ఎమ్మార్ ఆస్తులపై ఈడీ కొరడా
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్ ఆస్తులపై ఢిల్లీ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) కొరడా ఝుళిపించింది. హైదరాబాద్‌లోని ఎమ్మార్ హిల్స్ టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన 25,810 చదరపు అడుగుల నివాస స్థలాన్ని అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం 2002లోని సెక్షన్ 5(1) కింద ఈ ఆస్తుల అటాచ్మెంట్ జరిగినట్టు హైదరాబాద్‌లోని ఈడీ సంయుక్త సంచాలకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్థలాలు గచ్చిబౌలి, మణికొండ, బౌల్డర్ హిల్స్ కమ్యూనిటీ ప్రాంతాల్లో ఉన్నట్టు పేర్కొన్నారు. అటాచ్మెంట్ అయినందున ఆయా స్థలాల కొనుగోలు, అమ్మకం, బదిలీ వంటివి చేయరాదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలో స్థానిక నానక్‌రాంగూడ ఐటీజోన్ పరిధిలోని ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో ఉన్న 19 విల్లాలకు ఈడీ హైదరాబాద్ జోనల్ కార్యాలయ అధికారులు నోటీసులు అంటించారు. మూడు కారుల్లో ఇక్కడికి చేరుకున్న అధికారులు విల్లాలను, స్థలాలను పరిశీలించారు. అనంతరం ఈడీ ప్రాంతీయ జేడీ శ్రీధర్ సంతకంతో ఉన్న నోటీ సులను వాటికి అంటించి విషయాన్ని ఎమ్మార్ ప్రాపర్టీస్ జీఎం నళినీకాంత్‌కు వివరించారు. విల్లాలు కొనుగోలు చేసిన వారి నుంచి ఎక్కువ ధర వసూలు చేసిన ఎమ్మార్.. తక్కువ ధరకు అమ్మినట్టు చూపడంతో దాదాపు రూ.48 కోట్లు తేడా వచ్చిన విషయం సీబీఐ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే.