సాక్షి, బెంగళూరు: పాత్రికేయురాలు గౌరి లంకేశ్ హత్య కేసులో నిందితుడు మోహన్ నాయక్ బెయిల్ పిటిషన్‌పై ఎలాంటి ప్రభావాలకు లోనుకాకుండా పరిష్కరించాలని కర్ణాటక రాష్ట్ర హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. గౌరి లంకేశ్ సోదరి కవితా లంకేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా నిందితుడు మోహన్ నాయక్‌పై కేసు కొట్టివేతను నిష్పక్షపాతంగా విచారించాలని సూచించింది. సంఘటిత నేరాల నియంత్రణ చట్టం ప్రకారం మోహన్ నాయక్‌పై దాఖలైన కేసును కర్ణాటక హైకోర్టు ఏప్రిల్ 22న రద్దు చేసింది.
దీన్ని ప్రశ్నిస్తూ కవితా లంకేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ మంజూరు చేయాని మోహన్ నాయక్ కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు పిటిషనర్ కవిత లంకేశ్ ఎస్‌ఎల్‌పీ (స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయడంతో పాటు బెయిల్ రద్దు చేస్తూ మధ్యంతర ఆదేశాలివ్వాలని కోరగా దీనిపై కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని తెలపాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15కు వాయిదా వేసింది. కాగా, 2017 సెప్టెంబర్ 5న గౌరి లంకేశ్ బెంగళూరు రాజరాజేశ్వరి నగరలోని తన నివాసంలో దండుగుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment