డిసెంబర్ 31లోపు ఆర్కేనగర్ ఉప ఎన్నిక
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నై ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో డిసెంబర్ 31వ తేదీలోగా ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) గురువారం రాత్రి ఢిల్లీలో ప్రకటించింది. జయ మరణం తరువాత ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీన ఉప ఎన్నిక జరిగేలా గతంలో నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఆనాటి ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే (అమ్మ) అభ్యర్థి టీటీవీ దినకరన్ ఓటర్లకు విచ్చలవిడిగా నగదు, బహుమతులు పంచడం వివాదాస్పదమైంది.
ఇవే ఆరోపణలతో మంత్రి విజయభాస్కర్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసిన సమయంలో ఇందుకు తగిన ఆధారాలు దొరకడంతో ఉప ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఏప్రిల్ 9వ తేదీన ఈసీ ప్రకటించింది. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా ఆర్కేనగర్లో ఉప ఎన్నిక నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. ఉప ఎన్నిక సమయంలో రెండాకుల చిహ్నం కోసం శశికళ, పన్నీర్‌సెల్వం, దీప వర్గాలు పోటీపడడంతో అన్నాడీఎంకే పార్టీ, చిహ్నంపై ఈసీ తాత్కాలిక నిషేధం విధించింది.
మరలా జరిగే ఉప ఎన్నికల నాటికైనా రెండాకుల చిహ్నాన్ని సాధించాలనే ప్రయత్నంలో ఈసీకి రూ.50 కోట్ల లంచం ఇచ్చే ప్రయత్నంలో దినకరన్ పోలీసులకు పట్టుబడ్డాడు. నేడు మరలా ఉప ఎన్నిక సమీపిస్తుండగా అన్నాడీఎంకే వర్గాలు రెండాకుల చిహ్నం దక్కించుకోవడం కోసం అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. రద్దయిన ఎన్నిక సమయంలో పన్నీర్ సెల్వం వర్గ అభ్యర్థి మధుసూదనన్, శశికళ వర్గం అభ్యర్థి దినకరన్ ఈసారి కూడా పోటీకి దిగేందుకు సిద్ధమయ్యారు.