వృద్ధులకు స్వర్గధామం.. జీవన క్షేత్ర ఆశ్రమం
అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రకృతి వైద్యం
గోఆధారిత వంటలతో సంపూర్ణ భోజనం
30 ఏళ్లలో వేలాది మందికి యోగా శిబిరాలు
మల్లికార్జున గురూజీ ఆధ్వర్యంలో ఆశ్రమం ఏర్పాటు
కరుణాపురంలో త్వరలో ప్రారంభం
కరుణాపురం (స్టేషన్‌ఘన్‌పూర్) : మలిదశలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని అక్కున చేర్చుకునేందుకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని జీవన క్షేత్ర వృద్ధాశ్రమం సిద్ధమవుతోంది. తమ వద్దకు వచ్చే పండుటాకులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించేందుకు ముస్తాబవుతోంది. వివరాల్లోకి వెళితే.. పెద్ద పెండ్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని కరుణాపురంలో సుమారు 15 ఎకరాల విశాలమైన స్థలంలో, ప్రశాంతమైన వాతావరణంలో సనాతన సంస్కృతి విద్యా కేంద్ర వ్యవస్థాపకులు మల్లికార్జున గురూజీ ఆధ్వర్యంలో జీవన క్షేత్ర వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నేటి ఆధునిక యుగంలో చాలా మంది వృద్ధులు అన్నీ ఉండి కూడా శారీరకంగా, మానసికంగా అనాథలుగా బాధపడుతున్నారు. అయితే వృద్ధాప్యం శాపం కాదని.. మలిదశలో బాల్య వ్యవస్థను తిరిగి పొంది ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని చెబుతూ ముందుకుసాగేందుకు అన్ని వనరులు సమకూర్చుకుంది జీవనక్షేత్ర వృద్ధాశ్రమం. ఎలాంటి లాభాపేక్ష లేకుండా.. వయో వృద్ధులకు సేవ చేస్తూ వారిలో ఆనందాన్ని నింపడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేసేందుకు సిద్ధమైంది.
మానసిక ప్రశాంతత..
జీవనక్షేత్ర ఆశ్రమంలో చేరే వారికి గోఆధారిత వంటలతో భోజనం అందించనున్నారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రకృతి వైద్యం అందించి నిర్వాహకులు వారికి అండగా నిలువనున్నారు. ఆశ్రమం ఆధ్వర్యంలో ఇప్పటివరకు వేలాది మందికి యోగా శిబిరాలు నిర్వహించి వారికి మానసిక ప్రశాంతత చేకూర్చారు. త్వరలో ప్రారంభంకానున్న ఆశ్రమంలో చేరేందుకు ఇప్పటివరకు 15 మంది వృద్ధులు పేర్లు నమోదు చేసుకున్నారు.
వృద్ధులకు సేవ చేసేందుకే..
తమ ఆశ్రమం ఆధ్వర్యంలో 30 ఏళ్లలో వేలాది మందికి యోగా క్యాంపులు నిర్వహించాం. వృద్ధులకు సేవ చేయాలనే లక్ష్యంతోనే కరుణాపురంలో జీవన క్షేత్ర వృద్ధాశ్రమాన్ని నెలకొల్పుతున్నాం. ఆశ్రమంలో చేరే వారికి ప్రతి రోజు యోగా చేయించడంతో పాటు ప్రకృతి వైద్యం అందిస్తాం. అలాగే గోఆధారిత వంటలతో భోజనం అందిస్తాం. 50 ఏళ్లకు పైబడిన స్త్రీ, పురుషులు ఆశ్రమంలో చేరవచ్చు. పూర్తి వివరాలకు 98660-15666, 98484-42355 నంబర్లలో సంప్రదించవచ్చు.
- మల్లికార్జున గురూజీ, జీవనక్షేత్ర ఆశ్రమ వ్యవస్థాపకులు