jharkhand woman
-
తాను నిలబడి.. వేలాది మందిని నిలబెడుతుంది
జార్ఖండ్‌లోని ఘట్శిలకు చెందిన మధుమితా షా అందరు ఆడపిల్లల్లానే రంగురంగుల ఊహలతో తన భర్తతో ఏడడుగులు వేసింది. అనేక ఆశలతో పశ్చిమబెంగాల్లోని అత్తారింట్లో అడుగుపెట్టింది. కొద్దిరోజులు గడిచాక అత్తారింటి వరకట్న వేధింపులతో మధుమిత కలలన్నీ కల్లలయ్యాయి. పెళ్లైన ఆరునెలల తరువాత అత్తమామలు లక్ష రూపాయలు తీసుకురమ్మని పీడించడం మొదలుపెట్టారు. అప్పటికే కూతురి పెళ్లికి ఉన్నదంతా పోగేసి ఖర్చుపెట్టిన మధుమిత తండ్రి అంత పెద్దమొత్తంలో డబ్బులు సర్దుబాటు చేయలేకపోయాడు. పుట్టింటి పరిస్థితులను ఎంత వివరించినప్పటికీ అత్తమామలు వినేవారే కాదు. భర్తకూడా అత్తమామలకు వంత పాడడంతో మధుమిత ఒంటరిదైపోయింది. కొన్నిరోజులపాటు వారిని బతిమిలాడి ఒప్పించడానికి ఎంతో ప్రయాసపడింది. అయినా వారి మనస్సులు కరగలేదు. పైపెచ్చు మధుమితను మరింత హింసించేవారు. దీంతో ‘‘వీరికి ఎంత ఇచ్చినా ధనదాహం తీరదు. ఇక్కడే ఉండి ఊటలా ఊరే వీళ్ల కోరికలు తీర్చలేను. వీళ్లు నన్ను మరింత హింసిస్తారు. ఇలా ఎన్నాళ్లు బాధలు పడాలి’’ అని ఆలోచించి భర్తకు విడాకులు ఇచ్చింది. భర్తతో విడాకులు తీసుకున్న తరువాత మధుమిత చాలా కుంగిపోయింది. పెళ్లయిన ఏడాదికే తన దాంపత్య జీవితం ముక్కలైపోవడం తట్టుకోలేక తీవ్రనిరాశ కు గురైంది. దీనికితోడు పుట్టింటికొచ్చాక చుట్టుపక్కల వాళ్లు అనే మాటలు తనని బాగా ఇబ్బంది పెట్టాయి. తన పరిస్థితిని అర్థం చేసుకోకపోగా తనదే తప్పన్నట్లు చూడడం మధుమితను మరింత బాధించేది. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం వెన్నంటే ఉండి ప్రోత్సహించేవారు. దీంతో మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారైంది. కీ రింగ్స్ నచ్చడంతో... అది 2014 మధుమిత ఓ రోజు జంషెడ్పూర్ వెళ్లింది. రోడ్డుపక్కన కొంతమంది చెక్కతో తయారు చేసిన కీ రింగ్స్‌ను అమ్మడం చూసింది. చెక్కతో అనేక అక్షరాలు, వివిధ రకాల బొమ్మల ఆకారంలో ఉన్న కీ రింగ్స్ మధుమితను బాగా ఆకర్షించాయి. రిటైల్ మేనేజ్మెంట్లో డిప్లొమా చేసిన మధుమితకు చెక్కబొమ్మల బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయన్న ఆలోచన వచ్చింది. వెంటనే మధుమిత గ్రామంలో తనకు తెలిసిన కొంతమంది హస్తకళాకారులను కలిసింది. వారితో మాట్లాడి చెక్కతో కీ రింగ్స్ తయారు చేయమని అడిగింది. మొదట్లో వాళ్లు ఒప్పుకోలేదు. తరువాత ముగ్గురు గిరిజన మహిళలు ముందుకు రావడంతో వారికి కీ రింగ్స్ తయారీ నేర్పించింది. దీంతో వాళ్లు చెక్కతో రింగులు, వివిధ అలంకరణ వస్తువులు తయారు చేయడం మొదలు పెట్టారు. దీనిద్వారా ఆ మహిళలకు మంచి ఆదాయం రావడంతో మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు. పిపాల్.. ప్రారంభంలో చెక్కతో కీ రింగులు, ట్రేలు, పెన్ స్టాండ్స్ తయారు చేసి ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం, ఇంటింటికి తిరిగి విక్రయించేవారు. వీరి ఉత్పత్తులకు మంచి స్పందన లభిస్తుండంతో..