John Chambers
-
'ప్రపంచాన్ని మార్చే శక్తి ఆయనకు ఉంది'
శాన్ జోసె: ప్రపంచాన్ని, భారత్ ను మార్చే శక్తి ప్రధాని నరేంద్ర మోదీకి ఉందని సిస్కో సిస్టమ్స్ సీఈవో జాన్ చాంబర్స్ అభిప్రాయపడ్డారు. మోదీకి గ్లోబల్ విజన్ ఉందని, ప్రపంచ పరిణామాలపై ఆయనకు అవగాహన ఉందని అన్నారు. కాలిఫోర్నియాలోని శాన్ జోసెలో ఐటీ దిగ్గజ కంపెనీల సీఈవోలతో నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలువురు సీఈవోలు మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. మోదీ అమెరికాకు రావడం తమకెంతో ఆనందంగా ఉందని ఎడోబ్ సీఈవో శంతను నారాయణ్ అన్నారు. భారతదేశ వ్యాప్తంగా చవకైన బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. మోదీతో భేటీ అయిన వారిలో గూగుల్ సీఈవో సుందర్ పిచ్చై, యాపిల్ సీఈవో టిమ్ కుక్, టిఐఈఎస్ సీఈవో వెంక్ శుక్లా తదితరులు ఉన్నారు. -
టీఎస్-ఐపాస్‌పై సిస్కో ఆసక్తి
సంస్థ చైర్మన్‌ను రాష్ట్రానికి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా తెచ్చిన పారిశ్రామిక విధానం(టీఎస్-ఐపాస్) పట్ల ప్రఖ్యాత నెట్వర్కింగ్ కంపెనీ సిస్కో సిస్టమ్స్ చైర్మన్ జాన్ చాంబర్స్ ఆసక్తిని కనబరిచారు. అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు శనివారం శాన్‌జోస్ నగరంలోని సిస్కో కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. టీఎస్-ఐపాస్‌లోని కీలక అంశాలను సిస్కో చైర్మన్‌కు మంత్రి కేటీఆర్ వివరించారు. పారదర్శకమైన పారిశ్రామిక విధానం, పరిపాలనా సౌల భ్యాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి జాన్ చాంబర్స్ అభినందనలు తెలిపారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకున్న విస్తృత అవకాశాలను పరిశీలించేందుకు రాష్ట్రానికి రావాలని సిస్కో చైర్మన్‌ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు. ఆ తర్వాత ఎలక్ట్రికల్ రంగంలో పేరుగాంచిన జనరల్ ఎలక్ట్రికల్స్(జీఈ) సంస్థ మాజీ చైర్మన్ జాక్వెల్స్తో మంత్రి కేటీఆర్ సంభాషించారు. జాక్‌వెల్స్ వంటి పారిశ్రామిక వేత్త ఇచ్చిన సూచనలు, సలహాలు తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడతాయని మంత్రి తెలిపారు. అనంతరం శాంతాక్లారా కన్వెన్షన్ సెంటర్లో ది ఇండస్ ఎంటర్‌పెన్యూర్స్ ఏర్పాటు చేసిన టైకాన్ సదస్సులో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ-హబ్ ప్రత్యేకతలను వారికి వివరించారు. ఆపై సన్ మైక్రో సిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు వినోద్కోస్లాతో భేటీ అయిన కేటీఆర్.. సాంకేతిక రంగానికి సంబంధించి ప్రపంచంలో వస్తున్న అధునాతన మార్పులపై చర్చించారు.