డిగ్రీ ఉంటే చాలు.. ఐటీ కొలువు!
ఐటీ ఉద్యోగాలు.. బీఈ/బీటెక్ అభ్యర్థులకే పరిమితమని చాలామంది భావిస్తుంటారు. కానీ ఇటీవల కాలంలో ఐటీ సంస్థలు నాన్ టెక్నికల్ కోర్సుల విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. శిక్షణను అందించి మరీ ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజ సంస్థలు.. ఫ్రెషర్స్ కోసం ఈ ఏడాది భారీగా నియామకాలు చేపడుతున్నాయి. నైపుణ్యాలుంటే.. ఏదైనా డిగ్రీతోనే.. ఐటీ కొలువు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ప్రముఖ ఐటీ సంస్థలు చేపడుతున్న నియామక విధానాలు, అర్హతలపై ప్రత్యేక కథనం...
టీసీఎస్ స్మార్ట్ హైరింగ్
దేశ వ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు మరికొద్ది రోజుల్లోనే డిగ్రీ పట్టాలతో బయటకు రానున్నారు. వీరికోసం ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రామ్‌కు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి.. టీసీఎస్‌లోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తారు.
అర్హతలు
బీసీఏ, బీఎస్సీ, ఒకేషనల్ స్టడీస్(సీఎస్ అండ్ ఐటీ) కోర్సులను 2020, 2021ల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులతోపాటు 2022లో సంబంధిత డిగ్రీ కోర్సులను పూర్తిచేసుకునే వారు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి, ఇంటర్, బీఎస్సీ/బీసీఏ/ఓకేషనల్ కోర్సుల్లో కనీసం 50శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అలాగే అకడమిక్‌గా మొత్తమ్మీద రెండేళ్లకు మించి గ్యాప్ ఉండరాదు.
ఎంపిక విధానం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి.. తుది ఎంపిక చేస్తారు. ఇలా ఎంపికైన వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ), ఏఆర్, వీఆర్లపై నిపుణులతో టీసీఎస్ ప్రత్యేక శిక్షణను అందిస్తుంది. ఈ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న అభ్యర్థులను సంస్థలో పూర్తిస్థాయి ఉద్యోగులుగా నియామకం ఖరారు చేస్తారు. కొలువులో చేరిన వారు తమ విధులను నిర్వర్తిస్తూనే చదువుకునే అవకాశం కూడా ఉంది.
విధానం
టీసీఎస్ స్మార్ట్ హైరింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా నిర్వహించే పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 120 నిమిషాలు. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ–26 ప్రశ్నలు, వెర్బల్ ఎబిలిటీ–24 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు ఎదురవుతాయి.
న్యూమరికల్ ఎబిలిటీ
ఈ విభాగం నుంచి అడిగే 26 ప్రశ్నలకు 40 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. పర్ముటేషన్ అండ్ కాంబినేషన్, నంబర్ సిస్టమ్/ఎల్సీఎం అండ్ హెచ్‌సీఎఫ్, పర్సంటేజెస్, అలిగేషన్ అండ్ మిక్సర్, ప్రాబబిలిటీ, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్స్, జామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, ప్రాఫిట్ అండ్ లాస్, క్యాలెండర్ అండ్ క్లాక్, ప్రోగ్రెషన్స్, ఈక్వేషన్స్, షేప్స్ అండ్ పెరిమీటర్, డెసిమల్ ఫ్రాక్షన్, డివిజిబిలిటీ తదితర అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
వెర్బల్ ఎబిలిటీ
ఈ విభాగం నుంచి అడిగే 24 ప్రశ్నలను 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. స్పాటింగ్ ద ఎర్రర్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్, ఆర్డరింగ్ ఆఫ్ వర్డ్స్, చేంజ్ ఆఫ్ వాయిస్, వెర్బల్ అనాలజీస్, సినోనిమ్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, ఆర్డరింగ్ ఆఫ్ సెంటెన్సెస్, క్లోసెట్ టెస్ట్, వన్వర్డ్ సబ్సిట్యూట్స్, సెలక్టింగ్ వర్డ్స్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కరెక్షన్, కంప్లీటింగ్ స్టేట్మెంట్స్, పేరాగ్రాఫ్ ఫార్మేషన్, కాంప్రహెన్షన్, ఇడియమ్స్, చేంజ్ ఆఫ్ స్పీచ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
రీజనింగ్ ఎబిలిటీ
ఈ విభాగం నుంచి అడిగే 30 ప్రశ్నలకు 50 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఇందులో స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, డైరెక్షన్ సెన్స్, సిరీస్, విజువల్/స్పేషియల్ రీజనింగ్, ఫిగరల్ అండ్ ఫ్యాక్చువల్ అనాలసిస్, అనాలజీ, కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, పజిల్స్, లాజికల్ వెన్ డయాగ్రమ్ బేస్డ్ డీఐ, స్టేట్మెంట్ బేస్డ్ లాజికల్ కొశ్చన్స్, డెసిషన్ మేకింగ్, కొశ్చన్ ఆన్ వర్డ్ ప్యాటర్న్, లెటర్ సిరీస్ సంబంధ అంశాలను నుంచి ప్రశ్నలుంటాయి.
► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
►దరఖాస్తులకు చివరి తేదీ: 30.11.2021
► వెబ్సైట్: ww.tcs.com
హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్
మరో ఐటీ దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. డిగ్రీ అభ్యర్థులు ఐటీ రంగంలో కెరీర్ సొంతం చేసుకునేందుకు వీలుగా ఈ ప్రోగ్రామ్‌ను రూపొందించింది. ఐటీలో కెరీర్ కోసం ఎదురుచూస్తున్న గ్రాడ్యుయేట్స్‌ను పూర్తిస్థాయిలో ప్రొఫెషనల్ ఐటీ ఇంజనీర్స్‌గా తీర్చిద్దేందుకు ‘హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్’ పేరుతో ఈ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్‌ను కంపెనీ అనుబంధ విభాగమైన హెచ్‌సీఎల్ ట్రైనింగ్ అండ్ స్టాఫింగ్ సర్వీసెస్(హెచ్‌సీఎల్ టీఎస్ఎస్) ద్వారా అందించనున్నారు.
అర్హతలు
► బీఈ/బీటెక్/ఎంసీఏ/ఎంటెక్/ఎమ్మెస్సీ(ఐటీ)/బీఎస్సీ(ఐటీ, కంప్యూటర్ సైన్స్/బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్(సీఎస్/ఐటీ/సాఫ్ట్వేర్ డెవలప్మెంట్)/బీసీఏ అభ్యర్థులు హెచ్‌సీఎల్ ఫస్ట్ కెరీర్స్ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
► ఇంటర్, గ్రాడ్యుయేషన్, పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో 65 శాతానికిపైగా మార్కులు సాధించాలి.
► 2018, 2019, 2020, 2021ల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక విధానం
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఆన్లైన్ అప్టిట్యూడ్ టెస్ట్, ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చే స్తారు.
శిక్షణ
ఎంపికైన అభ్యర్థులందరికీ ఆరు నెలలపాటు శిక్షణ అందిస్తారు. మూడు నెలలు వర్చువల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్(ఇంటి నుంచే యాక్సెస్ చేసుకోవచ్చు), మరో మూడు నెలలు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌లో ప్రొఫెషనల్ ప్రాక్టీస్ టర్మ్ ట్రైనింగ్ ఉంటుంది. టెక్నికల్, ప్రాక్టికల్, పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్‌లో ట్రైనింగ్ ఇస్తారు. ఈ శిక్షణకు రూ1.5 లక్షల ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్‌లోన్ సాయం అందిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు రూ.2.75 లక్షల వార్షిక వేతనంతో హెచ్‌సీఎల్‌లో కొలువు లభిస్తుంది.
► వెబ్సైట్: https://hclfirstcareers.com
విప్రో.. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్
విప్రో సంస్థ కూడా తన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2022 ద్వారా.. బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్లను నియమించుకోనుంది. 2022లో డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకునే అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హతలు
పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణతోపాటు బీసీఏ, బీఎస్సీలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎలక్ట్రానిక్స్, ఫిజిక్స్ విభాగాల అభ్యర్థులు అర్హులు. గ్రాడ్యుయేషన్ స్థాయిలో తప్పనిసరిగా కోర్ మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. విద్యాభ్యాసం అంతా రెగ్యులర్, ఫుల్‌టైమ్ విధానంలో చదివి ఉండాలి.
ఎంపిక విధానం
ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్, అప్టిట్యూడ్ టెస్ట్(వెర్బల్, అనలిటికల్, క్వాంటిటేటివ్), రిటెన్ కమ్యూనికేషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ అసెస్మెంట్లో ఎంపికైన అభ్యర్థులు బిజినెస్ డిస్కషన్ రౌండ్‌ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
స్టయిపెండ్
ఎంపికైన అభ్యర్థులకు మొదటి నాలుగేళ్ల పాటు నెలకు రూ.15000 నుంచి రూ.23000 వరకు స్టయిపెండ్‌గా చెల్లిస్తారు. ఆ∙తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్‌గా నియమించి.. ప్రతిభ ఆధారంగా రూ.6లక్షల వార్షిక వేతనం అందిస్తారు.
► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
► వెబ్సైట్: https://careers.wipro.com/wilp