Jeevankalam
-
కీర్తి
మేడమ్ మాయావతి గారు ఈ మధ్య అద్భుత మైన భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ భవనం ముఖద్వారం దగ్గరే ఒకటి కాదు తన విగ్రహాలు నాలుగింటిని మన అశోక చక్రంలో సింహాల్లాగా నాలుగు దిక్కులూ చూస్తున్నట్టు నిర్మించుకున్నారు. విగ్రహాల ద్వారా శాశ్వత కీర్తిని సంపాదించుకోవచ్చని నమ్మిన నాయకురాలు మాయావతి. దీనిలో ఒక సుఖం ఉంది. ఎవరి ఇంటిలో వారు తమ విగ్రహాలు పెట్టుకోవడం ఎవరి దురదను వారే గోక్కోవడం లాంటిది. ఆమె పదవిలో ఉన్న రోజుల్లో లక్నోలో ఏనుగుల విగ్రహాలతోపాటు తన విగ్రహం, తమ నాయకుడు కాన్షీరాంగారి విగ్రహంతో పెద్ద పార్కుని నిర్మించారు. కీర్తి ఎంత ప్రయత్నించినా వదలని దురద. గోకినకొద్దీ రెచ్చిపోతుంది.ఇది చాలా సంవత్సరాల కింద పత్రికలో వచ్చిన వార్త. ఒక మహానగరంలో వరసగా హత్యలు జరుగుతున్నాయట. పోలీసులకు ఎంత ప్రయత్నించినా కారణం దొరకడం లేదు. ఒక హత్యకీ మరొక దానికీ పొంతన లేదు. సాధార ణంగా నేరస్థుడికి ఒక ‘ఒడుపు’ ఉంటుంది. అది పోలీసులకు పట్టి ఇస్తుంది. ఈ వరస హత్యలలో అలాంటి పొంతన దొరకడం లేదు. పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ప్రజలు భయభ్రాంతులవు తున్నారు. ఎట్టకేలకు హంతకుడు దొరికాడు. ‘‘ఏమయ్యా, ఎందుకీ హత్యలు చేస్తున్నావు?’’ అని పోలీసులు నిలదీశారు. హంతకుడు తృప్తిగా సెలవిచ్చాడు. ‘‘బాబూ! నాకు చదువూ సంధ్యా లేదు. ఏ ప్రత్యేకతా లేదు. అడ్డమయినవాళ్లూ రక రకాల కారణాలకి ‘కీర్తి’ని ఆర్జిస్తున్నారు. నాకు ఇలా ఆర్జించాలనిపించింది. నాకు చేతనయిన పని చేశాను. నా ఫోటో జాగ్రత్తగా వేయించండి. పేరులో స్పెల్లింగు తప్పు రాకుండా చూడండి’’ అన్నాడట. కీర్తి ప్రయత్నించినా వదులుకోలేని వ్యసనం. తలవంచిన కొద్దీ పీకకి చుట్టుకుంటుంది.చాలా సంవత్సరాల కిందట మద్రాసు మౌంట్ రోడ్డులో బుహారీ సెంటర్లో చాలా అంద మైన కరుణానిధిగారి విగ్రహం ఉండేది. డీఎంకే పాలనలో ఆయన భక్తులు, అనుచరులు, నాయ కుని విగ్రహం నెలకొల్పారు. ఏఐఏడీఎంకే పార్టీవారికీ, నాయకులకీ ఆ విగ్రహం కంటగిం పుగా ఉండేది. బతికున్న నాయకుల విగ్రహాలు నెలకొల్పడం న్యాయమా? అని మీమాంస లేవదీ శారు. కరుణానిధి తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎంజీ రామచంద్రన్ మరణించాక జరిగిన అల్ల ర్లలో కొందరు దుండగులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కీర్తి అందమయిన గాజు కుప్పె లాంటిది. చెయ్యి జారినా, చెయ్యి ‘జార్చినా’ విరిగి ముక్క లవుతుంది. అలనాడు విజయవాడ ఏలూరు కాలువ పక్కన నీలం సంజీవరెడ్డిగారి విగ్రహం ఉండేది. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలంటూ నడిచిన ఉద్యమంలో ఆందోళనకారులు ఈ విగ్ర హాన్ని పగలగొట్టి కాలవలోకి విసిరేశారు. కీర్తి కొందరి ప్రతిష్టకి దగ్గర తోవ. కాలం ఆ తోవకి పెద్ద గండి.1930 ప్రాంతాలలో రాఫేల్ ట్రూజిల్లో అనే ఈజిప్టు పాలకుడు ఉండేవాడట. ఆయన గొప్ప తనం ఏమిటంటే ఆయన ఎన్నికకి దేశంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయట! (ఆయన ఉపయోగించిన ఓటింగు మెషీన్లు ఏమిటో మన ప్రతిపక్షాలు వాకబు చెయ్యాలి!) ఆయన కీర్తికి దగ్గర తోవ కనిపెట్టి కేవలం రెండు వేల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టింపచేశారట. 1961 మే 30న ఆయన హత్యకు గురి అయ్యే వరకూ ఆ విగ్రహాలు వర్ధిల్లాయట. తర్వాత? పెట్టుబడితో సంపాదించిన కీర్తి అకాలంలో పూసిన గడ్డిపువ్వులాంటిది. దాని పుట్టుక, చావు ఎవరి మనస్సులోనూ నిలవదు. మన ఊళ్లలో చూస్తూంటాం. రోడ్డు పక్కన బస్సు షెల్టర్లుంటాయి. వాటి మీద పెద్ద అక్షరా లతో, ‘‘అప్పడం తాతయ్యల స్మారకార్థం, వారి కుటుంబ సభ్యులు–మావుళ్లయ్య, మనవాళ్లమ్మ, ధనశ్రీ, చింటూ, ధమ్ము, టుమ్మీ’’ అని. కొన్నాళ్లు బాగానే వారి కీర్తి వ్యాపిస్తుంది. ఒక వర్షాకాలం రోజున బలిసిన ఎద్దు సగం తడిసిన ఆ షెల్టరుకి వీపుని రుద్దుతుంది. అప్పటికే నీరసించిన ఆ షెల్టరు కూలి బోర్డు మీద సగం అక్షరాలు మిగు లుతాయి. కీర్తికి జంతుదోషం పడుతుంది. విగ్రహాల ద్వారా కీర్తిని ఎల్లకాలం నిలుపు కోవాలన్న యావ అతి ప్రాథమికమయిన ఆలో చన. నిజమైన కీర్తి మానవాళికి జరిగిన ఉపకారం, మానవ మేధస్సుని ప్రభావితం చేసిన గొప్ప సాంస్కృతిక కృషి, హృదయాల్ని రసప్లావితం చేయగల అమరగానం, మౌలిక సాధన–ఇలాంటి అపురూప వైభవాలకు ప్రతీకగా సమాజం విగ్ర హాల రూపంలో నిక్షిప్తం చేసుకుంటుంది. విగ్రహం ఒక మహాత్ముని ఉపకారానికి కృతజ్ఞత. జాతి సమర్పించే నివాళి. మహాత్ములు కీర్తి వెంటపడరు. కీర్తి మహాత్ముల్ని ఆశ్రయించుకు నిలుస్తుంది. కీర్తికి విగ్రహం పెట్టుబడి కాదు. విగ్రహం సంకేతం. కీర్తికి విగ్రహం గమ్యం కాదు. కృషికి విగ్రహం చిరునామా. గొల్లపూడి మారుతీరావు -
కొత్త నియోజకవర్గం
ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాత కూడా విమోచన లేదు. మా నమశ్శివాయని ఈ కాలమ్ పాతికేళ్లుగా చదువుతున్నవారయితే గానీ ఎరగరు. కొంచెం ముక్కుమీద గుద్దినట్టు మాట్లాడేమనిషి. మనిషి కాస్త ఖండితంగా చెప్తాడు. ఎదుటివాడు ఏమనుకుంటాడో ఆలోచించడు. ఇప్పుడు ఇది చూడండి. ముందు మనదేశంలో రేపుల కథల నమూనాలు చూద్దాం. ఇది ఒక పత్రిక మొదటి పేజీ కథ. బీహార్ జహానాబాద్‌లో కేవలం నలుగురు యువకులు ఒకమ్మాయిపై అత్యాచారం చేశారు. ఇందులో మరో నలుగురయిదుగురు యువకులు కూడా చేయి కలిపారని ఈ వీరులు చెప్పారు. శ్రీనగర్ కథువా జిల్లాలో 8 ఏళ్ల అమ్మాయిని కొందరు అత్యాచారం చేసి చంపేశారు. ఒడిశా కేంద్రపానికా పోలీసు స్టేషన్ పరిధిలో ఒక సొంత మేనమామ నాలుగేళ్ల అమ్మాయిని అత్యాచారం చేశాడు. ఉత్తరప్రదేశ్ కనుజ్ ప్రధాన్ జిల్లాలో ఇద్దరు ప్రబుద్ధులు ఒక అమ్మాయిని రేప్ చేస్తుండగా మరో ఇద్దరు శృంగార పురుషులు వీడియో తీసి నలుగురికీ పంచారట. ఒడిశా లోని జగన్నాథపూర్‌లో కేవలం 6 ఏళ్ల ఆడపిల్ల అత్యాచారానికి గురై 8 రోజులు ప్రాణాల కోసం పోరాడి చచ్చిపోయింది. జమ్ములో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు 24 ఏళ్ల స్త్రీపై అత్యాచారం జరిపి, వీడియో తీసి, ఈ విషయాన్ని బయటపెడితే వీడియోను అందరికీ పంచుతామని హెచ్చరించారట. అన్నిటికన్నా విడ్డూరం– ఇలా రేప్ చేసిన నేరస్తుల్ని శిక్షించే చట్టాన్ని రాష్ట్రపతి అమలు జరిపే ’రోజున’ కేవలం 110 రేప్‌లు మాత్రమే జరిగాయట. ఉత్తరప్రదేశ్ ఇందులో మళ్లీ అగ్రస్థానం. మన నెల్లూరులో చెన్నూరు గ్రామంలో ఓ ఆరేళ్ల అమ్మాయిపై ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ మైనర్ కుర్రాడు అత్యాచారం చేశాడట. బీహార్‌లోని ఉన్నావ్‌లో ఓ 9 ఏళ్ల అమ్మాయిని ముజాఫర్పూర్లో అయిదుగురు అత్యాచారం చేశారు. ఒడిశాలో నయాఘర్ జిల్లాలో దేవరాజ బారిక్ అనే వ్యక్తి ఒక మహిళపై రెండు నెలలుగా అత్యాచారం సల్పుతుండగా ఆ అవమానం భరించలేక ఆమె నిన్న ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి కేసులు 11,12,628 ఉన్నాయని నిన్న సుప్రీం కోర్టు ప్రకటించింది. వీటిలో మళ్లీ అగ్రస్థానం ఉత్తరప్రదేశ్–30,883 కేసులు. తర్వాతి స్థానం చెప్పి ముగిస్తాను: మహారాష్ట్రలో 16,099 కేసులు. ఇంత చెప్పాక