jntuk campus
-
బోధన గాలికి... పైరవీల జోలికి
బడి నుంచి క్రమశిక్షణ అలవడాలి... అది ఆచరణలో పెట్టించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే...తరువాత ఉన్నత పాఠశాలలో బంగారు భవితను తీర్చిదిద్దుకుంటారు. కళాశాల, విశ్వవిద్యాలయాల్లో భావి భారత పౌరులుగా పూర్తి స్థాయి అవగాహనతో ప్రపంచంలోకి అడుగిడతారు. మరి వీరికి బోధించే ఆచార్యులు ఇంకెంత గౌరవంగా ఉండాలి. కానీ కాకినాడలోని జేఎన్టీయూ ఇందుకు భిన్నంగా నడుస్తూ పదేళ్లలోనే పలు వివాదాలకు వేదికయింది. అంతర్గత రాజకీయాలతోపాటు బయట రాజకీయాలు జోక్యం చేసుకోవడంతో మరింత కలుషితమవుతోంది. సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి , కాకినాడ : ఆయన అక్కడ ఆదేశిస్తారు. ఇక్కడ పాటించాల ని శాసిస్తారు. విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయంలో నడుస్తున్న ఈ తతంగం చూసి పలువురు విస్తుపోతున్నారు. జేఎన్టీయూ కాకినాడలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా... నిబంధనలు పట్టించుకోకుండా అనుభవం పెద్దగా లేని వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారు. డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ నియామకాలన్నీ కీలక పదవిలో ఉన్న సీఎం సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ఆదేశాల మేరకు జరుగుతున్నాయి. అడిగే నాథుడు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా సాగిపోతోం ది. ఇక్కడ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ నియామక విభాగంలో రాష్ట్ర స్ధాయిలో కీలక పదవిలో ఉన్న సీఏం సామాజికి వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ నుంచి ఆదేశాల జారీకి అనుగుణంగా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు. వర్సిటీ డైరెక్టర్ నుంచి ప్రొఫెసర్ బదిలీ వరకూ అన్నీ ఆయన ఆదేశాల మేరకే జరుగుతున్నాయంటూ పలువురు అధ్యాపకులు చర్చించుకుంటున్నారు. ఇటీవలే కొత్త వీసీగా బాధ్యతలు చేపట్టిన ఉపకులపతి రామలింగరాజు వర్సిటీలో పలు మార్పులు చేశారు. ఈక్రమంలో ప్రిన్సిపాల్, డైరెక్టర్ పోస్టుల్లో కొత్త వారిని నియమించడంతో వివాదం చోటు చేసుకుంది. పేరుకు వీసీ ఉన్నప్పటికీ అంతా అమరావతి డైరెక్షన్ మేరకే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనుభవం, అర్హత లేని వారిని నియమించారంటూ అనుభవం గల పలువురు ప్రొఫెసర్లు వాపోతున్నారు. సీనియారిటీ, వాక్ చాతుర్యం లేని వారిని అందలం ఎక్కించి అర్హత, అనుభవం ఉన్న వారిని అవసరం లేదంటూ పక్కన పడేశారన్న విమర్శలున్నాయి. వర్సిటీలో ఉన్న డైరెక్టర్లతోపాటు విజయనగరం, నరసారావుపేట కళాశాల ప్రిన్సిపాళ్లను మార్చడంలో నిబంధనలు పక్కన పెట్టేసి ఇష్టారీతిన వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆరోపణలు ఇలా... నరసారావుపేట కళాశాల ప్రారంభించిన ఒక బ్యాచ్‌ను ప్రిన్సిపాల్ నేతృత్వంలో పూర్తవకుండా అక్కడి ప్రిన్సిపా ల్గా ఉన్న మురళీకృష్ణను కాకినాడ కళాశాలకు మార్చా రు. ఇక విజయనగరం ప్రిన్సిపల్‌గా అదే కళాశాలలో ఈసీఈ విభాగ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సరస్వతికి ఇచ్చారంటూ అదే కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా ఉన్న స్వామినాయుడు ఫిర్యాదు చేశారు. జూనియర్ స్ధాయిలో ఉన్న ఆమెని ప్రిన్సిపల్‌గా నియమించడం ఎంతవరకు సమంజసమని వీసీకి ఫిర్యాదు చేశారు.