ఒకరు పోతే.. ఐదుగురు వచ్చారు
లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. బీఎస్పీ మాజీ నేత స్వామి ప్రసాద్ మౌర్య బీజేపీలో చేరిన మరుసటి రోజే.. ఇతర పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, మరో మాజీ మంత్రి బీఎస్పీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, అధికార సమాజ్వాదీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే బుధవారం బీఎస్పీలో చేరినట్టు ఆ పార్టీ నేత నసీముద్దీన్ చెప్పారు. బీఎస్పీలో చేరినవారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నవాబ్ ఖాజిం (రాంపూర్ జిల్లా స్వర్), మహ్మద్ ముస్లిం (అమేథిలోని టిలోయి), దిల్నావాజ్ ఖాన్ (బులంద్షార్), ఎస్పీ ఎమ్మెల్యే నవాజిష్ అలాం ఖాన్ (ముజఫర్ నగర్ జిల్లా బుధాన) ఉన్నారు. అలాగే బీజేపీకి చెందిన మాజీ మంత్రి అవదేష్ వర్మ కూడా బీఎస్పీలో చేరారు. వీరు ఎలాంటి షరతులు లేకుండా పార్టీలో చేరారని నసీముద్దీన్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో వీరికి బీఎస్పీ తరఫున టికెట్లు దక్కవచ్చని భావిస్తున్నారు.