సమయమొచ్చినప్పుడు చెబుతా
బీజేపీలో చేరికపై మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
జర్నలిస్టు శేఖర్‌గుప్తా పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సమయమొచ్చినప్పుడు చెబుతానంటూ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై వ్యాఖ్యానించారు. మీరు మళ్లీ ఎప్పటినుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా పనిచేయబోతున్నారని అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా జవాబిచ్చారు. ప్రముఖ జర్నలిస్టు శేఖర్‌గుప్తా రాసిన ‘యాంటిసిపేటింగ్ ఇండియా - దిబెస్ట్ ఆఫ్ నేషనల్ ఇంట్రెస్ట్’ పుస్తక పరిచయం కోసం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డిని చుట్టుముట్టిన పలువురు జర్నలిస్టులు బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పేందుకు నిరాకరించారు. మీరు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై మీనుంచి ఎలాంటి ఖండన లేదంటూ విలేకరులు ప్రస్తావిం చగా... తరువాత మాట్లాడుకుందామంటూ చిరునవ్వు నవ్వుతూ జవాబు దాట వేశారు. రాష్ట్ర విభజన కారణంగా ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమతాయో తాను ముఖ్యమంత్రిగా అసెంబ్లీలోనూ, విలేకరుల సమావేశాల్లో చెప్పినవే ఇప్పుడు వాస్తవ రూపంలో కనిపిస్తున్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పుస్తక పరిచయ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన కంటే బాగా యాక్టివ్‌గా ఉన్న రాజకీయ నాయకులు రాష్ట్రంలో చాలామంది ఉన్నారని తాను చెప్పినప్పటికీ తనను ప్రత్యేకంగా శేఖర్‌గుప్తా ఆహ్వానించడంవల్లే ఈ కార్యక్రమానికి హాజరయ్యానని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వ నిర్ణయానికి ప్రశంసలు
అంతకుముందు పుస్తక పరిచయ కార్యక్రమంలో కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. అనవసర చట్టాలు రద్దు చేయాలన్న బీజేపీ నిర్ణయాన్ని ప్రశంసించారు. దేశంలో ఎన్నో అనవసర చట్టాల వల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుందని, వీటిని రద్దు చేయాలనుకోవడం మంచి నిర్ణయమన్నారు. తన అరగంట ప్రసంగంలో దేశ రాజకీయాలపై ఎక్కువగా మాట్లాడినప్పటికీ... కాంగ్రెస్, ఆ పార్టీ నేతల గురించి ఏ మాత్రం ప్రస్తావించలేదు. అదేసమయంలో బీజేపీకి చెందిన మాజీ ప్రధాని వాజ్‌పేయ్ పేరును ప్రస్తావించారు.