రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం ఇక వెనక్కి తగ్గేలా లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి సోమవారం హైదరాబాద్లో అభిప్రాయపడ్డారు. రాయల తెలంగాణ కావాలని రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లా నేతలం అధిష్టానాన్ని కోరుతున్నామని తెలిపారు. రాయల తెలంగాణకు టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలతోపాటు టి.కాంగ్రెస్ నేతలు అనుకూలంగానే ఉన్నారని గుర్తు చేశారు. పార్లమెంట్‌లో రాయల తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా బీజేపీని ఒప్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
రాయల తెలంగాణ ఏర్పడితే సీమాంధ్ర ప్రాంతానికి రాజధాని ఎంపిక సులువు అవుతుందన్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాలు తెలంగాణ ప్రాంతంతో కలసిన రాయలసీమ సంస్కృతికి ఇబ్బంది ఉండదని అన్నారు. రాష్ట్ర మంత్రి శైలజానాథ్కు పెద్ద పదవిపై కన్ను పడిందని జేసీ దివాకర్రెడ్డి ఆరోపించారు. అందుకే ఆయన రాయల తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణపై త్వరలో కర్నూలు, అనంతపురం ప్రజాప్రతినిధులు సమావేశం కానున్నట్లు జేసీ దివాకర్రెడ్డి వెల్లడించారు.