జిల్లా కార్యాలయాలు కొలిక్కి
-
భవనాల అప్పగింతకు సింగరేణి సంస్థ అంగీకారం
-
స్పీకర్ చొరవతో తొలగిన సమస్య
భూపాలపల్లి : జయశంకర్ జిల్లా తాత్కాలిక కార్యాలయాల ఏర్పాటుకు భవనాల సమస్య తొలగిపోయింది. జిల్లా కార్యాలయాలను సింగరేణి భవనాల్లో ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. కానీ సింగరేణి స్థానిక అధికారులు ఆయా భవనాలను ఇవ్వడం వీలు కాదంటూ ఇటీవల ప్రకటన విడుదల చేశారు. దీంతో భవనాల విషయమై అయోమయం నెలకొంది. చివరికి ఆయా భవనాలను అప్పగించేందుకు సింగరేణి సూత్రప్రాయంగా అంగీకరించింది. భూపాలపల్లి పట్టణం మంజూర్‌నగర్‌లోని సింగరేణి ఇందూ అతిథిగృహంలో కలెక్టరేట్‌తోపాటు మరో 10 శాఖల కార్యాలయాలు, మైనింగ్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్(ఎంవీటీసీ)లో ఎస్పీ కార్యాలయం, సీఈఆర్ క్లబ్‌లో ఎక్సైజ్, పీఆర్ ఇంజనీరింగ్, దేవాదు ల డేట్‌బేస్ సెంటర్‌లో ఆర్డీవో, ప్రభుత్వ ఐటీఐలో పలు శాఖల కార్యాలయాలు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. జాయింట్ కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్, ములుగు ఆర్డీవో మహేం దర్‌జీ ఆయా భవనాలను పరిశీలించారు. ఏయే గదులను ఏశాఖకు కేటాయించాలో వారం రోజుల క్రితమే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 6న సింగరేణి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. సింగరేణికి చెందిన ఇందూ అతిథిగృహం, ఎంవీటీసీ, సీఈఆర్ క్లబ్‌లు పరిపాలన, శాంతిభద్రతలు, చట్టపరంగా ఇవ్వడం వీలు కాదని అందులో పేర్కొంది. దీంతో సమస్య మళ్లీ మెుదటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి స్థానిక జీఎం పాలకుర్తి సత్తయ్య తో మాట్లాడారు. దీంతో ఆయా భవనాలను అప్పగించేందుకు జీఎం అంగీకరించారు. భూపాలపల్లిలో గనుల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం తమ సంస్థకు ఇప్పటివరకు సుమారు 4 వేల ఎకరాలకు పైగా అప్పగించిందని, ప్రభుత్వానికి తాము ఎల్లప్పుడూ సహకరిస్తామని పేర్కొన్నారు. ఈమేరకు శాసన సభాపతి, జాయింట్ కలెక్టర్, ములుగు ఆర్డీవో, వివిధ శాఖల జిల్లా అధికారులు ఈ నెల 8న భూపాలపల్లికి వచ్చి సింగరేణి భూపాలపల్లి ఏరియా జీఎంతో కలిసి సంస్థ భవనాలను పరిశీలించారు. జిల్లా కార్యాలయాలకు సింగరేణి భవనాలు అనుకూలంగా ఉన్నాయని రెవె న్యూ అధికారులు వెల్లడించారు. జేసీ ఆయా భవనాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఏ భవనం ఏ శాఖకు కేటాయించాలో స్థానిక అధికారులకు సూచించారు. భవనాల్లో చేయాల్సిన తాత్కాలిక మరమ్మతులను వివరించారు. మొత్తానికి జిల్లా కార్యాలయాల ఏర్పాటుకు తమవంతు సహకారం అందిస్తామని సింగరేణి సంస్థ తెలపడంతో కార్యాలయాలకు భవనాల సమస్య పరిష్కారమైంది.