రూ.70 కోట్లతో ఎలక్ట్రానిక్ క్లస్టర్
సాక్షి, అనంతపురం: జిల్లాలో ప్రగతి పరుగులందుకోనుంది. వెనకుబడిన అనంతపురం జిల్లాలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పారిశ్రామికీకరణే మార్గం అని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరకు అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కల్పించే ప్రత్యేక రాయితీతో సాఫ్ట్వేర్ పారిశ్రామికుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలూ సానుకూల ఫలితాలు అందిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో పెట్టుబడులను ఆహ్వానించడం వల్ల పలువురు పారిశ్రామిక వేత్తలు జిల్లాకు తరలివస్తున్నారు.
ప్రధానంగా చిలమత్తూరు మండలానికి మంచి రోజులు రాబోతున్నాయి. రూ.70 కోట్లతో ఎసినా రాఘమయూరి ఎలక్ట్రానిక్స్ పార్కు ప్రైవేటు లిమిటెడ్ ఆధ్వర్యంలో చిలమత్తూరులో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నారు. క్లస్టర్ పరిధిలో దేశ, విదేశాలకు చెందిన ఆరు సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉత్పత్తుల నెలకొల్పే యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చాయి. ఈ మేరకు గురువారం రాష్ర్ట ఐటీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, ఎల్సినా రాఘమయూరి ఎలక్ట్రానిక్ పార్కు ప్రైవేటు లిమిటెడ్ ఎండా కె.జే.రెడ్డి, సీఈఓ భాస్కర్‌రెడ్డి, జేసీ ఎస్.సత్యనారాయణలు చిలమత్తూరులో పర్యటించారు.
ఈ మేరకు ఎసినా రాఘమయూరి ఎలక్ట్రానిక్స్ పార్కు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న పనులను పరిశీలించారు. క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేజే రెడ్డికి మంత్రి హామీనిచ్చారు. ఫలితంగా మరికొన్ని కంపెనీలు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. సంస్థ ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో భూగర్భ జలాలను పరిశీలించగా, జలాలు సమృద్ధిగా ఉన్నట్లు గుర్తించారు.
వ్యవస్థాపరమైన నిర్మాణాలు చేపట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలకు అప్పగించనున్నట్లు సంస్థ ఎండీ కేజీరెడ్డి తెలిపారు. క్లస్టర్ పరిధిలో ఉన్న హిందూపురం, పుట్టపర్తి, పెనుకొండ ప్రాంతాలలో విద్యావంతులైన యువతీ, యువకులు అందుబాటులో ఉన్నారని, దాదాపు పది వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. ఎలక్ట్రానిక్ క్లష్టర్ సమీపంలోనే ఇంకుబేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా అనువైన భూమి ఉందని జేసీ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.