Jayanth C. Paranji
-
ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫస్ట్ సినిమా రీ-రిలీజ్
'ఈశ్వర్'తో గల్లీకుర్రాడి పాత్రలో తొలిసారి వెండితెరపై మెరిశాడు ప్రభాస్. అక్కడ ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఎంటో చూపిస్తున్నాడు. 2002లో విడుదలైన ఈశ్వర్ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్ కానుంది. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కోళ్ళ అశోక్ కుమార్ రూ. 50 లక్షల బడ్జెట్‌తో నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ. 5.3 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఈశ్వర్ మళ్లీ వస్తున్నాడు.అక్టోబర్ 23, 2024న ప్రభాస్ తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఆయన నటించిన సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇండస్ట్రీలో వస్తున్న నివేదికల ప్రకారం. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన తొలి చిత్రం ఈశ్వర్ రీ-రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈశ్వర్ సినిమాతో పాటు డార్లింగ్ కూడా అదేరోజు మళ్లీ విడుదల కానుంది.జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ఈశ్వర్ తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, ధీరజ్ కృష్ణ నోరి, రేవతి, రవికాంత్, హనుమంతు, ఎన్. హరి కృష్ణ, బ్రహ్మానందం వంటి నటీనటులు నటించారు. ఒక ఎమ్మెల్యే కూతురిని పేదింటి కుర్రాడు ప్రేమిస్తే వచ్చే చిక్కులు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారు. ఇందులో ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ తన మాస్ హీరోయిజం చూపించాడు. శ్రీదేవి విజయ్‌కుమార్ కూడా ఇందులో సరైన జోడిగా మెప్పించింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం. 'అమీర్‌పేటకు ధూల్‌పేటకు' అనే పాట అందరికీ ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత రాఘవేంద్రతో పర్వాలేదనిపించిన ప్రభాస్.. ఆ వెంటనే 'వర్షం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక్కడి నుంచి ఆయన గ్రాఫ్ భారీగా పెరిగింది. -
షాకింగ్! పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోయారేంటి?
తెలుగు ఇండస్ట్రీలోని రచయితలలో పరుచూరి బ్రదర్స్‌ది ప్రత్యేక స్థానం. వీరు ఇండస్ట్రీలో వందలాది సినిమాలకు రచయితగా పనిచేశారు. ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను టాలీవుడ్‌కు అందించిన ఘనత వీరి సొంతం. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరితోనూ కలిసి పని చేశారు. కొన్ని దశాబ్దాల పాటు సినీరంగంలో రచయితలుగా చక్రం తిప్పారు ఈ అన్నదమ్ములు. పరుచూరి బ్రదర్స్‌లో పెద్దవాడైన వెంకటేశ్వరరావు పలు సినిమాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ సత్తా చాటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పరుచూరి వెంకటేశ్వరరావు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. వయోభారంతో కృంగిపోతున్న ఆయనను ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాంజి కలిశారు. ఈ సందర్భంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోను శుక్రవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'నా గురువుగారు పరుచూరి వెంకటేశ్వరరావు ఇలా అయిపోవడం బాధగా ఉంది. కానీ ఆయన మానసిక స్థితి మాత్రం ఎప్పటిలాగే చురుకుగా ఉంది. పరుచూరి బ్రదర్స్ 300 పైచిలుకు సినిమాలకు రచయితగా పని చేయగా అందులో 200కు పైగా సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయం సాధించాయి' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు. బక్కచిక్కిపోయిన పరుచూరి వెంకటేశ్వరరావు లుక్‌ను చూసిన అభిమానులు గురువుగారు ఇలా అయిపోయారేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Jayanth C. Paranjee (@jayanthparanji) చదవండి: దుమ్మురేపిన ప్రభాస్.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ -
'పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావొద్దు'
పవన్ కళ్యాణ్ రాజకీయ ఆరంగేట్రంపై మీడియాతోపాటు సోషల్ మీడియాలో కూడా చర్చ బాగానే జరుగుతోంది. పవన్ రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు ఆహ్వానిస్తుండగా, మరికొందరు రావొద్దని సలహా ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావొద్దని టాలీవుడ్ దర్శకుడు జయంత్ సీ పరాంజీ సలహా ఇచ్చాడు. 'ఓ శ్రేయోభిలాషిగా పవన్ కు విజ్క్షప్తి చేస్తున్నాను. ప్లీజ్...ప్లీజ్...ప్లీజ్... రాజకీయాల్లోకి రావొద్దు. రాజకీయాలు ఓ రొంపి అని అన్నారు. ముక్కు సూటిగా వ్యవహరించే నీలాంటి వ్యక్తులకు రాజకీయాలు సరిపడవు. ఈ కుళ్లు పట్టిన ఈ వ్యవస్థను కడిగిపారేయాలంటే.. రాజకీయాలను ఎంచుకోకుండా మరో విధంగా సేవలందించాలి' సోషల్ మీడియాలో జయంత్ సూచించారు. పవన్ కళ్యాణ్ నటించిన 'తీన్ మార్' చిత్రానికి జయంత్ సి పరాంజీ దర్శకత్వం వహించారు. -
పునీత్ రాజ్‌కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా
పునీత్ రాజ్‌కుమార్ హీరోగా భారీ బడ్జెట్ సినిమా పునీత్‌తో చేయడం సంతోషంగా ఉంది: పరాన్జీ బెంగళూరు, న్యూస్‌లైన్: రాయలసీమ ఫ్యాక్షన్ దృశ్యాలను తెలుగు సినీ అభిమానులకు కళ్లకు కట్టినట్లు చూపించిన దర్శకుడు జయంత్ సి. పరాన్జీ కన్నడ సినీ రంగంలో అడుగు పెట్టారు. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌తో ఆయన ‘నిన్నిందలే’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. గురువారం ఆయన మల్లేశ్వరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమెరికాలోని న్యూయార్క్ నేపథ్యంలో సినిమా ఉంటుందని అన్నారు. మొత్తం సినిమా షూటింగ్ అక్కడే జరిగిందని అన్నారు. ఐదు శాతం మాత్రం బెంగళూరులో చిత్రీకరిచారని చెప్పారు. అమెరికాలో స్థిరపడిన కన్నడ కుటుంబాలు, కొత్తగా అక్కడికి వెళ్లిన కన్నడ కుటుంబాల మధ్య జరిగే కథ అన్నారు. అక్కడి పరిస్థితులు నేటి యువత, పెద్దల మనస్థత్వాల నేపథ్యంలో సినిమా ఉంటుందని అన్నారు. ఈ సినిమా తప్పకుండ అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని అన్నారు. మొదట రణబీర్ కపూర్ లేదా షాహిద్ కపూర్‌తో హిందీలో ఈ సినిమా చెయ్యాలని బావించానని, అనుకోకుండ పునీత్ రాజ్‌కుమార్‌కు కథ చెప్పడంతో ఒకే సిట్టింగ్‌లో ఓకే చేసి డేట్స్ ఇచ్చారని అన్నారు. తాను బెంగళూరులో పుట్టి ఇక్కడే హైస్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశానని గుర్తు చేసుకున్నారు. చిన్నపట్టి నుంచి డాక్టర్ రాజ్‌కుమార్ సినిమాలు చూసేవాడని, కన్నడలో మొదటి సినిమా అదే కుటుంబంలోని పునిత్రాజ్కుమార్తో చెయ్యడం ఆనందంగా ఉందని అన్నారు. పునీత్ , ఎరికా ఫెర్నాండెజ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నట్లు చెప్పారు. తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ నటుడు ఈ సినిమాలో న టిస్తున్నట్లు చెప్పారు. ఆయనను స్క్రీన్ మీద చూడాల్సిందేనని జయంత్ సీ. పరాన్జీ వివరించారు. తరువాత సినిమా సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో ఉంటుందని, స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని తెలిపారు.