జయలలిత కేసు తీర్పులోని ముఖ్యాంశాలు
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత 1991-1996 సంవత్సరాల మధ్య కాలంలో స్థిరాస్తులు, నగదుపై సమర్పించిన లెక్కలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని బెంగళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న ఆ కాలంలో ఆదాయం రూ. 9.91 కోట్లు, వ్యయం రూ. 8.49 కోట్లు ఉంది. అయితే, జయలలిత పేరున, ఆమెతోపాటుగా మరో ముగ్గురు నిందితుల పేరిట, వారి పేరున ఉన్న వాణిజ్య సంస్థల పేరిట ఉన్న స్థిరాస్తులు, నగదు విలువ మాత్రం మొత్తం రూ. 53.6 కోట్లుగా ఉంది. దీనిపై జయలలిత పేర్కొన్న లెక్కలు సంతృప్తికరంగా లేవనే అంశాన్ని ఎలాంటి సందేహాలకు తావులేని రీతిలో ప్రాసిక్యూషన్ నిర్ధారించిందని ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టంచేసింది. ఈ కేసుకు సంబంధించి జయలలితను, మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా గత శనివారం ఇచ్చిన తీర్పులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
* ఆదాయ వనరులకు మించి జయలలిత ఆస్తులను కూడబెట్టేందుకు, ఆమె స్నేహితురాలు, శశికళ, సమీప బంధువు ఇళవరసి, పెంపుడు కొడుకు వీఎన్ సుధాకరన్, ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలతో రుజువు చేసింది. అందువల్ల భారతీయ శిక్షాస్మతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద జయలలితతో పాటుగా మిగిలిన ముగ్గురూ శిక్షార్హులే.
* కోర్టు విధించిన రూ. 100 కోట్ల జరిమానా జయలలిత చెల్లించని పక్షంలో ఆమె మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది.
* దోషులు చెల్లించవలసిన జరిమానా వసూలు కోసం తగిన చర్యలను కూడా ప్రత్యేక కోర్టు ప్రకటించింది. వారిపేరున ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లను, ఖాతాల్లోని నగదు నిల్వలను జరిమానా మొత్తానికి సర్దుబాటు చేసేలా సంబంధిత బ్యాంకులకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. సర్దుబాటు చేసిన మొత్తం జరిమానాకంటే తక్కువగా ఉన్నపక్షంలో,. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని, వజ్రాభరణాలను రిజర్వ్ బ్యాంకుకు, స్టేట్ బ్యాంకుకు అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా నగదును సమీకరించి జరిమానా మొత్తానికి సర్దుబాటు చేయాలి.
* నిందితులకు సంబంధించిన ఆరు కంపెనీల పేరున ఉన్న స్థిరాస్తులను రాష్ట్రప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. నిందితుల నుంచి వసూలు చేసిన జరిమానా మొత్తంలో ఐదు కోట్ల రూపాయలను బెంగళూరులో జరిగిన ప్రత్యేక కోర్టు విచారణ ఖర్చు నిమిత్తం కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలి.
**