
బడి నుంచి క్రమశిక్షణ అలవడాలి... అది ఆచరణలో పెట్టించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదే...తరువాత ఉన్నత పాఠశాలలో బంగారు భవితను తీర్చిదిద్దుకుంటారు. కళాశాల, విశ్వవిద్యాలయాల్లో భావి భారత పౌరులుగా పూర్తి స్థాయి అవగాహనతో ప్రపంచంలోకి అడుగిడతారు. మరి వీరికి బోధించే ఆచార్యులు ఇంకెంత గౌరవంగా ఉండాలి. కానీ కాకినాడలోని జేఎన్‌టీయూ ఇందుకు భిన్నంగా నడుస్తూ పదేళ్లలోనే పలు వివాదాలకు వేదికయింది. అంతర్గత రాజకీయాలతోపాటు బయట రాజకీయాలు జోక్యం చేసుకోవడంతో మరింత కలుషితమవుతోంది.
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి , కాకినాడ : ఆయన అక్కడ ఆదేశిస్తారు. ఇక్కడ పాటించాల ని శాసిస్తారు. విద్యార్థుల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విశ్వవిద్యాలయంలో నడుస్తున్న ఈ తతంగం చూసి పలువురు విస్తుపోతున్నారు. జేఎన్‌టీయూ కాకినాడలో సీనియారిటీని పరిగణనలోకి తీసుకోకుండా... నిబంధనలు పట్టించుకోకుండా అనుభవం పెద్దగా లేని వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారు. డైరెక్టర్లు, ప్రిన్సిపాల్ నియామకాలన్నీ కీలక పదవిలో ఉన్న సీఎం సామాజిక వర్గానికి చెందిన ప్రొఫెసర్ ఆదేశాల మేరకు జరుగుతున్నాయి. అడిగే నాథుడు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా సాగిపోతోం ది. ఇక్కడ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించి ఉద్యోగ నియామక విభాగంలో రాష్ట్ర స్ధాయిలో కీలక పదవిలో ఉన్న సీఏం సామాజికి వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ నుంచి ఆదేశాల జారీకి అనుగుణంగా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తున్నారు. వర్సిటీ డైరెక్టర్ నుంచి ప్రొఫెసర్ బదిలీ వరకూ అన్నీ ఆయన ఆదేశాల మేరకే జరుగుతున్నాయంటూ పలువురు అధ్యాపకులు చర్చించుకుంటున్నారు.
ఇటీవలే కొత్త వీసీగా బాధ్యతలు చేపట్టిన ఉపకులపతి రామలింగరాజు వర్సిటీలో పలు మార్పులు చేశారు. ఈక్రమంలో ప్రిన్సిపాల్, డైరెక్టర్ పోస్టుల్లో కొత్త వారిని నియమించడంతో వివాదం చోటు చేసుకుంది. పేరుకు వీసీ ఉన్నప్పటికీ అంతా అమరావతి డైరెక్షన్ మేరకే జరిగిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అనుభవం, అర్హత లేని వారిని నియమించారంటూ అనుభవం గల పలువురు ప్రొఫెసర్లు వాపోతున్నారు. సీనియారిటీ, వాక్ చాతుర్యం లేని వారిని అందలం ఎక్కించి అర్హత, అనుభవం ఉన్న వారిని అవసరం లేదంటూ పక్కన పడేశారన్న విమర్శలున్నాయి. వర్సిటీలో ఉన్న డైరెక్టర్లతోపాటు విజయనగరం, నరసారావుపేట కళాశాల ప్రిన్సిపాళ్లను మార్చడంలో నిబంధనలు పక్కన పెట్టేసి ఇష్టారీతిన వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆరోపణలు ఇలా...
నరసారావుపేట కళాశాల ప్రారంభించిన ఒక బ్యాచ్‌ను ప్రిన్సిపాల్ నేతృత్వంలో పూర్తవకుండా అక్కడి ప్రిన్సిపా ల్‌గా ఉన్న మురళీకృష్ణను కాకినాడ కళాశాలకు మార్చా రు. ఇక విజయనగరం ప్రిన్సిపల్‌గా అదే కళాశాలలో ఈసీఈ విభాగ అధ్యాపకురాలిగా పనిచేస్తున్న సరస్వతికి ఇచ్చారంటూ అదే కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా ఉన్న స్వామినాయుడు ఫిర్యాదు చేశారు. జూనియర్ స్ధాయిలో ఉన్న ఆమెని ప్రిన్సిపల్‌గా నియమించడం ఎంతవరకు సమంజసమని వీసీకి ఫిర్యాదు చేశారు.విజయనగరం ప్రిన్సిపాల్ సరస్వతీ, నరసారావుపేట ప్రిన్సిపల్ రాజ్యలక్ష్మి ఒకే ఏడాది విధుల్లోకి చేరారని, 2007లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌లో చేరిన తనను వైస్ ప్రిన్సిపాల్ నుంచి తొలగించారంటూ స్వామినాయుడు ఫిర్యాదు చేశారు. రెండు పీహెచ్‌డీలు చేయించిన తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా 2013లో ప్రొఫెసర్‌గా వచ్చిన సరస్వతి గైడ్‌గా ఒక పీహెచ్‌డీ కూడా చేయించలేదని, ప్రిన్సిపాల్స్ నియామక నిబంధనలో ఈ విషయంపై ‘ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ) గెజిట్’లో స్పష్టంగా ఉన్నా నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అలాగే కాకినాడ వర్సిటీలో ఇదే క్యాడర్‌లో ఉన్న ఇద్దరికి (సీనియారిటీ లేని వారికి) డైరెక్టరేట్లు ఇచ్చి అనర్హులను అందలం ఎక్కించారంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే కొత్తగా ఏర్పాటు చేసిన డైరెక్టర్ల టీమ్‌లో తమ కులానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఢిల్లీలో ఉన్న తన సామాజిక కమిషన్ సభ్యులకు ఫిర్యాదు చెయ్యడానికి ఒక ప్రొఫెసర్ ఢిల్లీ వెళ్లారు. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న విజయవాడ ప్రైవేట్ కళాశాల యాజమాన్యం కూడా వర్సిటీలో వేలు పెట్టి ఫలానా వాళ్లకు పోస్టు ఇవ్వాలని గత వీసీ దగ్గరి నుంచి ఆదేశాలు జారీ చేస్తున్నారు. తనకు అనుకూలమైన అనేక మందికి గతంలో ప్రాధాన్యత గల బాధ్యతలు అప్పగించారు. తాజాగా విజయనగరం వైస్ ప్రిన్సిపాల్ నియామకంలో కూడా ఈయన పాత్రే ఎక్కువగా ఉందని వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఈవిధంగా కొందరి వ్యక్తుల జోక్యంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2007లో జేఎన్‌టీయూ కాకినాడ వర్సిటీగా ఏర్పడ్డ వర్సిటీ ఇప్పుడు పలు వివాదాలకు కారణమవుతోంది. విద్యాబుద్ధులు నేర్పవలసిన అధ్యాపకులు పాఠాలు చెప్పకుండా పరిపాలన చేస్తామంటూ కేవలం రెండు లేదా మూడు సంవత్సరాలు ఉండే డైరెక్టర్ల పదవుల కోసం నానా తంటాలు పడి ప్రజాప్రతిని«ధుల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యడంతో ఉన్న కాస్త గురువుల పరువు బజారున పడుతుంది. ఒక డైరెక్టర్ స్థాయిలో ఉండే ఆచార్యులైతే రిజిస్ట్రార్ పదవి కోసం ఏకంగా అమరావతిలో దాదాపు రూ. పది లక్షలు వరకూ వ్యయం చేసి పైరవీలకు దిగుతున్న సమయంలో పలు ఆరోపణలపై పత్రికల్లో ఆయనపై కథనాలు రావడంతో ఉన్నత స్థాయి వర్గాలు వెనక్కి తగ్గి డైరెక్టర్ పోస్టునుంచే తొలగించారు. లేదంటే ఆయనకు కూడా పెద్ద పీట వేసేవారే.
పరిపాలన సౌలభ్యం కోసంమారుస్తున్నాం..
వర్సిటీ పాలక మండలి సూచనల మేరకు పరిపాలన సౌలభ్యం కోసం డైరెక్టర్లు, అలాగే కళాశాల ప్రిన్సిపాళ్లను మార్చాం. ఇందులో ఎవరి ప్రమేయం లేకుండా అందిరికీ న్యాయం జరిగేలా కుల, లింగ బేధాల ప్రకారం మార్పులు చేపట్టాం. యూనివర్సీటీ నిబంధనల మేరకే బదిలీలు చేపట్టాం.– వీవీ సుబ్బారావు, జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్
Comments
Please login to add a commentAdd a comment