వీరినందరినీ ఉరి తీయడం సబబు కాదంటాడు మా నమశ్శివాయ. ఈ ప్రభుత్వం చట్టమయితే చేసింది కానీ– ఏదీ? దమ్ముంటే ఒక్క కుర్రాడిని ఉరి తీయమనండి. రాజీవ్ గాంధీని మారణ హోమం చేసిన నేరస్థురాలికి 22 సంవత్సరాల తర్వాతే విమోచన లేదు. మనకి మానవ హక్కుల చట్టాలున్నాయి. మానవతావాదులున్నారు. మతాలున్నాయి. రైళ్లు తగులబెట్టే కులాలున్నాయి. రైళ్లని ఆపే ప్రాంతాలున్నాయి. జాతులున్నాయి. వర్గాలున్నాయి. చిట్టచివరిగా పార్టీలున్నా యి. నిన్న జైలు శిక్షపడితేనేంగాక – ఆసారాం బాపూలున్నారు. వీరందరూ ఊరుకుంటారా? చచ్చిపోయిన ఆ రేళ్ల బిడ్డ మరణం కంటే చావవలసిన 15 ఏళ్ల కుర్రాడి భ విష్యత్తుని గురించి జెండాలు పట్టుకుని బయలుదేరరా? దేశం పేరు ఇప్పుడు గుర్తులేదు గానీ– ఆ దేశంలో ఒకడు బజారులో పరిగెత్తుతున్నాడు. పోలీసులు వెంట తరుముతున్నారు. ఆ కుర్రాడు కిందపడ్డాడు. కదులుతున్న అతని తలమీద తుపాకీ ఉంచి కాల్చాడు పోలీసు. కుర్రాడు చచ్చిపోయాడు. ఎందుకయినా మంచిదని మరొకసారి కాల్చాడు. బజారులో వందలాది మంది ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. మరి కనిపించని వెనుకవారి మాట? ఆ దృశ్యాన్ని ఒక క్రేన్‌కి కట్టి ఊరేగించారు. భయంకరం. అక్కడ మానవ హక్కుల సంఘం లేదా? మానవ సంఘాలు లేవా? మతప్రముఖులు లేరా? ఒక్కటి మాత్రం ఆ తర్వాత లేదు. రేప్. ఈ దేశంలో ఒక కుర్రాడిని ఉరితీయమనండి. పేపర్లు విరగబడతాయి. ఇంకా మన అభిమాన హీరో సల్మాన్ ఖాన్ నల్లజింక కేసే 20 ఏళ్లుగా నడుస్తోంది. ఇంకా దానికి దిక్కులేదు. మరి రాష్ట్రపతి గారి చట్టం ప్రకారం–ఒక అత్యాచారానికి నలుగురిని వేసుకున్నా 4 లక్షల ఓట్లు వృ«థా. కనుక వీరిని ఒక వర్గంగా గుర్తించి ’రేప్‌లS నియోజకవర్గం’ అనో ఇంకా దమ్ముంటే ’రేపటి నియోజకవర్గం’ అనో గుర్తించాలంటాడు మా నమశ్శివాయ. అందువల్ల మనకి కొందరయినా మంత్రులు మిగులుతారు, మత గురువులు మిగులుతారు. స్థానిక నాయకులు మిగులుతారు. జైళ్లు ఖాళీ అవుతాయి. దేశం ’రేపుయుతం’గా ఉంటుంది. మరి ఈ నియోజకవర్గం ఏ పార్టీని సమర్థించాలా అన్నది అప్పుడే కొందరి మనసుల్లో కదిలిన మీమాంస. అయ్యా, ముందు అత్యాచారాలు విరివిగా జరగనివ్వండి. 2019 దగ్గర పడనివ్వండి. రేపు సంగతి తర్వాత చూద్దాం. ఏమయినా మా నమశ్శివాయ గట్టి పిండం. గొల్లపూడి మారుతీరావు -
'బాస రసాబాస’
‘సాక్షి’ వ్యాసాలను అజరామరం చేసిన పానుగంటి లక్ష్మీనరసింహారావు గారు ఆరోజుల్లోనే తమ పిల్లలకు తెలుగు రాదని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రుల వ్యవస్థను ఊహించారు. దాదాపు యాభై సంవత్స రాల కిందట నవ్య సాహితీ సమితి వ్యవస్థాపకులు, ప్రము ఖ కవి తల్లావఝుల శివశం కరస్వామిని ఒకే ఒక్కసారి అనకాపల్లిలో కలిశాను. నన్ను పరిచయం చేయగానే ఆయన ‘‘మీ పేరులోనే వ్యాకరణ దోషం ఉందేమిటి? ‘మారుతీ రావు’ అంటారెందుకని?’’ అన్నారు. నేను నవ్వి ‘‘అభి మానులు నా పేరును అలా సాగదీశారు’’ అన్నాను - కేవలం చమత్కారానికే. ‘మారుతీరావు’ తప్పు. ‘మారు తిరావు’ అని ఉండాలి. ఏ తరానికాతరం భాష తగలడిపోతోందనుకోవ డం రివాజు. తగలడిపోవడమూ రివాజే. అప్పుడెప్పుడో విశ్వనాథ సత్యనారాయణగారు ‘‘నా మాతృభాష నానా దుష్ట భాషల యౌద్ధత్యమును దలనవధరించి...’’ అని వాపోతూ ‘ఏమి మిగిలినదీనాటికిట్లు పొంగులొలయు వర్షానదీగభీరోదకముల దైన్య గర్భ చారిత్రముల్ దక్క!’ (ఆంధ్రప్రశస్తి) అన్నారు. చాలా సంవత్సరాల తర్వాత మరో మహాకవి కాళోజీ ‘‘అన్య భాషలు నేర్చి ఆంధ్రం బు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా!’’ అని హూంకరించారు. ఈ మధ్య లోక్‌నాయక్ ఫౌండేషన్ సభలో సుప్రీం కోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ ప్రసంగిస్తూ, ‘‘ఏ రోజు దినపత్రిక తీసినా 50 శాతం సంకరభాష కనిపి స్తుంద’’న్నారు. రాష్ట్రాలు విడిపోయి ‘‘ప్రాంతీయ భాష మా హక్కు, దాన్ని మెరుగు పరచి ప్రామాణిక వ్యాకరణాన్ని ఏర్పరచాలి’’ అని ఈ మధ్య గొంతులు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ భాషా సౌందర్యం ఆ భాష పలుకుబడిలో దశాబ్దాలు ప్రజల నోళ్లలో నలిగి నలిగి సంతరించుకు న్నది. గండశిల సాలగ్రామమయినప్పటి సౌందర్యమది. మిత్రుడు కోట, తనికెళ్ల భరణి తెలంగాణ మాండలికం మాట్లాడితే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. రావిశాస్త్రి, పతంజలి కథలు ఉత్తరాంధ్ర భాషలో బలాన్నీ, జవాన్నీ పుణికి పుచ్చుకున్నాయి. కృష్ణాజిల్లా భాష సౌందర్యాన్ని గుర్తుపట్టాలంటే - నా మట్టుకు 50 సంవత్సరాల కిం దటి మాధవపెద్ది గోఖలే ‘మూగజీవాలు’ చదవాల్సిందే. భాష పరిణామానికీ, నిగ్గు తేలిన నిసర్గ సౌందర్యానికీ ఇవి ఉదాహరణలు. మళ్లీ దీనికి వ్యాకరణమేమిటి? ప్రామాణిక భాషకు వ్యాకరణం కాని, వ్యావహారిక భాషకు కాదుగదా! ఈ ప్రశ్న వెంటే మనసులో మెరిసే మెరుపు ఒక టుంది. లిపిలేని ఒక గిరిజన సవర భాషకు 1931లోనే రూపాన్నీ, వ్యాకరణాన్నీ సృష్టించి; సమగ్రమైన నిఘం టువును రూపొందించిన మహానుభావుడు గిడుగు రామ్మూర్తిగారిని ఎలా మరిచిపోగలం? అయితే పలుకు బడిలో నలిగి రూపు దిద్దుకున్న సౌందర్యానికీ, అజ్ఞా నంతో మిడి మిడి జ్ఞానంతో గబ్బు పట్టించే ప్రయ త్నానికీ చాలా తేడా ఉంది. విశ్వనాథ వారు, కాళోజీ, చలమేశ్వర్ గారు వాపోయినదదే. భాష సంకరానికి ప్రథమ తాంబూలం- టీవీ చానళ్లు. ఇప్పుడిప్పుడే టీవీ ధర్మమా అని సినీమా రెండో స్థానానికి వెళ్లింది. ‘పెల్లి’, ‘మల్లి’, ‘వెల్లారు’ ‘చేసారు’- ఇలాంటివన్నీ కోకొల్లలు. ఇక - బాధ్యతగల చానళ్లలోనే ‘తెలుగేతర’, ‘తెప్పోత్సవం’, ‘హృదయనొప్పి’, ‘అశ్రు తాంజలి’ వంటి బూతుమాటలు సమృద్ధిగానే వినిపి స్తున్నాయి. ‘అశ్రువు’ అంటే కన్నీరు. ‘అశ్రుత’ అంటే ‘విననిది’ అని అర్థం. బొత్తిగా అర్థం లేని మాట. ‘తెలి యకపోవడం’ లోపం. ‘తెలుసుకొనే’ ప్రయత్నం చేయ కపోవడం -నేరం. 1913లో - అంటే వంద సంవత్సరాల క్రిందట ఒక ప్రక్రియ - ‘సాక్షి’ వ్యాసాలను అజరామరం చేసిన పాను గంటి లక్ష్మీనరసింహారావుగారు ఆరోజుల్లోనే తమ పిల్ల లకు తెలుగు రాదని గర్వంగా చెప్పుకునే తల్లిదండ్రుల వ్యవస్థను ఊహించారు. ఈరోజుల్లో ‘‘మా వాడికి తెలుగుభాష రాద’’ని చెప్పుకోవడం ఫ్యాషన్. మనకీ రాకపోవడం అభివృద్ధి. ఒక్క తెలుగు పద్యమయినా చదవలేక పోవడం - దురదృష్టమని కూడా అనుకోని దశలో మనం ఉన్నాం. తెలుగు కథ, వ్యాసం, నాటకం పనికిరాని వ్యాసంగమని ‘‘కూడూ గుడ్డా పెట్టవని’’ సాధించే తరంలో ప్రతిఘట నను తట్టుకుని నేను తెలుగు రచయితనయ్యాను. ఇవాళ బోలెడన్ని చానల్స్, పత్రికలు, వ్యాసంగాలు ఉన్న నేపథ్యంలో భాషకి మరింత ఉపకారం జరగాలి. ఇవాళ భాష చాలామందికి ఉపాధిని ఇస్తోంది. కాని భాషకి ఉపకారం జరుగుతోందా? తెలుగు వాక్యం ఎలా మాట్లాడాలో తెలియని వారికి మైకులు అంది, తెలుగులో ప్రాథమికమయిన అవగాహన కూడా లేనివారికి పత్రికల్లో స్థానం లభించి, తెలుగు మాట్లాడడం కూడా రాని షోకిల్లా ఆడపిల్లలు - కేవలం మొహాల కారణంగా మనకి అపభ్రంశాన్ని అను నిత్యం డ్రాయింగ్ రూముల్లోకి పంచుతున్న నేపథ్యం లో- తెలిసి తెలిసి జరిగే ఈ అరాచకాన్ని ఎవరు ఆపు తారు? ఈ పిల్లి మెడలో ఎవరు గంట కడతారు? జీవన కాలమ్: గొల్లపూడి మారుతీరావు