తెలుగు రాష్ట్రాల్లో సెల్కాన్ హవా
♦ రూ.4 వేల లోపు విభాగంలో టాప్
♦ 41.5 శాతం వాటా దీనిదే: జేఎఫ్‌కే
♦ జూలైలో మార్కెట్లోకి టీవీలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల మార్కెట్లో సుస్థిర వాటా దిశగా సెల్కాన్ అడుగులేస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రూ.4 వేల లోపు మొబైల్ఫోన్ల విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. మార్కెట్ పరిశోధన సంస్థ జీఎఫ్కే గణాంకాల ప్రకారం జనవరి-మార్చి కాలంలో సెల్కాన్ 41.5 శాతం వాటాతో టాప్-1 స్థానం సంపాదించింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.4 వేలలోపు విభాగంలో తొలి త్రైమాసికంలో 7 లక్షలకుపైగా స్మార్ట్ఫోన్లు, బేసిక్ ఫోన్లను విక్రయించామని సంస్థ సీఎండీ వై.గురు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. నాణ్యమైన ఫోన్లను ఆధునిక ఫీచర్లతో అందుబాటు ధరలో తీసుకురావడం కస్టమర్ల ఆదరణకు కారణమని చెప్పారు.
ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో..
కంపెనీ కొద్ది రోజుల్లో ఫింగర్ ప్రింట్ ఫీచర్‌తో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తోంది. మెటాలిక్ బాడీతో రానున్న ఈ మోడల్ ధర రూ.7 వేల శ్రేణిలో ఉండనుంది. ఇక 5 అంగుళాల స్క్రీన్‌తో తయారైన డైమండ్ 4జీ ప్లస్ మోడల్‌ను తాజాగా 2.5డీ కర్వ్డ్ ఎడ్జ్ గ్లాస్ డిజైన్‌తో ప్రవేశపెట్టారు. ధర రూ.6,333 ఉంది. కస్టమర్లు వినూత్న అనుభూతికి లోనయ్యేలా సెల్కాన్ సొంతంగా అభివృద్ధి చేసిన ఫ్లో సాఫ్ట్‌వేర్‌ను దీనికి జోడించారు. ఇంగ్లీషు వాక్యాలు 22 భాషల్లోకి ఇట్టే తర్జుమా చేసుకోవచ్చు. 4.5 అంగుళాల స్క్రీన్‌తో రూ.5 వేలకే మరో వేరియంట్‌ను తీసుకొస్తోంది. వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో 4జీ స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తోంది.
విద్యార్థులకు రూ.1,000 డిస్కౌంట్..
సెల్కాన్ 8 అంగుళాల 4జీ హెచ్డీ ట్యాబ్లెట్ పీసీని విద్యార్థులకు రూ.1,000 డిస్కౌంట్‌తో రూ.7,333లకు విక్రయిస్తోంది. కొద్ది రోజుల్లో 7 అంగుళాల ట్యాబ్లెట్పైన రూ.500 డిస్కౌంట్‌ను కంపెనీ ప్రకటించనుంది. సెల్కాన్ టీవీలు జూలైలో అందుబాటులోకి వస్తాయని గురు వెల్లడించారు. 24 నుంచి 50 అంగుళాల శ్రేణిలో వీటిని తీసుకొస్తున్నట్టు చెప్పారు. మేడ్చల్ వద్ద ఉన్న ప్లాంటులో కంపెనీ వీటిని రూపొందిస్తోంది. డీవీడీలు, సెట్ టాప్ బాక్స్‌ల తయారీని రానున్న రోజుల్లో చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్, తిరుపతి ప్లాంట్లను తీర్చిదిద్దుతామని ఆయన వివరించారు.