ఓ ఫర్నీచర్ షాపు పక్కన కొద్దిగా ఖాళీస్థలం ఉంటే షాపు యజమానిని అడిగి.. 2016లో ‘పైపల్ ట్రీ’ పేరిట షాపు ప్రారంభించింది. మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఇక్కడి నుంచే విక్రయిస్తోంది. విక్రయాలతో ఒక్కోమహిళ నెలకు సగటున పదిహేను వేల రూపాయలు చొప్పున సంపాదిస్తున్నారు. వీరంతా రెండువందలకు పైగా ఉత్పత్తులను రూపొందిస్తున్నారు. వీటిలో కోస్టర్స్, నేమ్ ప్లేట్స్, ఇంటి అలంకరణ వస్తువులు వంటివి ఎన్నో ఉన్నాయి. పిపాల్ ద్వారా వందలమందికి ఉపాధి కల్పిస్తూనే, ఏడాదికి అరవై లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్న మధుమిత ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. నన్ను నేను నిరూపించుకున్నాను మా వస్తువులకు మంచి డిమాండ్ ఉంది కానీ డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి చేయలేకపోతున్నాం. ఉత్పత్తులను మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను కాకుండా జంషెడ్‌పూర్‌లో పదహారు చోట్ల స్కూళ్లలో హ్యాండ్‌క్రాఫ్ట్ మేకింగ్ వర్క్‌షాపులు నిర్వహించి వొకేషనల్ ట్రైనింగ్ ఇస్తున్నారు. దీనిద్వారా వంటింటికే పరిమితమైన మహిళలు నెలకు ఐదు నుంచి ఏడు వేలరూపాయల వరకు సంపాదిస్తున్నారు. ఇలా వచ్చినదానితో పిల్లల ట్యూషన్ ఫీజులు, రోజువారి ఖర్చులు నెట్టుకొస్తున్నారు. ప్రారంభంలో నా శక్తి సామర్థ్యాలను అంతా అనుమానించారు. కానీ ఈ మహిళలందరి సాయంతో నన్ను నేను నిరూపించుకోగలిగాను. వ్యాపారాన్ని విస్తరించి మరింతమందికి ఆర్థిక చేయూతనిస్తాను’’ అని చెబుతున్న మధుమిత ఆత్మవిశ్వాసాలు అబ్బుర పరుస్తాయి. -
చిన్నసాయం.. పెద్దమనసు
కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో వేలాది జీవితాలు కొట్టుకుపోయాయి. బతికి బట్టకట్టిన వారికి జీవనం ప్రశ్నార్థకమైంది. ఆ భీకర ప్రకృతి విలయం.. దైనందిన జీవితాల్లో కల్లోలం రేపింది. దేశానికి దక్షిణంలో వచ్చిన ఆ వరదల తాకిడి తూర్పున ఉన్న జార్ఖండ్ మహిళలను కదిలించింది! దేశవ్యాప్తంగా.. చేతినిండా డబ్బున్న వాళ్లు ఆర్థిక సాయం చేస్తున్నారు. రోజు కూలితో జీవించే తమకు అంతంత డబ్బు జమ చేయడం సాధ్యమైన పని కాదు. ఆ డబ్బును బాధితులకు పంపించడం ఎలాగో కూడా చేతకాదు. అయినా సరే.. తాము చేయగలిగిన ఉడుత సాయమైనా చేయాలనుకున్నారు జార్ఖండ్ మహిళలు. తాము తయారు చేస్తున్న చెప్పులతోనే కేరళ వరద బాధితుల కాళ్లకు రక్షణ కల్పించినా చాలనుకున్నారు. అంతే. వెయ్యి జతల రబ్బరు స్లిప్పర్స్‌తో ఓ లారీ జార్ఖండ్ నుంచి బయలుదేరింది. దాయాలన్నా దాగని సాయం! జార్ఖండ్ రాష్ట్రం, దుమ్కా జిల్లాలో బాలిజోర్ గ్రామం. ఆ గ్రామంలో మూడు వందల మంది మహిళలు బాలి ఫుట్‌వేర్ కంపెనీలో పని చేస్తారు. వారికి రోజు కూలి 250 రూపాయలు. ఒక రోజు వేతనాన్ని వరద బాధితులకు సహాయంగా ఇవ్వాలనుకున్నారు. ఆ వేతనానికి వచ్చినన్ని చెప్పుల జతలను సహాయార్థం సమకూర్చారు. వాళ్లు తయారు చేస్తున్న ఫుట్‌వేర్ కంపెనీలో ఒక చెప్పుల జత ఖర్చు 70 రూపాయలవుతుంది. శ్రామికుల వేతనం కాకుండా కేవలం మెటీరియల్ ఇతర ఖర్చులు మాత్రమే. మొత్తం 75 వేల రూపాయల డబ్బుతో వెయ్యి జతల చెప్పులను కేరళకు పంపించారు. నిజానికి ఈ మహిళలు పేరు కోసం తాపత్రయపడకుండా నిస్వార్థంగా సహాయం చేశారు. కానీ సహాయం పొందిన వాళ్లకు తమకు సహాయం చేసిన వాళ్ల ఊరి పేరును చెప్పులే చెబుతున్నాయి. బాలిజోర్ పేరు మీదనే బాలి ఫుట్‌వేర్ కంపెనీకి ఆ పేరు పెట్టారు. ఉన్నదాంట్లోనే కొంత ‘రిలీఫ్’ ‘‘కేరళలో ఇలా జరిగిందని వార్తల్లో చూసి తెలుసుకున్నాం. ‘ఎంత ఘోరం, వాళ్ల పరిస్థితి ఏమిటి, తిరిగి వాళ్ల బతుకులు తేరుకునేదెలా’ అని పనిచేస్తూ మాట్లాడుకునే వాళ్లం. పెద్దవాళ్లు ఎవరెవరు ఎంత సహాయం చేస్తున్నారో కూడా మా కబుర్లలో తెలుస్తుండేది. రిలీఫ్ ఫండ్‌కి డబ్బు ఇచ్చేటంత పెద్ద ఉద్యోగులం కాదు. రోజుకు 250 రూపాయలు వస్తే... అందులోనే ఇంట్లో తిండి గడవాలి, కొంత దాచుకోవాలి. మేమే పేదవాళ్లం, మాదే పేదరికం అనుకుంటుంటే, వరదల్లో సర్వం కోల్పోయిన వాళ్ల పరిస్థితి ఇంకా దారుణం కదా. వాళ్లు మా కంటే దయనీయమైన స్థితిలో ఉన్నారు. అందుకే మనం తయారు చేస్తున్న చెప్పులనే వారికిద్దామని అందరం ఒక్కమాట మీదకు వచ్చాం. మా కంపెనీకి మెటీరియల్ ఇచ్చే అధికారులతో ఇదే మాట చెప్పాం. చెప్పులను వరద బాధితులకు పంపే ఏర్పాట్లు జిల్లా అధికారులే చేశారు’’ అని చెప్పింది బాలి చెప్పుల కంపెనీలో పనిచేస్తున్న మిథియా తాదు. ఆ కార్మికుల్లో చురుకైన మిథియా, మంజుదేవి, మోనికా తాదుతోపాటు మిగిలిన వాళ్లంతా ముందుకొచ్చారు. దాంతో కేరళకు సాయం అందింది. సమాజం స్వార్థపూరితంగా మారిపోయింది, మనుషుల్లో మానవత్వం లోపించింది, కాఠిన్యం రాజ్యమేలుతోంది... ఇలా ఎన్నో మాటలు వింటుంటాం. ఇన్నింటి మధ్య కూడా ఎదుటి వారికి కష్టం వస్తే అది తమ కష్టంగా స్పందించే సున్నితమైన మనసులు, చలించే స్నేహపూరిత హృదయాలు ఉన్నాయి. మరేం ఫర్వాలేదు.. మనుషుల్లో మానవత్వం ఇంకా ఉంది అనే భరోసానిస్తున్నారు ఈ మహిళలు. – మంజీర -
ఆధార్ సాక్షిగా మరో ఆకలి చావు
సాక్షి, న్యూఢిల్లీ : రేషన్ బియ్యానికి ఆధార్ కార్డు ముడిపెట్టడంతో జార్ఖండ్‌లో మరొకరు ఆకలి చావుకు గురయ్యారు. పకూర్ జిల్లా, ధావడంగల్ గ్రామంలో లుఖీ ముర్ము అనే 30 ఏళ్ల యువతికి ఆధార్ కార్డుతో అనుసంధానం చేయక పోవడం వల్ల రేషన్ కార్డుపై గత అక్టోబర్ నెల నుంచి బియ్యం, ఇతర సరకులు ఇవ్వడంలేదు. దాంతో పస్తులతో కాలం గడిపి ఆకలితో జనవరి 27వ తేదీన మరణించారు. ఈ విషయంపై దర్యాప్తు జరిపిన 'రైట్ టు ఫుడ్' సంస్థ కార్యకర్తలు శుక్రవారం సాయంత్రం తమ నివేదికను విడుదల చేశారు. లుఖీ ముర్ముకు తెలియకుండానే ఆమె రేషన్ కార్డును అంత్యోదయ క్యాటగిరీ నుంచి ప్రాధాన్యత క్యాటగిరీకి గత జూన్ నెలలో మార్చేశారు. దాంతో నెలకు 35 కిలోల బియ్యం వచ్చేది 20 కిలోలకు తగ్గిపోయింది. అక్టోబర్ నెల నుంచి ఆ బియ్యం ఇవ్వడానికి కూడా డీలర్ నిరాకరించడంతో దుర్భర దారిద్య్ర పరిస్థితుల్లో కడుపునింపుకోవడం కష్టమై ముర్ము కన్నుమూసింది. ఇదే జార్ఖండ్‌లో గత సెప్టెంబర్ నెలలో 11 ఏళ్ల సంతోషి కుమారి మరణించగా, ఇప్పటి వరకు ఏడుగురు మరణించారని 'రైట్ టు ఫుడ్' కార్యకర్తల నివేదిక వెల్లడిస్తోంది. గార్వా జిల్లాలో జనవరి రెండవ తేదీన ఎట్వారియా దేవీ అనే 67 ఏళ్ల వద్దురాలు కూడా ఆకలితోనే మరణించారు. అయితే లుఖీ ముర్ము ఆకలితో చావలేదని, అంతుచిక్కని వ్యాధితో బాధ పడుతూ చనిపోయిందని జిల్లా పౌర సరఫరాల అధికారి దిలీప్ కుమార్ తెలియజేస్తున్నారు. ఆమెకు రేషన్ బియ్యాన్ని నిరాకరించలేదని, అనారోగ్యం కారణంగానే ఆమె అక్టోబర్ నెల నుంచి రేషన్ బియ్యాన్ని తెచ్చుకోలేక పోయిందని ఆయన వివరణ ఇచ్చారు. ఆమె అనారోగ్యంతో మరణించిందని తనకు తెలుసునని, అయితే ఏ జబ్బుతో అనారోగ్యం పాలైందని తెలియదని తెలిపారు. లుఖీ ముర్ము తల్లిదండ్రులు పదేళ్ల క్రితమే చనిపోగా తన నలుగురు చెల్లెళ్లతో కలిసి ఉంటూ కూలినాలి చేస్తూ వారిని పోషిస్తూ వచ్చింది. వారిలో ముగ్గురు చెల్లెళ్లు పెళ్లిచేసుకొని అత్తారింటికి వెళ్లిపోగా 14 ఏళ్ల ఆఖరి చెల్లెలు ఫూలిని ముర్ముతో ముర్ము జీవిస్తూ వచ్చింది. ముర్ము కుటుంబంలో ఐదుగురు సభ్యులకుగాను రేషన్ కార్డులో నలుగురు చెల్లెళ్ల పేర్లు నమోదై ఉన్నాయి. ఆధార్ కార్డులో మాత్రం లుఖీ ముర్ము, ఫూలిని ముర్మ ఇద్దరి పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆధార్ కార్డుతోని అనుసంధానించని రేషన్ కార్డులు ఏప్రిల్ 1వ తేదీ నుంచి చెల్లవంటూ జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి రాజ్ బాల వర్మ మార్చి నెలలో ఆదేశాలు జారి చేశారు. ఆయన ఉత్తర్వుల కారణంగా ఆ తర్వాత రాష్ట్రంలో 11 లక్షల రేషన్ కార్డులు రద్దయ్యాయి. పర్యవసానంగా రేషన్ బియ్యం అందక 11 ఏళ్ల సంతోషి కుమారి ఆకలితో చనిపోవడం, ఆ వార్త దేశమంతా సంచలనం సష్టించడంతో ఆధార్ అనుసంధానం పేరిట రేషన్‌ను తిరస్కరించ వద్దంటూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో జార్ఖండ్ పౌర సరఫరాల మంత్రి అంతకుముందు ప్రధాన కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. అయినప్పటికీ రద్దయిన రేషన్ కార్డులను పునరుద్ధరించ లేకపోవడం వల్ల ఆకలి మరణాలు ఆగడం లేదు. -
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై అత్యాచార యత్నం
జార్ఖండ్‌కు చెందిన యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్‌సిటీ పోలీసుల కథనం మేరకు..దొడ్డతోగూరులో పీజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన యువతి (25) ఈ హాస్టల్లో ఉంటూ నగరంలోని ప్రైవేటుసాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది. శుక్రవారం రోజు దుండగులు హాస్టల్లో చోరీచేసేందుకు వెళ్లగా గదిలో ఒంటరిగా ఉన్న ఆ యువతిపై అత్యాచారానికి యత్నించి గాయపరిచారు. హాస్టల్ నిర్వాహకులు గుర్తించి బాధితురాలిని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది.