Indrajit Lankesh
-
అందరూ మోసం చేశారు, ఎవర్నీ నమ్మను: షకీలా
Shakeela: నటనతో రెండు దశాబ్దాలకు పైగా సినీప్రియులను అలరించింది షకీలా. ఈ మధ్యే ఆమె జీవితకథ ఆధారంగా బయోపిక్ రిలీజవగా అది బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తనను అందరూ మోసం చేశారని వాపోయింది. ఎవరినీ అంత సులభంగా నమ్మాలనుకోవడం లేదని తెలిపింది. బంధువులు తన దగ్గర ఆర్థిక సాయం పొందిన తర్వాత మోసం చేశారని పేర్కొంది. షకీలా బయోపిక్ డైరెక్టర్ ఇంద్రజిత్ లోకేశ్‌ను గుడ్డిగా నమ్మినందుకు పశ్చాత్తాపపడుతున్నానంది. 'ఇంద్రజిత్ లోకేశ్ సినిమా షూటింగ్ ప్రారంభం అవడానికి ముందు నాతో చర్చించాడు. కానీ తర్వాత అతడికి నచ్చినట్లుగా స్క్రిప్ట్ మార్చేశాడు. ఈ బయోపిక్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యాయి. ప్రస్తుతం నా ప్రాజెక్టుల విషయానికి వస్తే.. తెలుగు, తమిళ సినిమాల్లో కొన్ని సహాయక పాత్రలు చేస్తున్నా. అలాగే దవ్వు మాస్టర్ అనే కన్నడ సినిమా చేస్తున్నా. ఇందులో పెంపుడు కుక్కతో ప్రేమలో పడే మహిళ పాత్రలో కనిపిస్తాను' అని షకీలా చెప్పుకొచ్చింది. -
రుణ బాగోతం.. ఏం జరిగిందో తెలియాలి..
యశవంతపుర: నటుడు దర్శన్‌పై ప్రముఖ నిర్మాత– దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ యుద్ధానికి నాంది పలికారు. దర్శన్ పేరుతో నకిలీ పత్రాలతో రూ.25 కోట్ల అప్పు తీసుకోవడానికి కొందరు యత్నించడంపై ఏం జరిగిందో కూపీ లాగాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు హోంమంత్రి బసవరాజ బొమ్మైకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పూర్తి విచారణ జరపాలని మైసూరు పోలీసు కమిషనర్‌ను ఆదేశించినట్లు హోంమంత్రి గురువారం బెంగళూరులో తెలిపారు. ఈ కేసులో నిర్మాత ఇంద్రజిత్ లంకేశ్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేస్తారన్నారు. అంత త్వరగా రాజీనా: లంకేశ్.. మైసూరులో సందేశ్ ప్రిన్స్ హోటల్లో సప్లయర్‌పై నటుడు దర్శన్ దాడి చేశారని, అతని కంటికి గాయమైందని నిర్మాత ఇంద్రజిత్ లంకేశ్ ఆరోపించారు. అతనికి రూ.50 వేలు ఇచ్చి రాజీ అయ్యారన్నారు. కాగా రూ.25 కోట్ల లోన్ కేసులో ఆరోపణలున్న అరుణకుమారిని దర్శన్ ఫాంహౌస్‌కు ఎందుకు పిలిచారు. అంత త్వరగా ఎందుకు రాజీ అయ్యారని ఇంద్రజిత్ ప్రశ్నించారు. వీటన్నింటిపై విచారణ చేయాలని హోంమంత్రికి ఫిర్యాదు చేశానన్నారు. కాగా, గతంలో శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో కూడా లంకేశ్ అనేకమందిపై ఆరోపణలు చేయడం, సీఐడీ విచారణకు వెళ్లడం తెలిసిందే. అదృశ్య శక్తుల పని: దర్శన్.. ఈ వ్యవహారాలపై దర్శన్ స్పందిస్తూ, హోటల్లో గలాటా జరగడం నిజమే, అయితే సప్లయర్‌పై దాడి చేయలేదని, ఇంద్రజిత్ ఆరోపణలు సరికాదని అన్నారు. ఇక లోన్ విషయంలో కొన్ని అదృశ్య శక్తులు పని చేశాయని ఆరోపించారు. హోటల్లో దర్శన్ గొడవ నిజమే మైసూరు: మైసూరులోని తమ ప్రిన్స్ హోటల్లో నటుడు దర్శన్ గొడవ చేయడం నిజమే. నేనే పిలిచి మందలించానని నిర్మాత సందేష్‌నాగరాజు కుమారుడు సందేష్ చెప్పారు. గురువారం ఆయన హోటల్ వద్ద మీడియాతో మాట్లాడారు. దర్శన్ సుమారు 20 మంది స్నేహితులతో సుమారు నెలరోజుల కింద రాత్రి 11 గంటలప్పుడు వచ్చారు. మా వెయిటర్‌తో గొడవ పడ్డారు, కానీ అతన్ని కొట్టలేదు. నేను వెళ్లి సర్దిచెప్పా అని తెలిపారు. -
కఠిన ప్రపంచపు కరుకు అనుభవాల ఆమె కథ
తండ్రి ఆమెను చిన్నప్పుడు పట్టించుకోలేదు. తల్లి బతుకుతెరువుకు ఆమె దేహం ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించింది. సొంత అక్క ఆమె సంపాదించినది అంతా తీసేసుకుంది. మగ ప్రపంచం ఆమెను నిండా మోసం చేసింది. నెల్లూరు నుంచి వెళ్లి కేరళ సినిమా రంగంలో సంచలనం సృష్టించిన నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా తయారైన సినిమా ‘షకీలా’ ఈ క్రిస్మస్కు విడుదల కానుంది. గతంలో సిల్క్ స్మిత జీవితంపై ‘డర్టీ పిక్చర్’ వచ్చింది. ఇప్పుడు షకీలా. షకీలా జీవితానుభవాలు, సినిమాలో అవి వస్తున్న విధం గురించి కథనం. సినిమాలలో సగటు ప్రేక్షకుల వినోదం కోసం ‘క్లబ్ డాన్సర్’ల పేరుతో స్త్రీల శరీర ప్రదర్శన ఉండేది. ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అలాంటి పాటలను ఐటమ్ సాంగ్స్ అంటున్నారు. వాటిని పెద్ద పెద్ద హీరోయిన్లు చేస్తున్నారు కూడా. కాని గతంలో వాటి కోసంగా వేరే తారలు ఉండేవారు. వారికి సంప్రదాయ ప్రేక్షకుల దృష్టిలో తక్కువ చూపు ఉండేది. హిందీ సినిమాలలో తొలి క్లబ్ డాన్సర్‌గా హెలెన్ చరిత్ర సృష్టించారు. హెలెన్ స్ఫూర్తితో ఆ తర్వాత సౌత్‌లో కూడా చాలామంది తారలు కేవలం క్లబ్ డాన్సర్లుగా తమ కెరీర్లు మలుచుకున్నారు. దక్షిణాది సినిమా రంగంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, అనురాధ ఆ తర్వాతి కాలంలో సిల్క్ స్మిత చాలా పేరు సంపాదించారు. అయితే ఈ రంగంలో ఉన్న తారలు, ఘర్షణాయుతమైన జీవితం మిగిలిన వారి జీవితాలకు సంబంధించి వెలికి రాలేదు. కాని సిల్క్ స్మిత హటాన్మరణం పెద్ద న్యూస్‌గా మారింది. ఆ తర్వాత ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు శృంగార నటి షకీలా జీవితం ఆధారంగా ‘షకీలా’ పేరుతో సినిమా ఈ క్రిస్మస్కు విడుదల కానుంది. కాని ఈమె డాన్సర్ కాదు. అది తేడా. నెల్లూరు నుంచి షకీలా స్వస్థలం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఉండే కోట. దిగువ మధ్యతరగతి కుటుంబం. వారి బంధువులంతా టైలరింగ్ వంటి చిన్న పనులే చేసేవారు. షకీలా తండ్రి చాంద్ బాషా బతుకు తెరువు కోసం చెన్నై వెళ్లి ఆ తర్వాత కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాడు. అక్కడే షకీలా జీవితం సినిమా ప్రపంచం వైపు మెల్లగా మళ్లింది. అయితే జీవితం గడవాలంటే అవసరమైన ‘రాజీ’ పడాల్సిందేనని తల్లి షకీలాను ఒప్పించి ఆమెను సినిమా పరిశ్రమలోకి పంపింది. తల్లికి గాని, షకీలాకు గాని చదువు లేదు. మిగిలిన సంతానం కూడా అంతంత మాత్రమే చదువుకున్నారు. 1995లో షకీలా తొలి శృంగార చిత్రం ‘ప్లేగర్ల్స్’ విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన మలయాళ సినిమా ‘కిన్నరతుంబిగల్’ విడుదలై పెద్ద హిట్ అయ్యింది. షకీలా మద్రాసులో ఉంటూ మలయాళ సినిమాలలో విస్తృతంగా నటించడం మొదలెట్టారు. 30–40 కేంద్రాలు పెద్ద హీరోల సినిమాలు భారీ ఖర్చుతో తీయాలి. అన్ని సెంటర్లలో బాగా ఆడాలి. కాని షకీలా నటించిన సినిమాలు ముప్పై నలబై కేంద్రాలలో ఓ మోస్తరు ఆడినా డబ్బు వచ్చేసేది. సాధారణంగా షూటింగ్ అయ్యాక సదరు నటీనటులు ఇళ్లకు వచ్చి స్నానాలు చేస్తారు. కాని షకీల షూటింగ్లో ప్రధానమైన సీన్ల షూటింగ్ అయ్యాక దర్శకులు ‘ఒక ఫ్యాంటసీ సీన్’ అనో, ‘ఒక స్నానం సీన్’ అనో అడిగి చివరి గంటల్లో ఆ సీన్లు తీసేవారు. వాటి కోసం షకీల ప్రత్యేకంగా నటించాల్సి వచ్చేది. 1995–2000 మధ్య కాలంలో షకీలా సినిమాలు మలయాళ రంగాన్ని ఊపేశాయి. శృంగార చిత్రాలు ఎవరు నటించినా ‘షకీలా సినిమా’ అనేంతగా ఆమెకు ఇమేజ్ వచ్చింది. ఒక్క భాషలో ఆమె నటిస్తే అన్ని భాషల్లోనూ అవి డబ్ అయ్యేవి. ఇంకా నేపాల్, శ్రీలంకలలో కూడా రిలీజ్ అయ్యేవి. ‘రోజుకు మూడు లక్షలు తీసుకున్న రోజులు ఉన్నాయి’ అని షకీలా చెప్పుకున్నారు. మలయాళ సూపర్స్టార్లు ఆమె సినిమా కలెక్షన్లు చూసి నామోషీ ఫీల్ అయ్యారని, ఆమె సినిమాలు విడుదల కాకుండా చూశారని ఒక వార్త ఉంది. 