'ఈశ్వర్'తో గల్లీకుర్రాడి పాత్రలో తొలిసారి వెండితెరపై మెరిశాడు ప్రభాస్. అక్కడ ప్రారంభమైన ఆయన ప్రస్థానం ఇప్పుడు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఎంటో చూపిస్తున్నాడు. 2002లో విడుదలైన ఈశ్వర్ సినిమా ఇప్పుడు రీ-రిలీజ్ కానుంది. దర్శకుడు జయంత్ సి. పరాన్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. కోళ్ళ అశోక్ కుమార్ రూ. 50 లక్షల బడ్జెట్‌తో నిర్మిస్తే.. బాక్సాఫీస్ వద్ద రూ. 5.3 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల కోసం ఈశ్వర్ మళ్లీ వస్తున్నాడు.
అక్టోబర్ 23, 2024న ప్రభాస్ తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఆయన నటించిన సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. ఇండస్ట్రీలో వస్తున్న నివేదికల ప్రకారం. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఆయన తొలి చిత్రం ఈశ్వర్ రీ-రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈశ్వర్ సినిమాతో పాటు డార్లింగ్ కూడా అదేరోజు మళ్లీ విడుదల కానుంది.
జయంత్ సి. పరాన్జీ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ఈశ్వర్ తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రీదేవి విజయ్‌కుమార్, ధీరజ్ కృష్ణ నోరి, రేవతి, రవికాంత్, హనుమంతు, ఎన్. హరి కృష్ణ, బ్రహ్మానందం వంటి నటీనటులు నటించారు. ఒక ఎమ్మెల్యే కూతురిని పేదింటి కుర్రాడు ప్రేమిస్తే వచ్చే చిక్కులు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించారు. ఇందులో ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ తన మాస్ హీరోయిజం చూపించాడు. శ్రీదేవి విజయ్‌కుమార్ కూడా ఇందులో సరైన జోడిగా మెప్పించింది. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికీ మనం వింటూనే ఉన్నాం.
'అమీర్‌పేటకు ధూల్‌పేటకు' అనే పాట అందరికీ ఫేవరెట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా తర్వాత రాఘవేంద్రతో పర్వాలేదనిపించిన ప్రభాస్.. ఆ వెంటనే 'వర్షం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక్కడి నుంచి ఆయన గ్రాఫ్ భారీగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment