యువతిపై సర్పంచ్, గ్రామస్తుల అమానుషం
జోద్పూర్: రాజస్తాన్ లో దారుణం చోటు చేసుకుంది. తన ఫాంలో చెట్లు నరకడాన్ని వ్యతిరేకించిన యువతిని అమానుషంగా హత్యచేశారు. జోధ్ పూర్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన లలిత (20)ను గ్రామ పెద్దలు, మరికొంతమంది గ్రామస్తులు సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపింది.
పోలీసులు అందించిన సమాచార ప్రకారం జోధ్పూర్కు చెందిన గ్రామ సర్పంచ్ సహా కొంతమంది గ్రామస్తులు లలిత పొలంలో చెట్లను నరకడానికి ప్రయత్నించారు. దీన్ని ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో ఉద్రిక్తత చెలరేగింది. రెచ్చిపోయిన వారు ఆమెపై మూకుమ్మడిగా దాడిచేశారు. అక్కడితో ఆగకుండా ఆవేశంతో విచక్షణ మరచి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం లలిత కన్నుమూసింది.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసు అధికారి సురేష్ చౌదరి తెలిపారు. ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా భావిస్తున్న గ్రామ సర్పంచ్ రణవీర్ సింగ్, ఇతర గ్రామస్తులను విచారిస్తున్నట్టు చెప్పారు. విచారణ అనంతరం వారిని అదుపులోకి తీసుకుంటామన్నారు.