నేడు జనగామ దిగ్బంధం
జనగామ : జనగామ జిల్లా ఏర్పడకుండా జరుగుతున్న కుట్రలను నిరసిస్తూ శుక్రవారం జనగామ దిగ్బంధం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి తెలిపారు. స్థానిక అంబేద్కర్ పూలే అధ్యయన వేదిక భవన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, జెడ్పీ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యుడు ఏకవాక్య తీర్మానంతో ఇచ్చిన లేఖలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అన్నారు. జిల్లాల ముసాయిదాలో జనగామ లేదని తేలిపోయిందని, ప్రజలు పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
రాజకీయ పార్టీలు, కుల, విద్యార్థి, మహిళా సంఘాలు, మేధావులు జనగామ దిగ్బంధం కార్యక్రమానికి కదిలిరావాలన్నారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీ, జెడ్పీ చైర్పర్సన్, కౌన్సిలర్లు, అధికార పార్టీ నాయకులు ముందుండాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రజల పక్షమా.. ప్రభుత్వ పక్షమా నేటితో తేలిపోతుందని స్పష్టంచేశారు. జనగామ అస్థిత్వాన్ని దెబ్బతీసేలా సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి హరీశ్‌రావు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.
జనగామ జిల్లా కోసం ఈనెల 23 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్మే సీహెచ్.రాజారెడ్డి, టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవాధ్యక్షుడు పజ్జూరి గోపయ్య, పోకల లింగయ్య, కౌన్సిలర్ మేడ శ్రీనివాస్, ఆకుల వేణుగోపాల్‌రావు, డాక్టర్లు లక్ష్మీనారాయణనాయక్, రాజమౌళి, చిన్నం నర్సింహులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో కలిసి రావాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కన్నా పర్శరాములు, మంగళ్లపల్లి రాజు, ఆలేటి సిద్దిరాములు, ధర్మపురి శ్రీనివాస్, బెడిదె మైసయ్య, మాజీద్, జి.క్రిష్ణ, జక్కుల వేణుమాధవ్, బర్ల శ్రీరాములు, బూడిద గోపి, సత్యపాల్‌రెడ్డి, కాముని శ్రీనివాస్ పాల్గొన్నారు.