సమాజం కోసం జీవించిన జాషువా
ఒంగోలు టౌన్ : గుర్రం జాషువా తన కోసం కాకుండా సమాజం కోసం జీవించారని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ వెల్లడించారు. గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో 119వ జయంతి సభను ఆదివారం స్థానిక ప్రకాశం భవనం ఆవరణలో నిర్వహించారు. కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజైరెప్రసంగిస్తూ జాషువా సరళమైన తెలుగు భాషలో అందరికీ అర్థమయ్యేలా కవితలుగా రాశారన్నారు.
తన కవిత్వం ద్వారా సామాజిక మార్పు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి పద్మభూషణ్ వంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా అందుకున్న గొప్ప వ్యక్తి జాషువా అని కలెక్టర్ పేర్కొన్నారు. జాషువా జీవితం, ఆయన రాసిన కవితలపై అధ్యయనం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. జాషువా జయంతి కార్యక్రమాల ద్వారా కవితలను ప్రచారం చేసేందుకు మరింత మందికి స్ఫూర్తి ఇచ్చేందుకు కృషి చేయాలని కోరారు. మాజీ మంత్రి జీవీ శేషు మాట్లాడుతూ గుర్రం జాషువా పద్యాలు అజరామరమన్నారు.
బండారు రామారావు, చీమకుర్తి నాగేశ్వరరావు వంటివారి కంఠం నుంచి జాషువా పద్యాలు రావడంతో వాటికి మరింత ఖ్యాతి వచ్చిందన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర నాయకుడు ఉసురుపాటి బ్రహ్మయ్యమాదిగ మాట్లాడుతూ చరిత్రను గుర్రం జాషువా తిరగరాశారని కొనియాడారు. దళిత సాహిత్యానికి దిక్సూచిగా నిలిచారన్నారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ గుర్రం జాషువా అంటరానితనాన్ని అజెండాగా చేసుకొని కవిత్వాలు రాశారన్నారు. అస్పృశ్యత వంటి చట్టాలను పటిష్టంగా అమలు చేయడమే జాషువాకు నిజమైన నివాళి అన్నారు.
కార్యక్రమంలో అభ్యుదయ కవులు దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి, కత్తి కల్యాణ్, కొలకలూరి స్వరూపరాణి, దళిత నాయకులు తాటిపర్తి వెంకటస్వామి, తేళ్ల భాస్కరరావుమాదిగ, బి.ఏసుదాసుమాదిగ, పల్నాటి శ్రీరాములు, చప్పిడి వెంగళరావు, ముప్పవరపు గోపి, సుజన్‌మాదిగ, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవీ సుబ్బారావు తదితరులు ప్రసంగించారుప్రకాశం అక్షర విజయం పేరుతో స్వల్ప కాలంలో లక్షలాదిమంనని నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్‌కు జాషువా సాహితీ సాంస్కృతిక సమాఖ్య తరఫున జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. తొలుత ప్రకాశం భవనం ఆవరణలోని గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
బీటీఏ ఆధ్వర్యంలో..
ఒంగోలు వన్‌టౌన్ : మహాకవి గుర్రం జాషువా జయంతిని పురస్కరించుకుని బహుజన టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం స్థానిక సావిత్రిబాయి పూలే భవన్లో జరిగిన సమావేశంలో బీటీఏ జిల్లా అధ్యక్షుడు బి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలు, మానవతావాదాన్ని తనదైన శైలిలో బహిర్గత పరిచి జాషువా చరిత్ర సృష్టించారని కొనియాడారు.
జిల్లాలో విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఆడిటోరియం నిర్మాణానికి కృషి చేయాలన్నారు. ప్రగతిశీల అధ్యయనాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో బీటీఏ సభ్యులు తెలుగు కళామండలిగా ఏర్పడాలని నిర్ణయించారు. తెలుగు కళామండలి అడహక్ కమిటీ కన్వీనర్‌గా సీహెచ్ పెదబ్రహ్మయ్య, చైర్మన్‌గా ఎం.భాస్కరరావు, కో కన్వీనర్లుగా మాలకొండయ్య, దాసరి జనార్దనరావు, దార్ల కోటేశ్వరరావులను నియమించారు. కార్యక్రమంలో జగన్మోహన్, జాలాది మోహన్, బి.శోభన్‌బాబు, నారాయణ, కృష్ణమూర్తి, విజయబాబు, వీరనారాయణ పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో..
ఒంగోలు : భారతీయ జనతాపార్టీ ఎస్సీ మోర్చా నగర కమిటీ ఆధ్వర్యంలో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా 119వ జయంతి కార్యక్రమం స్థానిక పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కమిటీ నగర అధ్యక్షుడు ముదవర్తి బాబూరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జాషువా తన రచనలతో దళితులు, బడుగుల్లో చైతన్యం నింపారని, పట్టుదల, స్వయంకృషితో అనేక బిరుదులు సాధించారని, గబ్బిలం వంటి మహా రచనల ద్వారా సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారని కొనియాడారు.
అటువంటి మహానేత స్ఫూర్తిగా ప్రస్తుత ప్రైవేటు విద్యాలయాల్లో తెలుగు బోధనను తప్పనిసరి చేయాలని, అందుకు అవసరమైతే ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని తీర్మానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు, మువ్వల వెంకటరమణారావు, జిల్లా అధ్యక్షుడు కనమాల రాఘవులు, ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రాజధనవర్మ, నగర అధ్యక్షుడు ఎస్కే ఖలీఫతుల్లా, ముస్లిం మైనార్టీ జిల్లా ఇన్చార్జి వి.వెంకట్ తదితరులు పాల్గొన్నారు.