిగృహం, ఎంవీటీసీ, సీఈఆర్ క్లబ్‌లు పరిపాలన, శాంతిభద్రతలు, చట్టపరంగా ఇవ్వడం వీలు కాదని అందులో పేర్కొంది. దీంతో సమస్య మళ్లీ మెుదటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి స్థానిక జీఎం పాలకుర్తి సత్తయ్య తో మాట్లాడారు. దీంతో ఆయా భవనాలను అప్పగించేందుకు జీఎం అంగీకరించారు. భూపాలపల్లిలో గనుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థకు ఇప్పటివరకు సుమారు 4 వేల ఎకరాలకు పైగా అప్పగించిందని, ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు శాసన సభాపతి, జాయింట్ కలెక్టర్, ములుగు ఆర్డీవో, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ నెల 8న భూపాలపల్లికి వచ్చి సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎంతో కలిసి సంస్థ భవనాలను పరిశీలించారు. జిల్లా కార్యాలయాలకు సింగరేణి భవనాలు అనుకూలంగా ఉన్నాయని రెవె న్యూ అధికారులు వెల్లడించారు. జేసీ ఆయా భవనాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఏ భవనం ఏ శాఖకు కేటాయించాలో స్థానిక అధికారులకు సూచించారు. భవనాల్లో చేయాల్సిన తాత్కాలిక మరమ్మతులను వివరించారు. మొత్తానికి జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు తమవంతు సహకారం అందిస్తామని సింగరేణి సంస్థ తెలపడంతో కార్యాలయాలకు భవనాల సమస్య పరిష్కారమైంది. -
సహజ వనరుల కేంద్రం జయశంకర్ జిల్లా
శాసన సభాపతి మధుసూదనాచారి భూపాలపల్లి : జయశంకర్ జిల్లా సహజ వనరులకేంద్రంగా విలసిల్లుతుందని శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. జిల్లా కార్యాలయా లు తాత్కాలికంగా ఏర్పాటు చేయనున్న సింగరేణి, ప్రభుత్వ భవనాలను జేసీ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్యతో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. పట్టణంలోని మంజూర్‌నగర్‌లో ఉన్న ఇందూ అతిథిగృహం, ప్రభుత్వ ఐటీఐ భవనం, సింగరేణి ఎంవీ టీసీ కార్యాలయం, దేవాదుల డేటాబేస్ సెంటర్‌ను పరిశీలించారు. ఇందూ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.భూపాలపల్లి, మంథని, ములుగు నియోజకవర్గాలతో ఏర్పడబోతున్న జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాలు పరిశీలించినట్లు చెప్పారు. జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు సహకరిస్తున్న సింగరేణి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. చిట్యాల మండలం టేకుమట్ల గ్రామం 1987లోనే మండలంగా ఏర్పడాలని, అప్పుడు పట్టించుకోని వారు నేడు ఆరోపణలకు దిగడం సరికాదన్నారు. ములుగు ఆర్డీవో మహేందర్‌జీ, డ్వామా పీడీ వై.శేఖర్‌రెడ్డి, డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్‌రెడ్డి, పరకాల డీఎస్పీ సుధీంద్ర, నగర పంచాయతీ చైర్పర్సన్ బండారి సంపూర్ణ, వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, కౌన్సిలర్లు పిల్లలమర్రి నారాయణ, నిర్మల, భాస్కర్, వజ్రమణిబీబీచారి పాల్గొన్నారు. -
తాత్కాలిక ఆఫీస్‌లకు భవనాలు కరువు
సింగరేణికి పలు శాఖల వినతులు అన్ని శాఖలకు భవనాల ఏర్పాటు కష్టమే తేలని కలెక్టర్ కార్యాలయ భవనం భూపాలపల్లి : నూతనంగా ఏర్పడే జయశంకర్ జిల్లాలో తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కొరత నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేపట్టి దసరా నుంచే పరిపాలన కొనసాగించాలని నిర్ణయించింది. అయితే కొత్తగా ఏర్పడే జయశంకర్ జిల్లాలో పలు శాఖల తాత్కాలిక కార్యాలయాలకు భవనాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. సింగరేణి సంస్థ అవసరాల మేరకు నిర్మించుకున్న పలు భవనాలను కార్యాలయాల నిమిత్తం ఇస్తున్నప్పటికీ ఇంకా కొరత ఉంటుంది. ఏ భవనంలో కలెక్టరేట్? జయశంకర్ జిల్లా తాత్కాలిక కలెక్టర్ కార్యాలయ భవనం ఎక్కడా అనేది ఇంకా స్పష్టత రాలేదు. మంజూర్‌నగర్‌లోని సింగరేణి ఇల్లందు అతిథిగృహంలో ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు మొదట భావించారు. ఆ భవనాన్ని రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులు కూడా పరిశీలించారు. కానీ సింగరేణి యాజమాన్యం నుంచి ఇంకా అనుమతులు రాలేదు. కలెక్టరేట్ కోసం ఇల్లందు అతిథిగృహం, కాకతీయ అతిథి గృహం వివరాలను స్థానిక సింగరేణి అధికారులు సంస్థ సీఅండ్ఎండీ శ్రీధర్‌కు పంపించారు. ఆయన నిర్ణయం మేరకు కలెక్టరేట్ ఎక్కడా అనేది తేలనుంది. ‘సింగరేణి’కి వినతులు జిల్లా ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసేందుకు పలు శాఖల అధికారులు స్థానిక సింగరేణి అధికారులకు వినతులు సమర్పిస్తున్నారు. ఇక్కడ సింగరేణి భవనాలు తక్కువగానే ఉండటంతో అన్ని శాఖలకు భవనాలు సమకూర్చే అవకాశాలు కనిపించడం లేదు. స్థానిక సింగరేణి గనుల వృత్తి శిక్షణ కేంద్రంలో ఎస్పీ కార్యాలయం, నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ భవనంలో జిల్లా పరిషత్ కార్యాలయం, తహసీల్ కార్యాలయం వెనుక గల దేవాదుల డేటా బేస్ సెంటర్లో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేశారు. కలెక్టరేట్ ఏర్పాటుకు పరిశీలనలో ఉన్న ఇల్లందు, కాకతీయ అతిథిగృహాల్లో 32 గదులు మాత్రమే ఉన్నాయి. అయితే కలెక్టరేట్లో కొన్ని కీలక శాఖలు ఉండే అవకాశం ఉన్నప్పటికీ పలు శాఖలు ఇతర భవనాల్లో కొనసాగించాల్సి ఉంటుంది. కాగా ఆయా శాఖలకు సింగరేణి, ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తనున్నాయి. తమకు భవనాలు సమకూర్చాలంటూ పలు శాఖల అధికారులు ఇప్పటికే సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎం పాలకుర్తి సత్తయ్యకు వినతులు అందజేశారు. గురువారం మైన్స్ అండ్ జియాలజీ శాఖ అధికారులు, శుక్రవారం డీఈవో రాజీవ్ తమ శాఖలకు భవనాలు కావాలని కోరారు. మరో వారం రోజులు ఇంకా పలు శాఖల అధికారులు ఇక్కడి వచ్చి వినతులు సమర్పించే అవకాశాలు ఉన్నాయి. -
బలపడనున్న మంథని బంధం
జయశంకర్ జిల్లాలో కలపడంతో అక్కడి ప్రజల్లో హర్షం భూపాలపల్లి : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లా ల పునర్విభజనలో మంథని నియోజకవర్గాన్ని భూపాలపల్లి జిల్లాలో కలుపడంతో అక్కడి ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. వారు ఇన్నాళ్లు విద్యా, వ్యాపారం తదితర అవసరాల నిమిత్తం భూపాలపల్లికి వచ్చేవారు. ఇప్పుడు నూతనంగా ఏర్పడే భూపాలపల్లి జిల్లాలో మంథని నియోజకవర్గం కలుస్తుండటంతో వారి బంధం మరింత బలపడినట్లయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం భూపాలపల్లిని ఆచార్య జయశంకర్ జిల్లాగా ఏర్పాటు చేయనుంది. నియోజకవర్గం లోని భూపాలపల్లి, గణపురం, రేగొండ, చిట్యాల, మొగుళ్లపల్లి, ములుగు నియోజకవర్గంలోని ములుగు, వెంకటాపురం, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, మంథని నియోజకవర్గంలోని కాటారం, మల్హర్రావు, మహముత్తారం, మహాదేవ్‌పూర్ మండలాలతో జిల్లాను ఏర్పాటు కానుంది. 30 ఏళ్లుగా భూపాలపల్లితో సత్సంబంధాలు భూపాలపల్లి పట్టణంతో కాటారం, మల్హర్రా వు, మహాముత్తారం, మహాదేవ్‌పూర్ మండలాల ప్రజలకు 30 ఏళ్లుగా సత్సంబంధాలు ఉన్నాయి. విద్యార్థులు జూనియర్, డిగ్రీ, పీజీ చదువుల కోసం ఇక్కడికే వస్తుంటారు. పట్టణంలోని ప్రైవేటు కళాశాలల్లో ఆయా మండలాలకు చెందిన విద్యార్థులు 40 శాతానికి పైగా ఉంటారు. అలాగే అక్కడ మెరుగైన వైద్య సౌకర్యం లేకపోవడంతో ఇక్కడి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తుంటారు. పరిస్థితి విషమిస్తే మాత్రం వరంగల్‌కు వెళ్తారు. రైతులు ఎరువు లు, క్రిమి సంహారక మందులు, పనిముట్ల కొ నుగోళ్లు, కూరగాయల క్రయ, విక్రయ నిమిత్తం వస్తుంటారు. కాటారం, మల్హర్రావు, మహాముత్తారం, మహాదేవ్‌పూర్ మండలాల ప్రజలు జిల్లా కేంద్రమైన కరీంనగర్‌కు వెళ్లాలం టే సుమారు వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణించాల్సి ఉండేది. చిన్న పనికి సైతం ఒకటి, రెండు రోజులు వెచ్చించాల్సి వచ్చేది. కాగా ఆయా మండలాలు జయశంకర్ జిల్లాలో కలుస్తుండటంతో దూర భారం తగ్గింది. -
తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు కసరత్తు
సింగరేణి భవనాలు పరిశీలించిన ఆర్డీఓ మహేందర్‌జీ భూపాలపల్లి : జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం కసరత్తు ప్రారంభమైంది. ఇందుకు పట్టణంలోని సింగరేణి భవనాలు ఉపయోగించుకోనున్నారు. తాత్కాలికంగా కలెక్టర్ కార్యాలయ ఏర్పాటుకోసం మంజూర్‌నగర్‌లోని సింగరేణి ఇల్లందు అతిథిగృహాన్ని ములుగు ఆర్డీఓ మహేందర్‌జీ సోమవారం పరిశీలించారు. తాత్కాలిక కలెక్టరేట్లో జేసీ, డీఆర్వో, అడ్మినిస్ట్రేటీవ్, ఏడీఈ, డీఎస్వో, డీఎం సీఎస్ తదితర కార్యాలయాలు ఏయే గదుల్లో ఏర్పాటు చేయాలనే విషయంపై స్థానిక రెవెన్యూ, ఆర్అండ్బీ అధికారులతో చర్చించారు. తమ సూచన మేరకు ఆయా శాఖల గదుల ఏర్పాటుకు ప్రనాళిక సిద్ధం చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. అలాగే ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేయనున్న స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెనుకనున్న దేవాదుల డేటా బేస్ సెంటర్‌ను పరిశీలించారు. అనంతరం ఆర్డీవో విలేకరులతో మాట్లాడారు. జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటు కోసం సింగరేణి భవనాలను గతంలోనే పరిశీలించి కలెక్టర్‌కు నివేదిక పంపామన్నారు. ఆయా కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్న శాఖలకు గదుల ఏర్పాటు నిమిత్తం మరోసారి భవనాలు పరిశీలించామని తెలిపారు. శాశ్వత భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదిక పంపామని, కార్యాలయాల ఏర్పాటు ఎక్కడా అనేది ఇంకా నిర్ణయించలేదని ఆర్డీవో వెల్లడించారు. ఆయనతో స్థానిక తహసీల్దార్ ఎన్.సత్యనారాయణ, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.