మేడమ్ మాయావతి గారు ఈ మధ్య అద్భుత మైన భవనాన్ని నిర్మించుకున్నారు. ఆ భవనం ముఖద్వారం దగ్గరే ఒకటి కాదు తన విగ్రహాలు నాలుగింటిని మన అశోక చక్రంలో సింహాల్లాగా నాలుగు దిక్కులూ చూస్తున్నట్టు నిర్మించుకున్నారు. విగ్రహాల ద్వారా శాశ్వత కీర్తిని సంపాదించుకోవచ్చని నమ్మిన నాయకురాలు మాయావతి. దీనిలో ఒక సుఖం ఉంది. ఎవరి ఇంటిలో వారు తమ విగ్రహాలు పెట్టుకోవడం ఎవరి దురదను వారే గోక్కోవడం లాంటిది. ఆమె పదవిలో ఉన్న రోజుల్లో లక్నోలో ఏనుగుల విగ్రహాలతోపాటు తన విగ్రహం, తమ నాయకుడు కాన్షీరాంగారి విగ్రహంతో పెద్ద పార్కుని నిర్మించారు. కీర్తి ఎంత ప్రయత్నించినా వదలని దురద. గోకినకొద్దీ రెచ్చిపోతుంది.ఇది చాలా సంవత్సరాల కింద పత్రికలో వచ్చిన వార్త. ఒక మహానగరంలో వరసగా హత్యలు జరుగుతున్నాయట. పోలీసులకు ఎంత ప్రయత్నించినా కారణం దొరకడం లేదు. ఒక హత్యకీ మరొక దానికీ పొంతన లేదు. సాధార ణంగా నేరస్థుడికి ఒక ‘ఒడుపు’ ఉంటుంది.
అది పోలీసులకు పట్టి ఇస్తుంది. ఈ వరస హత్యలలో అలాంటి పొంతన దొరకడం లేదు. పోలీసులు ఇరకాటంలో పడ్డారు. ప్రజలు భయభ్రాంతులవు తున్నారు. ఎట్టకేలకు హంతకుడు దొరికాడు. ‘‘ఏమయ్యా, ఎందుకీ హత్యలు చేస్తున్నావు?’’ అని పోలీసులు నిలదీశారు. హంతకుడు తృప్తిగా సెలవిచ్చాడు. ‘‘బాబూ! నాకు చదువూ సంధ్యా లేదు. ఏ ప్రత్యేకతా లేదు. అడ్డమయినవాళ్లూ రక రకాల కారణాలకి ‘కీర్తి’ని ఆర్జిస్తున్నారు. నాకు ఇలా ఆర్జించాలనిపించింది. నాకు చేతనయిన పని చేశాను. నా ఫోటో జాగ్రత్తగా వేయించండి. పేరులో స్పెల్లింగు తప్పు రాకుండా చూడండి’’ అన్నాడట. కీర్తి ప్రయత్నించినా వదులుకోలేని వ్యసనం. తలవంచిన కొద్దీ పీకకి చుట్టుకుంటుంది.చాలా సంవత్సరాల కిందట మద్రాసు మౌంట్ రోడ్డులో బుహారీ సెంటర్‌లో చాలా అంద మైన కరుణానిధిగారి విగ్రహం ఉండేది. డీఎంకే పాలనలో ఆయన భక్తులు, అనుచరులు, నాయ కుని విగ్రహం నెలకొల్పారు. ఏఐఏడీఎంకే పార్టీవారికీ, నాయకులకీ ఆ విగ్రహం కంటగిం పుగా ఉండేది. బతికున్న నాయకుల విగ్రహాలు నెలకొల్పడం న్యాయమా? అని మీమాంస లేవదీ శారు. కరుణానిధి తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎంజీ రామచంద్రన్ మరణించాక జరిగిన అల్ల ర్లలో కొందరు దుండగులు ఈ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
కీర్తి అందమయిన గాజు కుప్పె లాంటిది. చెయ్యి జారినా, చెయ్యి ‘జార్చినా’ విరిగి ముక్క లవుతుంది. అలనాడు విజయవాడ ఏలూరు కాలువ పక్కన నీలం సంజీవరెడ్డిగారి విగ్రహం ఉండేది. విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలంటూ నడిచిన ఉద్యమంలో ఆందోళనకారులు ఈ విగ్ర హాన్ని పగలగొట్టి కాలవలోకి విసిరేశారు. కీర్తి కొందరి ప్రతిష్టకి దగ్గర తోవ. కాలం ఆ తోవకి పెద్ద గండి.1930 ప్రాంతాలలో రాఫేల్ ట్రూజిల్లో అనే ఈజిప్టు పాలకుడు ఉండేవాడట. ఆయన గొప్ప తనం ఏమిటంటే ఆయన ఎన్నికకి దేశంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయట! (ఆయన ఉపయోగించిన ఓటింగు మెషీన్లు ఏమిటో మన ప్రతిపక్షాలు వాకబు చెయ్యాలి!) ఆయన కీర్తికి దగ్గర తోవ కనిపెట్టి కేవలం రెండు వేల విగ్రహాలను మాత్రమే ప్రతిష్టింపచేశారట. 1961 మే 30న ఆయన హత్యకు గురి అయ్యే వరకూ ఆ విగ్రహాలు వర్ధిల్లాయట. తర్వాత? పెట్టుబడితో సంపాదించిన కీర్తి అకాలంలో పూసిన గడ్డిపువ్వులాంటిది. దాని పుట్టుక, చావు ఎవరి మనస్సులోనూ నిలవదు.
మన ఊళ్లలో చూస్తూంటాం. రోడ్డు పక్కన బస్సు షెల్టర్లుంటాయి. వాటి మీద పెద్ద అక్షరా లతో, ‘‘అప్పడం తాతయ్యల స్మారకార్థం, వారి కుటుంబ సభ్యులు–మావుళ్లయ్య, మనవాళ్లమ్మ, ధనశ్రీ, చింటూ, ధమ్ము, టుమ్మీ’’ అని. కొన్నాళ్లు బాగానే వారి కీర్తి వ్యాపిస్తుంది. ఒక వర్షాకాలం రోజున బలిసిన ఎద్దు సగం తడిసిన ఆ షెల్టరుకి వీపుని రుద్దుతుంది. అప్పటికే నీరసించిన ఆ షెల్టరు కూలి బోర్డు మీద సగం అక్షరాలు మిగు లుతాయి. కీర్తికి జంతుదోషం పడుతుంది. విగ్రహాల ద్వారా కీర్తిని ఎల్లకాలం నిలుపు కోవాలన్న యావ అతి ప్రాథమికమయిన ఆలో చన. నిజమైన కీర్తి మానవాళికి జరిగిన ఉపకారం, మానవ మేధస్సుని ప్రభావితం చేసిన గొప్ప సాంస్కృతిక కృషి, హృదయాల్ని రసప్లావితం చేయగల అమరగానం, మౌలిక సాధన–ఇలాంటి అపురూప వైభవాలకు ప్రతీకగా సమాజం విగ్ర హాల రూపంలో నిక్షిప్తం చేసుకుంటుంది. విగ్రహం ఒక మహాత్ముని ఉపకారానికి కృతజ్ఞత. జాతి సమర్పించే నివాళి. మహాత్ములు కీర్తి వెంటపడరు. కీర్తి మహాత్ముల్ని ఆశ్రయించుకు నిలుస్తుంది. కీర్తికి విగ్రహం పెట్టుబడి కాదు. విగ్రహం సంకేతం. కీర్తికి విగ్రహం గమ్యం కాదు. కృషికి విగ్రహం చిరునామా.
గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment