
జేఎన్‌టీయూకే వర్సీటీ
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్నట్టుంది తమ పరిస్థితి అని జేఎన్‌టీయూకే అధ్యాపకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పరీక్ష ద్వారా ప్రొఫెసర్లుగా నియమితులైన తమను కాదని అడహాక్ పద్ధతిలో నియమితులైన వారికి సర్వాధికారాలు కట్టబెడుతున్నారని వాపోతున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని డైరెక్టరేట్లు ఏర్పాటు చేసి వాటికి డైరెక్టర్లుగా ఆ వర్సిటీ ప్రొఫెసర్లనే నియమించారు. వీరికి ఒక చాంబర్‌తో పాటు పీఏ, అటెండర్, డ్రైవర్‌ను అవుట్ సోర్సింగ్ పద్ధతిన కేటాయించారు. రెండేళ్లపాటు ఉండే పదవులకు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఆ పోస్టులు సాధించుకున్నవారూ ఉన్నారు. ఇటీవల నూతనంగా వచ్చిన వీసీ ఆయా డైరెక్టర్లను వారి సొంత విభాగాలకు బదిలీ చేస్తూ నూతన బృందాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాతవారు గుర్రుగా ఉన్నారు.
ఇదిలా ఉంటే వర్సీటీలో ఫార్మశీ, నానో టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఏవానాయిక్స్ వంటి తొమ్మిది డైరక్టరేట్లు ఏర్పాటుచేసి వీటికి పోగ్రాం డైరెక్టర్లుగా పలు ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలలో పనిచేసిన వారిని నియమిస్తూ వారికి ప్రతి నెలా 30 నుండి 40వేల వరకూ వేతనం చెల్లిస్తున్నారు. సాధరణంగా వర్సీటీలో పోగ్రాం డైరెక్టర్లుగా ఉండాలంటే ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేసినవారై ఉండాలన్న నిబంధన ఉన్నా వాటిని కాదని పలు విభాగాలకు డైరెక్టర్లను నియమించారు. ఉదాహారణకు పుట్ టెక్నాలజీ విభాగానికి ప్రైవేట్ సంస్థలో పనిచేసిన వ్యక్తిని పోగ్రాం డైరెక్టర్‌గా నియమించారు. ఈ విభాగం కళాశాల లేదా ఐఎస్‌టీ విభాగానికి కానీ సంబంధం లేకుండా నేరుగా రిజిస్ట్రార్ నియంత్రణలో ఉండేలా ఏర్పాటుచేశారు. ఇటీవలే వీరి నియమాకాలు, వేతనాలు తదితర విషయాల్లో నిబంధనలు పాటించలేదంటూ అడిట్ విభాగం తప్పుబట్టినా ఎటువంటి చర్యలూ తీసుకోలేదని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇక రెండోది ఫార్మశీ విభాగంలో అదే పరిస్థితి ఉందని కనీసం ఈ సబ్జెక్టుతో సంబంధంలేకుండా పాలిటెక్నిక్ విభాగంలో పనిచేసిన వ్యక్తిని ఫార్మశీ డైరక్టర్‌గా నియమించారని అంటున్నారు. ఏటా ఈ విభాగంలో పనిచేసేవారిని రెన్యువల్‌కు నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉన్నా ఆ నిబంధనలు ఏమీ పట్టించుకోకుండా వారినే కొనసాగిస్తూన్నారని తెలిపారు. ఈ డైరెక్టర్ స్కాలర్లు, ఫార్మశీ విద్యార్థులపై చాలా విచక్షణ రహితంగా ప్రవర్తిసారంటూ వర్సీటీ ఉన్నత అధికారులతో పాటు ముఖ్యమంత్రి కార్యాలయం, చీఫ్ సెక్రటరీకి వినతిపత్రం అందజేశారు. ఇలా అన్ని డైరెక్టరేట్‌లోను ఇదే పరిస్థితి కొనసాగుతోందని వీటిని ప్రక్షాళన చేసి పూర్తి స్థాయిలో అర్హులైన వారిని, సబ్జెక్టులతో సంబంధం ఉన్నవారిని నియమించాలని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రక్షాళన చేపడతాం..
వర్సిటీ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సమీక్షించి ప్రక్షాళన చేపడుతున్నాం. పోగ్రాం డైరెక్టర్ల నియామకాలు, వేతనాలు అన్నీ గత అధికారుల హాయాంలో జరిగాయి. కమిటీతో చర్చించి అవసరమైతే వీటిపై తగు నిర్ణయం తీసుకుంటాము.– వీవీ సుబ్బారావు, రిజిస్ట్రార్, జేఎన్‌టీయూకే
Comments
Please login to add a commentAdd a comment