హెచ్ఎండీఏలో కుర్చీలు ఖాళీ !
=కీలక పదవుల్లో అధికారుల కొరత
=కింది స్థాయి సిబ్బందిపై నియంత్రణ కరవు
=అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం
సాక్షి, సిటీబ్యూరో: హెచ్ఎండీఏ ఖాళీ అవుతోంది! కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉండడంతో అభివృద్ధి మందగించింది. ఇప్పటికే మెంబర్ ఎస్టేట్ (ఎంఈ), చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ), డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (డీఏఓ) వంటి కీలక పోస్టులు ఖాళీగా ఉండగా.. అత్యంత కీలకమైన కార్యదర్శి (సెక్రటరీ), ప్రణాళికా విభాగంలో ప్రధానమైన ప్లానింగ్ డెరైక్టర్ కుర్చీలు సైతం త్వరలో ఖాళీ కానున్నాయి. వీరిలో సెక్రటరీ బి.రామారావుకు నెల రోజుల్లో ఐఏఎస్‌గా కన్ఫర్మేషన్ రానుంది. అలాగే ప్లానింగ్ డెరైక్టర్ ఎస్డి.జియాఉద్దీన్ డిసెంబర్లో పదవీ విరమణ చేయనున్నారు.
కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడంతో పనులు ముందుకు సాగట్లేదు. ఇప్పటికే ప్లానింగ్ విభాగంలో సరైన పర్యవేక్షణ లేక ఎల్ఆర్ఎస్, బీపీఎస్ దరఖాస్తులు ముందుకు కదలట్లేదు. శంకర్పల్లి జోనల్ కార్యాలయాన్ని తార్నాకకు తరలించినా... పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేంద్ర కార్యాలయంలో డీఏఓ పోస్టులు ఖాళీగా ఉండటంతో లేఅవుట్లు, బిల్డింగ్ పర్మిషన్లు, భూవి నియోగ మార్పిడికి సంబంధించిన వివరాలు ఇచ్చే నాథుడే లేడు. అసిస్టెంట్ పీఆర్ఓ, కమిషనర్ పేషీలో డీఏఓ, సీని యర్ అసిస్టెంట్ వంటి పోస్టులు కూడా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. పర్యవేక్షణ లేకపోవడంతో కొందరు సిబ్బంది అక్రమాలకు తెరలేపారు. ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా మామూళ్లు వసూలు చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
ఓఆర్‌ఆర్‌లోనూ అరకొరే ..!
ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులో సైతం కీలక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ (ఏపీడీ), ప్రాజెక్టు మేనేజర్ (పీఎం), అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ (ఏపీఎం), చీఫ్ జనరల్ మేనేజర్ (సీజీఎం) స్థానాలు చాలాకాలంగా భర్తీ కాలేదు. ఫలితంగా పనులు ముందుకు సాగడం లేదు. 2012 డిసెంబర్ నాటికి పూర్తవ్వాల్సిన ఔటర్ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. వివిధ పత్రాలపై సంతకాలు తీసుకొనేందుకు ప్రాజెక్టు మేనేజర్ బాధ్యతలను చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ (సీఏఓ)కు అప్పగించారు. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో నిత్యం హడావుడిగా ఉండే సీఏఓ తనకప్పగించిన అదనుపు బాధ్యతలకు పూర్తిస్థాయి న్యాయం చేయలేకపోతున్నారు. అలాగే ఓఆర్ఆర్లో జీఎంగా ఉన్న సూర్యప్రకాష్ రెడ్డికి సీజీఎంగా అదనపు బాధ్యతలు అప్పగించి పనులు మమ అన్పిస్తున్నారు.
నువ్వా... నేనా..?
ప్లానింగ్ విభాగంలో అధికారుల మధ్య ఆధిపత్యపోరు నెలకొంది. డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారుల ఆదేశాలను కొందరు సిబ్బంది ఖాతర్ చేయట్లేదు. ఇటీవల జోనల్ అధికారుల పోస్టులను రద్దుచేసి వారందరినీ తార్నాక ప్రధాన కార్యాలయానికి తెచ్చారు. వీరికి ఇంతవరకు వర్క్ డివిజన్ జరగలేదు. అప్రధాన్య పోస్టుల్లో కొనసాగేందుకు ఇష్టపడని కొందరు అధికారులు సెలవుపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. హెచ్ఎండీఏలో మొత్తం 600 పోస్టులకు గాను కేవలం ప్రస్తుతం 390 పోస్టుల్లోనే సిబ్బంది ఉన్నారు. 200లకు పైగా వివిధ పోస్టులు ఖాళీగా ఉండటంతో ప్రజలకు సేవలందించడంలో ఘోరంగా విఫలమైందన్న అపకీర్తిని మూటగట్టుకొంది.