'ఆ మధ్య ఓ వ్యక్తి ఇంటిచుట్టూ తచ్చాడాడు'
సాక్షి, బెంగళూరు : తన సోదరికి వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరని ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ సోదరి సోదరులు చెప్పారు. ఆమె నమ్మిన ఐడియాలజీకి కట్టుబడి ఉండటం వల్లే హత్యకు దారి తీసిందని భావిస్తున్నామన్నారు. లంకేష్ భావజాలం, సిద్ధాంతం నచ్చని వారే ఈ పనిచేసి ఉంటారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేస్తారని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియన వ్యక్తుల చేతుల్లో గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హత్య కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె సోదరి, సోదరుడైన కవిత, ఇంద్రజిత్ లంకేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ సోదరిపై జరిగిన దాడిని భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు.
కవిత, ఇంద్రజిత్‌లు మాట్లాడుతూ 'ఆమె ఎప్పుడు భయపడలేదు. ఇటీవల ఆమె ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కూడా భద్రత తీసుకొమ్మంటే అందుకు నిరాకరించారు. ఆ మధ్య ఓ వ్యక్తి ఓ వారంపాటు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించాడు. వాస్తవానికి ఇంకొకరైతే ఫిర్యాదు చేసే వారు. అయితే, లంకేష్ మాత్రం ఆ వ్యక్తితో ఏం కాదులే అనుకొని ధైర్యంగా ఉన్నారు. ఆమెపై వ్యక్తిగత కారణాలతో ఈ దాడి జరగలేదు. మాతండ్రిలాగే మీడియా రచనలో చాలా దూకుడుగా వ్యవహరించేవారు. కానీ, వ్యక్తిగా మాత్రం చాలా సున్నితమైన వారు' అని చెప్పారు.