ఓటు వేయలేదని మహిళపై సజీవదహన యత్నం
సాక్షి, ముంబై: తాము చెప్పిన అభ్యర్థికి ఓటు వేయలేదని ఓ మహిళను సజీవదహనం చేసేందుకు దుండగులు యత్నించారు. ఈ సంఘటనలో జెలుబాయి వాబలే (65) తీవ్ర గాయాలయ్యాయి. కాగా ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. యేవ్లా పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫుల్మాలి ‘సాక్షి’కి అందించిన వివరాల మేరకు.. నాసిక్ జిల్లా యేవ్లా తాలూకా బాభుల్గావ్ గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన అశోక్ బోరనారే, పాండురంగ బోరనారే, నందకిషోర్ భూరక్ బుధవారం ఓటు వేసేందుకు బయలుదేరిన జెలూబాయి వాబలేకు మూడవ నంబర్ బటన్ (మీట) నొక్కాలని చెప్పారు. అయితే వయసు పైబడడంతో ఆమె రెండవ నంబర్ మీట నొక్కింది. ఇది తెలుసుకున్న నిందితులు ముగ్గురు గురువారం రాత్రి జెలుబాయిపై దాడిచేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. ఇంటిబయటే కూర్చున్న ఆమెను చూసి చివాట్లు పెడుతూ ఇంట్లో ఉన్న కిరసనాయిల్ ఒంటిపై పోసి నిప్పంటించారు. సుమారు 60 శాతం కాలిన ఆమెను నాసిక్ సివిల్ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అర్ధరాత్రి ముగ్గురు నిందితులపై కేసు నమోదుచేసుకుని అరెస్టు చేశారు.