j.c.diwakar reddy
-
చైతన్య రాజును బాగా బెదిరించారు: జేసీ
కాంగ్రెస్ పెద్దల బెదిరింపుల వల్లే రాజ్యసభ ఎన్నికల బరిలో రెబల్ అభ్యర్థిగా రంగంలోకి దిగిన చైతన్య రాజు పోటీ నుంచి తప్పుకున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆదాల ప్రభాకర్ రెడ్డి సమైక్యవాదం వినిపించడానికే రాజ్యసభ ఎన్నికలలో పోటీ చేస్తున్నారని చెప్పారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఫిబ్రవరి 7న జరిగే రాజ్యసభ ఎన్నికల ఫలితాలతో ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్థులను ప్రకటించిందని, నాలుగో అభ్యర్థిని కూడా ప్రకటించి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. నాలుగో అభ్యర్థి కూడా తప్పక విజయం సాధించేవారని అన్నారు. నాలుగో అభ్యర్థిని ప్రకటించకుండా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. అలాగే రాజ్యసభ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు టిక్కెటు ఇస్తే బాగుండేదని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. -
సీఎం కిరణ్ అధిష్టానం మనిషే: జేసీ దివాకర్‌రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నూటికి నూరు శాతం కాంగ్రెస్ అధిష్టానం మనిషేనని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సీఎల్పీ కార్యాలయ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల్లో బలంగా సమైక్యవాదం ఉన్నందున అధిష్టానానికి అదే చెబుతున్నారని, రేపు హైకమాండ్ పిలిస్తే ఢిల్లీ వెళ్లి రాష్ట్రంలో నెలకొన్న సమైక్య అనుకూల, ప్రతికూల పరిస్థితులను వివరిస్తారని పేర్కొన్నారు. కిరణ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పిస్తారంటూ వస్తున్న వార్తలను జేసీ కొట్టిపారేశారు. 2014 వరకు కిరణే సీఎంగా కొనసాగుతారన్నారు. కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి తనకు వ్యక్తిగతంగా సన్నిహితుడని, రాయలసీమకు చెందిన ఆయన సీఎం అయితే స్వాగతిస్తానని చెప్పారు. -
ఆర్.తెలంగాణకు ఆ పార్టీలు అనుకూలమే: జేసీ
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఇక వెనక్కి తగ్గేలా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ కావాలని రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లా నేతలం అధిష్టానాన్ని కోరుతున్నామని తెలిపారు. రాయల తెలంగాణకు టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతోపాటు టి.కాంగ్రెస్ నేతలు అనుకూలంగానే ఉన్నారని గుర్తు చేశారు. పార్లమెంట్లో రాయల తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా బీజేపీని ఒప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. రాయల తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఎంపిక సులువు అవుతుందన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ ప్రాంతంతో కలసిన రాయలసీమ సంస్కృతికి ఇబ్బంది ఉండదని అన్నారు. రాష్ట్ర మంత్రి శైలజానాథ్‌కు పెద్ద పదవిపై కన్ను పడిందని జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. అందుకే ఆయన రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణపై త్వరలో కర్నూలు, అనంతపురం ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నట్లు జేసీ దివాకర్‌రెడ్డి వెల్లడించారు.