జపాన్ బ్యాంక్‌తో జీఎంఆర్ ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్‌తో(జేబీఐసీ) మౌలిక రంగ సంస్థ జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా జీఎంఆర్ గ్రూప్‌కు చెందిన ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టే జపాన్ కంపెనీలకు జేబీఐసీ తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణ సహాయం చేస్తుంది. పారిశ్రామిక పార్కులు, విద్యుత్, శక్తివనరులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, రైల్వేల వంటి ప్రాజెక్టుల్లో జపాన్ కంపెనీలు పాలుపంచుకునేందుకు అవకాశాలను కల్పించాలన్నది జేబీఐసీ ఉద్దేశం.
భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్ పర్యటనలో భాగంగా మంగళవారం టోక్యోలో ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్టు జీఎం ఆర్ తెలిపింది. జపాన్ పెట్టుబడులను ఆకర్షించేందుకు వచ్చే 12 నెలల్లో ఇరు సంస్థలు కలిసి వివిధ ప్రాజెక్టులను గుర్తిస్తాయి. ప్రైవేటు రంగ కంపెనీతో ఇటువంటి అంతర్జాతీయ ఒప్పందం జరగడం ఇదే తొలిసారి అని జీఎంఆర్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ చైర్మన్ బీవీఎన్ రావు ఈ సందర్భంగా తెలిపారు. 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో భారత మౌలిక రంగంలో ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు అవసరమని అంచనా. ప్రైవేటు కంపెనీల పెట్టుబడులు ఈ రంగంలో కీలక పాత్ర పోషించనున్నాయి.