విజయనగరం ప్రిన్సిపాల్ సరస్వతీ, నరసారావుపేట ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి ఒకే ఏడాది విధుల్లోకి చేరారని, 2007లో డైరెక్ట్ రిక్రూట్మెంట్లో చేరిన తనను వైస్ ప్రిన్సిపాల్ నుంచి తొలగించారంటూ స్వామినాయుడు ఫిర్యాదు చేశారు. రెండు పీహెచ్‌డీలు చేయించిన తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా 2013లో ప్రొఫెసర్‌గా వచ్చిన సరస్వతి గైడ్‌గా ఒక పీహెచ్డీ కూడా చేయించలేదని, ప్రిన్సిపాల్స్ నియామక నిబంధనలో ఈ విషయంపై ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గెజిట్’లో స్పష్టంగా ఉన్నా నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే కాకినాడ వర్సిటీలో ఇదే క్యాడర్లో ఉన్న ఇద్దరికి (సీనియారిటీ లేని వారికి) డైరెక్టరేట్లు ఇచ్చి అనర్హులను అందలం ఎక్కించారంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన డైరెక్టర్ల టీమ్‌లో తమ కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఢిల్లీలో ఉన్న తన సామాజిక కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చెయ్యడానికి ఒక ప్రొఫెసర్ ఢిల్లీ వెళ్లారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న విజయవాడ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం కూడా వర్సిటీలో వేలు పెట్టి ఫలానా వాళ్లకు పోస్టు ఇవ్వాలని గత వీసీ దగ్గరి నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు. తనకు అనుకూలమైన అనేక మందికి గతంలో ప్రాధాన్యత గల బాధ్యతలు అప్పగించారు. తాజాగా విజయనగరం వైస్ ప్రిన్సిపాల్ నియామకంలో కూడా ఈయన పాత్రే ఎక్కువగా ఉందని వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఈవిధంగా కొందరి వ్యక్తుల జోక్యంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో జేఎన్టీయూ కాకినాడ వర్సిటీగా ఏర్పడ్డ వర్సిటీ ఇప్పుడు పలు వివాదాలకు కారణమవుతోంది. విద్యాబుద్ధులు నేర్పవలసిన అధ్యాపకులు పాఠాలు చెప్పకుండా పరిపాలన చేస్తామంటూ కేవలం రెండు లేదా మూడు సంవత్సరాలు ఉండే డైరెక్టర్ల పదవుల కోసం నానా తంటాలు పడి ప్రజాప్రతిని«ధుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడంతో ఉన్న కాస్త గురువుల పరువు బజారున పడుతుంది. ఒక డైరెక్టర్ స్థాయిలో ఉండే ఆచార్యులైతే రిజిస్ట్రార్ పదవి కోసం ఏకంగా అమరావతిలో దాదాపు రూ. పది లక్షలు వరకూ వ్యయం చేసి పైరవీలకు దిగుతున్న సమయంలో పలు ఆరోపణలపై పత్రికల్లో ఆయనపై కథనాలు రావడంతో ఉన్నత స్థాయి వర్గాలు వెనక్కి తగ్గి డైరెక్టర్ పోస్టునుంచే తొలగించారు. లేదంటే ఆయనకు కూడా పెద్ద పీట వేసేవారే. పరిపాలన సౌలభ్యం కోసంమారుస్తున్నాం.. వర్సిటీ పాలక మండలి సూచనల మేరకు పరిపాలన సౌలభ్యం కోసం డైరెక్టర్లు, అలాగే కళాశాల ప్రిన్సిపాళ్లను మార్చాం. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా అందిరికీ న్యాయం జరిగేలా కుల, లింగ బేధాల ప్రకారం మార్పులు చేపట్టాం. యూనివర్సీటీ నిబంధనల మేరకే బదిలీలు చేపట్టాం.– వీవీ సుబ్బారావు, జేఎన్టీయూకే రిజిస్ట్రార్ -
అయినవారిని కాదని కానివారికి అందలాలా?
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్టుంది తమ పరిస్థితి అని జేఎన్టీయూకే అధ్యాపకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్ష ద్వారా ప్రొఫెసర్లుగా నియమితులైన తమను కాదని అడహాక్ పద్ధతిలో నియమితులైన వారికి సర్వాధికారాలు కట్టబెడుతున్నారని వాపోతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని డైరెక్టరేట్లు ఏర్పాటు చేసి వాటికి డైరెక్టర్లుగా ఆ వర్సిటీ ప్రొఫెసర్లనే నియమించారు. వీరికి ఒక చాంబర్‌తో పాటు పీఏ, అటెండర్, డ్రైవర్‌ను అవుట్ సోర్సింగ్ పద్ధతిన కేటాయించారు. రెండేళ్లపాటు ఉండే పదవులకు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆ పోస్టులు సాధించుకున్నవారూ ఉన్నారు. ఇటీవల నూతనంగా వచ్చిన వీసీ ఆయా డైరెక్టర్లను వారి సొంత విభాగాలకు బదిలీ చేస్తూ నూతన బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాతవారు గుర్రుగా ఉన్నారు. ఇదిలా ఉంటే వర్సీటీలో ఫార్మశీ, నానో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఏవానాయిక్స్ వంటి తొమ్మిది డైరక్టరేట్లు ఏర్పాటుచేసి వీటికి పోగ్రాం డైరెక్టర్లుగా పలు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలలో పనిచేసిన వారిని నియమిస్తూ వారికి ప్రతి నెలా 30 నుండి 40వేల వరకూ వేతనం చెల్లిస్తున్నారు. సాధరణంగా వర్సీటీలో పోగ్రాం డైరెక్టర్లుగా ఉండాలంటే ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేసినవారై ఉండాలన్న నిబంధన ఉన్నా వాటిని కాదని పలు విభాగాలకు డైరెక్టర్లను నియమించారు. ఉదాహారణకు పుట్ టెక్నాలజీ విభాగానికి ప్రైవేట్ సంస్థలో పనిచేసిన వ్యక్తిని పోగ్రాం డైరెక్టర్‌గా నియమించారు. ఈ విభాగం కళాశాల లేదా ఐఎస్టీ విభాగానికి కానీ సంబంధం లేకుండా నేరుగా రిజిస్ట్రార్ నియంత్రణలో ఉండేలా ఏర్పాటుచేశారు. ఇటీవలే వీరి నియమాకాలు, వేతనాలు తదితర విషయాల్లో నిబంధనలు పాటించలేదంటూ అడిట్ విభాగం తప్పుబట్టినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక రెండోది ఫార్మశీ విభాగంలో అదే పరిస్థితి ఉందని కనీసం ఈ సబ్జెక్టుతో సంబంధంలేకుండా పాలిటెక్నిక్ విభాగంలో పనిచేసిన వ్యక్తిని ఫార్మశీ డైరక్టర్‌గా నియమించారని అంటున్నారు. ఏటా ఈ విభాగంలో పనిచేసేవారిని రెన్యువల్‌కు నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉన్నా ఆ నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా వారినే కొనసాగిస్తూన్నారని తెలిపారు. ఈ డైరెక్టర్ స్కాలర్లు, ఫార్మశీ విద్యార్థులపై చాలా విచక్షణ రహితంగా ప్రవర్తిసారంటూ వర్సీటీ ఉన్నత అధికారులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం, చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. ఇలా అన్ని డైరెక్టరేట్‌లోను ఇదే పరిస్థితి కొనసాగుతోందని వీటిని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో అర్హులైన వారిని, సబ్జెక్టులతో సంబంధం ఉన్నవారిని నియమించాలని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రక్షాళన చేపడతాం.. వర్సిటీ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సమీక్షించి ప్రక్షాళన చేపడుతున్నాం. పోగ్రాం డైరెక్టర్ల నియామకాలు, వేతనాలు అన్నీ గత అధికారుల హాయాంలో జరిగాయి. కమిటీతో చర్చించి అవసరమైతే వీటిపై తగు నిర్ణయం తీసుకుంటాము.– వీవీ సుబ్బారావు, రిజిస్ట్రార్, జేఎన్టీయూకే -
ముప్ఫైరోజులైనా జోరు తగ్గని పోరు
సాక్షి, రాజమండ్రి : విభజించి లాభం పొందాలనే కుతంత్రంపై ‘తూర్పు’ కన్నెర్ర కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ ఏలికల దుర్నీతిపై జిల్లావాసులు ఒక్కొక్కరు ఒక్కో నిప్పుకణికలా మారి ముప్ఫైరోజులైనా వారిలో కాక అణుమాత్రం తగ్గలేదు. జిల్లాలో సమైక్య ఉద్యమం రగిలి గురువారం నాటికి నెల రోజులు పూర్తయింది. అయినా ఉద్యమం రోజు రోజుకూ ఉద్ధృతం అవుతూ, కొత్తపుంతలు తొక్కుతూ వస్తోంది. ప్రజలే నేతలుగా, సమైక్యత తప్ప వేరు భావన లేకుండా పోరు సాగుతోంది. ‘ఆత్మహత్యలు మా నైజం కాదు.. ఆత్మస్థైర్యమే మా యిజం’ అంటూ విద్యార్థులు, యువకులు గాంధేయ మార్గాల్లో సమైక్యరాష్ట్ర పరిరక్షణ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. మహాత్ముడు ఆదర్శంగా సత్యాగ్రహాలు, అమరజీవి స్ఫూర్తితో నిరాహార దీక్షలను సాగిస్తూ స్వాతంత్య్ర పోరాటాన్ని తలపింప చేస్తున్నారు. ప్రాణాలైనా పణంగా పెడతాం తప్ప రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం అంటున్నారు. కాకినాడలో జేఎన్టీయూకే విద్యార్థులు డి.శ్రీనివాస్, ఎం వెంకటేశ్వర్లు, ఎం.లోకేష్, జి.అనిల్‌కుమార్, అనిల్‌కుమార్, కాకినాడ రూరల్ పరిధిలోని సర్పవరం జంక్షన్లో చందు యూత్ ఆధ్వర్యంలో చందు, ప్రసాద్, కృష్ణంరాజు, శ్రీనివాస్ చేపట్టిన ఆమరణ దీక్షలు రెండో రోజైన గురువారం కూడా జరిగాయి. రాజమండ్రి రూరల్ పిడింగొయ్యి పంచాయతీ బుచ్చియ్యనగర్‌లో ఉపాధి హామీ పథకం ఫీల్డు అసిస్టెంట్ గిరజాల చంద్రశేఖర్ గురువారం ఆమరణ దీక్ష ప్రారంభించాడు. ముమ్మిడివరంలో యువకుల ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేసి, ఆస్పత్రికి తరలించారు. విజయవంతంగా బంద్ హైదరాబాద్‌లో జేఏసీ నేతలపై తెలంగాణవాదులు అనుచితంగా ప్రవర్తించడానికి నిరసనగా జేఏసీ పిలుపునిచ్చిన బంద్ జిల్లాలో గురువారం విజయవంతమైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి, వ్యాపార వర్గాల జేఏసీలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. అన్ని మండల కేంద్రాల్లో బంద్ పాటించిన సమైక్య వాదులు రహదారులపై ర్యాలీలు చేపట్టి సమైక్యాంధ్ర నినాదాలను మారుమోగించారు. వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. రాజమండ్రిలో జేఏసీ చేపట్టిన రెండు రోజుల సకల జనుల సమ్మె జయప్రదంగా ముగిసింది. ఐక్యతే బలమని చాటిన కలాలు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా రాజమండ్రి కంబాలచెరువు వద్ద వైఎస్సార్సీపీ నాయకుడు జక్కంపూడి రాజా చేపట్టిన ఆమరణ దీక్షా శిబిరం వద్ద.. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఆధ్వర్వంలో కవి సమ్మేళనం జరిగింది. పలువురు కవులు సమైక్యాంధ్ర ఆవశ్యకతను, ఐకమత్యం ఇచ్చే బలాన్ని, అభివృద్ధిని తమ కవితల్లో చాటారు. సమైక్యతను చాటుతూ విజయలక్ష్మి వినిపించిన కవిత జేజేలు అందుకుంది. పశువుల ఆస్పత్రి వద్ద ఆ శాఖ ఉద్యోగినులు తెలుగుతల్లి వేషధారణతో నిరసన దీక్షలు చేపట్టారు. పిఠాపురంలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం, వీఆర్వోలు, మున్సిపల్ ఉద్యోగులు చేపట్టిన నిరాహార శిబిరాల్లో తెలుగు భాషా దినోత్సవాలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు కాకినాడ జగన్నాథపురం అన్నమ్మ ఘాటీ నుంచి జేఎన్టీయూకే వరకూ బైక్ ర్యాలీ చేశారు. కోనసీమ మండలాల నుంచి ఉపాధ్యాయులు ముందు అమలాపురం చేరుకుని అక్కడి నుంచి సమైక్య నినాదాలతో కాకినాడ వచ్చారు. గ్రామ రెవెన్యూ అధికారులు కూడా కాకినాడలో ర్యాలీ చేశారు. మలికిపురంలో ర్యాలీని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్సీ రవికిరణ్ వర్మను.. రాజీనామా చేసి ఉద్యమాల్లో పాల్గొనాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. తమతో భాగస్వాములైతేనే ర్యాలీని ప్రారంభించేందుకు అంగీకరిస్తామని చెప్పడంతో ఎమ్మెల్సీ వెనుదిరిగారు. రాజాకు విద్యార్థుల సంఘీభావం రాజమండ్రిలో గురువారం సిమెంటు వర్తకుల సంఘం సభ్యులు నగర వీధుల్లో ర్యాలీ చేసి కంబాలచెరువు వద్ద జక్కంపూడి రాజా దీక్షకు మద్దతు పలికారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 5 వేల మంది విద్యార్థులు ప్రదర్శన చేసి రాజాకు సంఘీభావం తెలిపారు. వివిధ ప్రైవేట్ పాఠశాలల బస్సులతో నగర వీధుల్లో ర్యాలీ చేశారు. వ్యాపారులు మెయిన్‌రోడ్డులోని శాంతినివాస్ సెంటర్లో కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి రిలే దీక్షలు చేశారు. కడియం మండలం పొట్టిలంక నుంచి వేమగిరి వరకూ మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ పాదయాత్ర చేశారు. అమలాపురంలో కొబ్బరి ఒలుపు, దింపు కార్యికులు ర్యాలీ చేసి గడియారస్తంభం సెంటర్లో రాస్తారోకో చేశారు. పశువులతో రహదారి దిగ్బంధం అల్లవరం మండలం బెండమూరులంకలో రైతులు రోడ్డుపై పశువులను నిలిపి దిగ్బంధం చేశారు. రాజోలులో వ్యవసాయ శాఖ ఉద్యోగులు, రైతులు రోడ్డుపై వరినాట్లు వేశారు. ముమ్మిడివరలో విద్యార్థులు రోడ్డుపై ఖోఖో, కబడ్డీ ఆడి రాష్ట్ర విభజన పట్ల నిరసన వ్యక్తం చేశారు. కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు మండలాల్లో జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు ర్యాలీలు చేశాయి. మామిడికుదురు, అయినవిల్లి గ్రామాల్లో యూటీఎఫ్ రిలే దీక్షలు చేపట్టింది. పెద్దాపురం తహశీల్దారు కార్యాలయం వద్ద సమైక్యవాదులు ఉట్టి కొట్టి కృష్ణాష్టమి వేడుకలు చేశారు. ఏలేశ్వరం జూనియర్ కళాశాల విద్యార్థులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. రాజానగరంలో జాతీయ రహదారిపై జర్నలిస్టు సంఘాలు, జేఏసీ ప్రతినిధులు కలిసి వంటా వార్పు చేశారు. అనపర్తిలో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. మండపేటలో జేఏసీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు