Journalist Gauri Lankesh
-
నిష్పక్షపాతంగా విచారించండి
సాక్షి, బెంగళూరు: పాత్రికేయురాలు గౌరి లంకేశ్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్ బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గౌరి లంకేశ్ సోదరి కవితా లంకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుడు మోహన్ నాయక్‌పై కేసు కొట్టివేతను నిష్పక్షపాతంగా విచారించాలని సూచించింది. సంఘటిత నేరాల నియంత్రణ చట్టం ప్రకారం మోహన్ నాయక్‌పై దాఖలైన కేసును కర్ణాటక హైకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేసింది. దీన్ని ప్రశ్నిస్తూ కవితా లంకేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాని మోహన్ నాయక్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పిటిషనర్ కవిత లంకేశ్ ఎస్ఎల్పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయడంతో పాటు బెయిల్ రద్దు చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. కాగా, 2017 సెప్టెంబర్ 5న గౌరి లంకేశ్ బెంగళూరు రాజరాజేశ్వరి నగరలోని తన నివాసంలో దండుగుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. -
తప్పులో కాలేసిన పవన్.. భగ్గుమన్న నెటిజన్లు
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాలో మాత్రమే యాక్టివ్ ఉంటూ, అప్పుడప్పుడు ప్రజల వద్దకు వెళ్లి పలకరించే నేతగా పేరున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఓ పెద్ద తప్పులో కాలేశారు. బెంగళూరులో జరిగిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్(55) హత్య వివాదంపై పవన్ ప్రశ్నిస్తూ వరుస ట్వీట్లు చేశారు. అయితే నెటిజన్లు మాత్రం పవన్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు. మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ పేరును గౌరీ శంకర్ గా పేర్కొనడమేంటని పవన్ ను ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా విషయంపై ప్రశ్నించాలనుకుంటే ముందుగా అంశంపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని, పవన్ మాత్రం కనీసం పేరు సరిగా తెలుసుకోలేని పరిస్థితుల్లో ట్వీట్లు చేయడం అవసరమా అని నెటిజన్లు చురకలంటిస్తున్నారు. మంగళవారం రాత్రి హత్య జరగగా.. పలువురు ప్రముఖులు బుధవారం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించగా.. పవన్ మాత్రం తీరికగా గురువారం రోజు గౌరీ లంకేశ్ హత్యపై స్పందించడం కూడా నెటిజన్ల ఆగ్రహాన్ని రెట్టింపు చేసినట్లుంది. చివరికి తాను చేసిన తప్పిదాన్ని దిద్దుకోవడంలోనూ ఆయన నైజం బయటపడిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి క్షమాపణ చెప్పకుండానే.. గౌరీ శంకర్ పేరును గౌరీ లంకేశ్ గా చదువుకోవాలంటూ పవన్ మరో ట్వీట్ చేయడాన్ని సామాజిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ‘సామాజిక వేత్త, జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ తన కలంతో సమాజానికి ఎంతో సేవ చేశారు. కానీ తుపాకీ తుటాలకు ఆమె చనిపోయారు. అయితే దేశంలో ఎన్నో మతాలు, కులాలు, భాషలున్నాయని కలిసికట్టుగా ఉండాలే తప్ప ఇలాంటి దాడులకు పాల్పడకూడదు. ఒక్కో వ్యక్తికి ఓ తరహా వ్యక్తిత్వం ఉంటుంది. కానీ హిందూత్వ వాదులే ఆమె హత్యకు కారణమని వాస్తవాలు తెలుసుకోకుండా ప్రచారం చేయకూడదు. ఒక్క గౌరీ లంకేశ్ ను హత్యచేస్తే.. లక్షల మంది గౌరీ లంకేశ్‌లు పుట్టుకొస్తారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానంటూ’ జనసేన అధినేత పవన్ వరుస ట్వీట్లు చేశారు. కానీ ఆలస్యంగా స్పందించడంతో పాటు గౌరీ లంకేశ్ పేరును తప్పుగా పేర్కొనడంతో పవన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
'ఆ మధ్య ఓ వ్యక్తి ఇంటిచుట్టూ తచ్చాడాడు'
సాక్షి, బెంగళూరు : తన సోదరికి వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరని ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ సోదరి సోదరులు చెప్పారు. ఆమె నమ్మిన ఐడియాలజీకి కట్టుబడి ఉండటం వల్లే హత్యకు దారి తీసిందని భావిస్తున్నామన్నారు. లంకేష్ భావజాలం, సిద్ధాంతం నచ్చని వారే ఈ పనిచేసి ఉంటారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేస్తారని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియన వ్యక్తుల చేతుల్లో గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హత్య కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె సోదరి, సోదరుడైన కవిత, ఇంద్రజిత్ లంకేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ సోదరిపై జరిగిన దాడిని భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. కవిత, ఇంద్రజిత్లు మాట్లాడుతూ 'ఆమె ఎప్పుడు భయపడలేదు. ఇటీవల ఆమె ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కూడా భద్రత తీసుకొమ్మంటే అందుకు నిరాకరించారు. ఆ మధ్య ఓ వ్యక్తి ఓ వారంపాటు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించాడు. వాస్తవానికి ఇంకొకరైతే ఫిర్యాదు చేసే వారు. అయితే, లంకేష్ మాత్రం ఆ వ్యక్తితో ఏం కాదులే అనుకొని ధైర్యంగా ఉన్నారు. ఆమెపై వ్యక్తిగత కారణాలతో ఈ దాడి జరగలేదు. మాతండ్రిలాగే మీడియా రచనలో చాలా దూకుడుగా వ్యవహరించేవారు. కానీ, వ్యక్తిగా మాత్రం చాలా సున్నితమైన వారు' అని చెప్పారు. -
అక్షర హత్యలు
-
గళమెత్తిన పాత్రికేయ లోకం
గౌరీ హత్యపై పెల్లుబికిన నిరసనలు - కదలిన ప్రజా, విద్యార్థి, కార్మిక సంఘాలు - పలుచోట్ల ర్యాలీలు, దిష్టిబొమ్మల దహనం - జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టం తేవాలని డిమాండ్ సాక్షి, హైదరాబాద్: కన్నడనాట లంకేశ్ పత్రిక సంపాదకురాలు గౌరీ లంకేశ్ దారుణ హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. జర్నలిస్టు సంఘాలు, ప్రజా, విద్యార్థి, కార్మిక సంఘాలు, మహిళా పాత్రికేయ సంఘాలు, కవులు, రచయితలు, సామాజిక, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తూటాలకు, హత్యలకు జర్నలిజం ఎన్నటికీ తలవంచబోదంటూ నినదించారు. నిజాన్ని నిర్భయంగా రాస్తే చంపేస్తారా అంటూ నిలదీశారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద ఐజేయూ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ మాట్లాడుతూ... ‘‘ఇది కచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే. జర్నలిస్టుల భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తేవాలి. గోవింద్ పర్సారే, నరేంద్ర ధబోల్కర్, ఎంఎం కల్బుర్గీ, గౌరీ లంకేశ్ హత్యలన్నింటికీ ఒకే కారణం కనిపిస్తోంది. హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి’’అని డిమాండ్ చేశారు. బీజేపీ అండతోనే మతతత్వ శక్తులు ఈ హత్యకు పాల్పడ్డాయని ఐజేయూ నాయకులు కె.శ్రీనివాస్‌రెడ్డి దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య, లౌకిక విలువలు కాపాడేవారిపై దాడులు ఎక్కువయ్యాయని ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, ఐజేయూ కార్యదర్శి నరేందర్, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, సీనియర్ పాత్రికేయులు కె.శ్రీనివాస్, ప్రగతిశీల మహిళా సంఘం నేత సంధ్య, పశ్య పద్మ, సామాజికవేత్త దేవి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్ పాల్గొన్నారు. గౌరీ స్ఫూర్తిని కొనసాగిస్తాం నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా ఇండియా (ఎన్‌డబ్ల్యూఎంఐ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు. జర్నలిస్టులు ప్లకార్డులు పట్టు కుని గౌరీ హత్యకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఖైరతాబాద్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎన్‌డబ్ల్యూఎంఐ ప్రతినిధులు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళిచారి, కార్యదర్శి ఎస్.విజయ్‌కుమార్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నరేందర్, రాజేశ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఉపాధ్యక్షులు పల్లె రవికుమార్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు రమణ పాల్గొన్నారు. ఏపీలోనూ జర్నలిస్ట్ సంఘాలు నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. మానవత్వానికే మచ్చ గౌరీ లంకేశ్ హత్య మానవత్వానికే మాయని మచ్చ అని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ప్రొఫెసర్ జయ«ధీర్ తిరుమల్‌రావు అన్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సాహితీ, తెలంగాణ రచయితల వేదిక, అరసం, తెలంగాణ ప్రజాస్వామిక వేదికల సంయుక్త ఆధ్వర్యంలో గౌరీ హత్యను ఖండిస్తూ సంతాప సభ నిర్వహించారు. మరోవైపు గౌరీ లంకేశ్ హంతకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్), తెలంగాణ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టు అసోసియేషన్(టీబీజేఏ), ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు(ఐఎఫ్‌డబ్ల్యూజే), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జర్నలిస్టు (హెచ్‌యూజే)ల సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గౌరీ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని టీడబ్ల్యూజేఎఫ్ ప్రధాన కార్యదర్శి బసవ పున్నయ్య డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జర్నలిస్ట్ సంఘాల నేతలు జి.ఆంజనేయులు, మామిడి సోమయ్య, కోటేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ హత్యను తీవ్రంగా ఖండించింది. ఖండించిన సీపీఐ, సీపీఎం: ఎన్డీఏ అధికారంలోకి వచ్చాకే వందలాది మందిని వేధింపులకు గురిచేస్తున్నారని, దళితులపై దాడులు పెరిగాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. గౌరీ హంతకులను కఠినంగా శిక్షించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఆరెస్సెస్ భావజాలానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా చంపేస్తున్నారని డీవైఎఫ్ఐ ఒక ప్రకటనలో విమర్శించింది. నేడు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన గౌరీ లంకేశ్ హత్యను నిరసిస్తూ గురువారం సాయంత్రం 6 గంటలకు సోమాజీగూడలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఒక ప్రకటనలో తెలిపింది. -
రెండేళ్లు.. 172 దాడులు
24 ఏళ్లలో 70 మంది జర్నలిస్టుల మృత్యువాత - ఆందోళన కలిగిస్తోన్న జర్నలిస్టులపై దాడులు - పత్రికా స్వేచ్ఛా సూచిలో 136వ స్థానంలో భారత్ ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ దారుణ హత్య నేపథ్యంలో అసలు దేశంలో జర్నలిస్టులకు రక్షణ ఎంత అనే ప్రశ్న ఉదయిస్తోంది. 2014, 2015 ఈ రెండేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై ఏకంగా 142 దాడులు జరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) తాజా గణాంకాలు వెల్లడించాయి. ఈ 142 దాడులకు సంబంధించి 73 మంది అరెస్ట్ అయినట్టు ఎన్సీఆర్బీ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూలైలో పార్లమెంట్లో ప్రకటించింది. జర్నలిస్టులపై దాడులకు సంబంధించి 2014 నుంచి ఎన్సీఆర్బీ గణాంకాలను సేకరిస్తోంది. 2014లో 114, 2015లో 28 కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 64 కేసులతో ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో 26, బిహార్‌లో 22 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మొత్తం కేసుల్లో 79 శాతం ఈ మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. ఇక మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 42 మంది (2014లో 10 మంది, 2015లో 32 మంది) అరెస్ట్ అయ్యారు. 24 ఏళ్లలో 70 మంది మృత్యువాత.. మొత్తంగా చూస్తే 1992 నుంచి 2016 వరకూ అంటే 24 ఏళ్ల కాలంలో వివిధ కారణాల వల్ల మరణించిన జర్నలిస్టుల సంఖ్య 70 వరకూ ఉంటుందని ద కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ప్రకటించింది. వీరిలో 40 మంది జర్నలిస్టుల మరణాలు నిర్ధారణ అయ్యాయని, 27 మంది హత్యకు గురికాగా.. మరో 13 మంది ప్రమాదకరమైన అసైన్మెంట్లను అప్పగించడం వల్ల మరణించినట్టు వెల్లడించింది. కాగా, రిపోర్టర్స్ విత్అవుట్ బోర్డర్స్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక–2017 ప్రకారం.. 180 దేశాల్లో మనదేశం 136వ స్థానంలో నిలిచింది. – సాక్షి తెలంగాణ డెస్క్ -
పాత్రికేయ ధీర
మరో అక్షరం నేలకొరిగింది. ఎంతటివారినైనా నిలదీయడానికి వెనకాడని ఒక ధిక్కార స్వరం మూగబోయింది. మంగళవారం చీకట్లో మాటుగాసిన దుండగులు బెంగళూరు నగరంలో ప్రముఖ మహిళా జర్నలిస్టు ‘గౌరీ లంకేశ్’ పత్రిక సంపా దకురాలు అయిన గౌరీ లంకేశ్‌ను పొట్టనబెట్టుకున్న తీరు ఈ దేశంలో వర్తమాన స్థితిగతులకు అద్దం పడుతుంది. ఆమె వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆమె సాహసం ఎంతటిదో, ఆమె ఏ విలువల కోసం దృఢంగా నిలబడతారో, ఎవరి పక్షం వహిస్తారో చెప్పడానికి మరణానికి కొన్ని నిమిషాల ముందు కూడా ఆమె సామాజిక మాధ్యమాల ద్వారా వ్యక్తం చేసిన అభిప్రాయాలు వెల్లడిస్తాయి. సహచరులు, సన్నిహితులు ఈ విషయంలోనే ఆమెను తరచు హెచ్చరించేవారని, జాగ్రత్తలు పాటించమని సూచించేవారని కుటుంబ సభ్యులంటున్నారు. కానీ అధికార మదంతో చెలరేగే... మతోన్మాదంతో శివాలెత్తే... పౌరులకు పీడగా పరిణ మించే పిపీలకాలను నిలదీయడం, ధిక్కరించడం, హేళన చేయడం ఆమె నైజం. అది ఆమెకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఒక ఉన్నత సంప్రదాయం. చెప్పాలంటే అసలు కన్నడ నేలలోనే అందుకు బీజాలున్నాయి. సామాజిక దురన్యాయాలపైనా, మూఢ విశ్వాసాలపైనా, తప్పుడు సంప్రదాయాలపైనా 12వ శతాబ్దిలోనే పోరాడిన బసవన్నకు జన్మనిచ్చిన గడ్డ అది. బసవన్న పరంపర అక్కడి సమాజంపైనా, సాహిత్యంపైనా, తాత్విక రంగంపైనా చూపిన, చూపు తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. పాత్రికేయ రంగం కూడా దీనికి అతీతం కాదు. గౌరీ లంకేశ్, ఆమె తండ్రి పాల్యాడ లంకేశ్ మూలాలు అక్కడే ఉన్నాయి. అందుకే ఆయన నిర్వహించిన ‘లంకేశ్’ పత్రికైనా, ఆమె ఆధ్వర్యంలో వెలువ డుతున్న ‘గౌరీ లంకేశ్’ పత్రిక అయినా ప్రభుత్వాల నుంచిగానీ, ప్రైవేటు సంస్థల నుంచిగానీ ఎలాంటి వాణిజ్య ప్రకటనలనూ స్వీకరించకూడదన్న నియమం పెట్టుకున్నాయి. కేవలం పాఠకులు చెల్లించే చందాలతో, పత్రిక వెలువరించే వివిధ రకాల గ్రంథాల అమ్మకం ద్వారా లభించే ఆదాయంతోనే ఆ పత్రికలు నడిచాయి. గౌరి లంకేశ్ తన పత్రికను ప్రత్యేకించి దళితులకూ, రైతులకూ, ఇతర అణగారిన వర్గాలకూ వేదికగా మలిచారు. అధికారంలో బీజేపీ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా ఆ ప్రభుత్వాల దుర్నీతిని ఎండగట్టారు. వారి అవినీతి, అక్రమాలను నిలదీశారు. ఈ క్రమంలో వస్తున్న బెదిరింపులనూ, హెచ్చరికలనూ, కించపరుస్తూ చేసే వ్యాఖ్యా నాలనూ ఆమె పట్టించుకోలేదు. ‘మనమే భయపడితే వీటన్నిటినీ బయటపెట్టేదె వర’ని గౌరి ప్రశ్నించేవారు. ఆ సాహసమే నానా రకాల అక్రమార్కులనూ, ఉన్మా దులనూ భయపెట్టింది. తమకు నచ్చని భావాలు వ్యక్తం చేస్తున్నారని అసహనంతో రగిలిపోయే శక్తులు ఇప్పుడు దేశమంతటా అలుముకుని ఉన్నాయి. ఈ శక్తులే గతంలో మహారాష్ట్రలో గోవింద్ పన్సారే, డాక్టర్ నరేంద్ర దభోల్కర్‌లను పొట్టనబెట్టుకు న్నాయి. ఇలాంటి శక్తులే రెండేళ్లక్రితం కర్ణాటకలో ప్రముఖ సాహితీవేత్త, హేతువాది డాక్టర్ కల్బుర్గిని కాల్చిచంపాయి. ప్రభుత్వాలు చేవచచ్చి శవాకారా లుగా మారినప్పుడు, సమాజం ఒక్కటిగా నిలబడి పోరాడలేనప్పుడు ఉన్మాదం రెచ్చిపోతుంది. నిలదీసే గొంతులను వెంటాడుతుంది. గోవింద్ పన్సారే, దభోల్కర్‌ల హత్యలపై విచారణ వేగవంతం చేయాలంటూ గౌరి హత్యకు వారం రోజుల ముందు బొంబాయి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ ఎస్సీ ధర్మాధికారి విలువైన వ్యాఖ్యలు చేశారు. ‘ఈ హత్యలు చెదురు మదురుగా జరిగినవి కాదు. సంస్థాగతమైన మద్దతు లేనిదే, ఎప్పటికప్పుడు డబ్బు చేతికందనిదే హంతకులు ఇలాంటి దుండగాలకు పాల్పడటం, దీర్ఘకాలం తప్పించుకు తిరగడం సాధ్యం కాదు’ అని అభిప్రాయపడ్డారు. ఇది కర్ణాటకలో లోగడ జరిగిన కల్బుర్గి హత్యకైనా, ఇప్పుడు గౌరి హత్యకైనా వర్తిస్తుంది. గౌరి హత్య జరిగినరోజు దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో తమ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయంటూ బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు కర్ణాటక అంతటా నిరసన ప్రదర్శనలకు దిగాయి. వాటిని అడ్డుకోవడానికి రోడ్లపై ఎక్కడబడితే అక్కడ పోలీసు బలగాలున్నాయి. అంతటి బందోబస్తు ఉన్నరోజున కూడా బెంగళూరు మహా నగరంలో ఒక బైక్‌పై ముగ్గురు దుండగులు వచ్చి, కాపుగాసి ఆమెను కాల్చిచంపగలిగారంటే ప్రభుత్వాలు ఎంత పనికిమాలిన తీరులో పనిచేస్తున్నాయో అర్ధమవుతుంది. గౌరి హత్యపై సీబీఐ దర్యాప్తు జరపాలని ఆమె సోదరుడు కోరుతున్నారు. డాక్టర్ కల్బుర్గి హత్య కేసు దర్యాప్తులో సీఐడీ విఫలమైంది గనుక ఆయన ఆ డిమాండు చేసి ఉండొచ్చు. కానీ మహారాష్ట్రలో దభోల్కర్, గోవింద్ పన్సారే హత్య కేసుల్లో ఇంతవరకూ సీబీఐ సాధించింది శూన్యం. అనుమానితులంటూ ఒకరిద్దర్ని అరెస్టు చేసినా దర్యాప్తు తీరు ఏమాత్రం సరిగా లేదని హైకోర్టు అక్షింతలు వేసింది. పాలకులు చేతగానివారైనా, ఉద్దేశపూర్వకంగా చూసీచూడనట్టు ఉండిపోయినా చివరకు జరిగేది ఇదే. ఆ పరిస్థితుల్లో సీఐడీ, సీబీఐలాంటి సంస్థలు చేయగలిగేది ఉండదు. ఈ ఏడాది ఇంతవరకూ దేశవ్యాప్తంగా ఎనిమిదిమంది పాత్రికేయులను దుండగులు పొట్టబెట్టుకున్నారు. అనేకమందిపై దౌర్జన్యాలు సాగుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లాంటి రాష్ట్రాల్లో నేరుగా పోలీసు ఉన్నతాధికారులే బెదిరింపులకు దిగు తున్నారు. సమాజం కోసం, సమాజం తరఫున నిస్వార్ధంగా నిలదీసే గొంతుల్ని నులిమేయాలని చూసే శక్తులది ఇప్పుడు పైచేయి అవుతున్నది. దీన్ని ఎక్కడికక్కడ ప్రతిఘటించకపోతే ప్రజాస్వామ్య మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. అన్యాయా లను, అక్రమాలను నిలదీయడానికి పత్రికలు వినియోగించుకుంటున్న భావప్రక టనాస్వేచ్ఛ వాటి సొంతం కాదు. అది సారాంశంలో ప్రశ్నించడానికి ప్రజలకుండే హక్కు. ఆ హక్కుపై ఉక్కుపాదం మోపడమే పాత్రికేయ ధీర గౌరిని కాల్చిచంప డంలోని ఆంతర్యం. అందుకే ఈ దుండగాన్ని అందరూ ఖండించాలి. హక్కుల పరిరక్షణకు ఒక్కటై నిలవాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వాల మెడలు వంచడం సాధ్యపడుతుంది.