2002లో షకీల ఇక మీదట తాను అలాంటి సినిమాలలో నటించనని ప్రకటన చేసి వాటిని విరమించుకున్నారు. కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. అయితే ఆ కెరీర్ సజావుగా లేదు. ఆమె సంపాదించిన డబ్బులో ఏదీ ప్రస్తుతం ఆమె దగ్గర లేదు. ఆమె అతి సామాన్య జీవనం గడిపే స్థితికి చేరుకున్నారు. అయిన వారే ‘మా అమ్మ నన్ను బంగారు బాతులా చూసింది. నా ఆర్థిక లావాదేవీలన్ని నా పెద్దక్క చూసింది. దాదాపు రెండు కోట్ల రూపాయలు నా డబ్బు ఆమె దగ్గర ఉండిపోయింది. అది నాకు ఇవ్వలేదు. మా అమ్మ నా పేరున ఏదైనా ఆస్తి ఉంటే నేను వేరుగా వెళ్లిపోయి స్థిరపడతానని అసలు ఏ ఆస్తీ నా పేరున కొననివ్వలేదు. నా వాళ్లు నా సంపాదనతో స్థిరపడి తమ వేడుకలకు నేను వస్తే నన్ను బంధువులకు పరిచయం చేయడానికి ఇబ్బంది పడే స్థితికి వచ్చారు. అందుకని ఇప్పుడు వాళ్లందరితో తెగదెంపులు చేసుకున్నాను. నాకు ఎవరూ లేరు’ అని షకీల చెప్పుకున్నారు. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకున్నారు. తమిళనాడులో ఉండే ట్రాన్స్జెండర్ల సమూహం ఆమెను తమ మనిషిగా స్వీకరించింది. వారే ఇప్పుడు షకీల మంచి చెడ్డలు చూసుకుంటున్నారు. ‘నాతో రిలేషన్లో ఉన్న మగవారు కూడా నాకు దూరమైపోయారు’ అని ఆమె అన్నారు . ఆత్మకథ– సినిమా షకీలా ఆత్మకథ మలయాళంలో ‘షకీలా ఆత్మకథ’ పేరుతో విడుదలైంది. అది అక్కడ చర్చకు పాత్రమైంది. హిందీలో ఆమె కథ స్ఫూర్తిగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి రీచా చద్దా ముఖ్యపాత్రలో సినిమా తయారైంది. అది ఈ సంవత్సరం మొదలులోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల ఈ డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతోంది. అదీ నేరుగా థియేటర్లలో. ‘సినిమా రంగంలోకి రావాలనుకున్న యువతులు ఇక్కడ గ్లామర్, పేరుతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకోవాలి. అందుకు ఈ సినిమా కథ ఉపయోగపడుతుంది’ అని దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ అన్నాడు. రిచా చద్దా ‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘మసాన్’ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందారు. ‘షకీలా’ సినిమా కచ్చితంగా విమర్శకులు మెచ్చే స్థాయిలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఒక పల్లెటూరు అమ్మాయి చేసిన ఒక వినూత్న ప్రయాణం ఈ కథ. ఇది సమాజంలో ఉండే నిచ్చెనలను, పాములను కూడా చూపిస్తుంది. ఇది నమ్మకాలను, నమ్మకద్రోహాలను కూడా చూపిస్తుంది. జీవితం పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో కూడా హెచ్చరిస్తుంది. – సాక్షి ఫ్యామిలీ -
నాకు నేనే అతిథి...
... అంటున్నారు నటి షకీల. శృంగార తారగా ఎందరో యువ హృదయాలను కొల్లగొట్టారు షకీల. శృంగార తారగా ఓ వెలుగు వెలిగిన షకీల జీవితాన్ని మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ వెండితెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని సమాచారం. తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనను దాచిపెట్టకుండా చిత్రబృందానికి తెలిపానని షకీల గతంలో చెప్పారు. ఆమె పాత్రలో బాలీవుడ్ నటి రిచా చద్దా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చిందట. తన జీవిత కథతో తెరకెక్కుతోన్న సినిమాలో షకీల అతిథి పాత్రలో మెరవనుండటం విశేషం. అతిథి పాత్రలో నటించమని ఇంద్రజిత్ లంకేష్ కోరడంతో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట ఆమె. -
షకీలా బయోపిక్‌పై ఇంట్రేస్టింగ్ న్యూస్
సెన్సేషనల్ స్టార్ షకీలా పేరు మీద బయోపిక్ చిత్రం తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మలయాళ దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. షకీలా పాత్రను బాలీవుడ్ బ్యూటీ రిచా చడ్డా పోషిస్తున్నారు. ఈ సినిమాలో షకీలా వ్యక్తిగత జీవితం, సినీరంగం ప్రవేశం, కెరీర్‌లోని కష్టాలను వెండితెర మీద ఆవిష్కరించనున్నారు దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్. షకీలా అడల్ట్ స్టార్ గా మారడానికి కారణాలు తెరపై చాలా ఆసక్తికరంగా ఉండనున్నాయట. కాగా ఈ మూవీలో అతిథి పాత్రలో నటించవలసిందిగా షకీలాను దర్శకుడు ఇటీవల కోరినట్లు సమాచారం. దీనికి షకీలా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. సౌత్ ఇండస్ట్రీలో శృంగార తారగా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు నటి షకీలా. 90వ దశకంలో ఆమె సినిమాలకు యమ క్రేజ్ ఉండేది. ఒకానొక దశలో ఆమె సినిమా కలెక్షన్ల ముందు బడా స్లార్ల మూవీల కలెక్షన్లు కూడా వెలవెలబోయేవి. షకీలా మూవీ రీలీజ్ అవుతుందంటే చాలు.. వారం రోజుల పాటు బడా హీరోల సినిమాలు వాయిదా పడేవి. ప్రస్తుతం షకీలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతోంది. -
నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను: షకీలా
‘నిజాలు దాచి బయోపిక్ తీసి ఉపయోగమేంటి?’ అంటున్నారు నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ ఓ బయోపిక్ రూపొందిస్తున్నారు. ఇందులో టైటిల్ రోల్‌ను బాలీవుడ్ నటి రీచా చద్దా పోషిస్తున్నారు. ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన ప్రిపరేషన్ కోసం షకీలాను కలుసుకున్నారు రీచా. ఈ బయోపిక్ గురించి షకీల మాట్లాడుతూ – ‘‘రీచాకు, నాకు మధ్యలో ఒక కామన్ పాయింట్ కనిపించింది. ఫిజికల్ సిమిలారిటీ గురించి కాదు, మా ఇద్దరి ఆలోచనా విధానం గురించి అంటున్నాను. రీచా కూడా నాలానే ధైర్యవంతురాలు, ఫ్రీగా ఆలోచించే మనిషి. స్క్రిప్ట్స్‌లో ఉన్న లేయర్స్‌ని కూడా అర్థం చేసుకోగల నటి. ఈ సినిమాకు సంబంధించి నేను ఎటువంటి నిబంధనలు పెట్టడం లేదు. నా లైఫ్‌లో జరిగినదంతా చెప్పాను. నిజాలు దాచాలనుకున్నప్పుడు బయోపిక్ తీసి ఉపయోగమేముంది’’ అని పేర్కొన్నారు. ఈ సినిమా ఆగస్ట్‌లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. -
'ఆ మధ్య ఓ వ్యక్తి ఇంటిచుట్టూ తచ్చాడాడు'
సాక్షి, బెంగళూరు : తన సోదరికి వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరని ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ సోదరి సోదరులు చెప్పారు. ఆమె నమ్మిన ఐడియాలజీకి కట్టుబడి ఉండటం వల్లే హత్యకు దారి తీసిందని భావిస్తున్నామన్నారు. లంకేష్ భావజాలం, సిద్ధాంతం నచ్చని వారే ఈ పనిచేసి ఉంటారని తాము భావిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పోలీసులు నిందితులను అరెస్టు చేస్తారని తాము విశ్వసిస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియన వ్యక్తుల చేతుల్లో గౌరీ లంకేష్ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ హత్య కేసు విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె సోదరి, సోదరుడైన కవిత, ఇంద్రజిత్ లంకేష్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తమ సోదరిపై జరిగిన దాడిని భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించారు. కవిత, ఇంద్రజిత్లు మాట్లాడుతూ 'ఆమె ఎప్పుడు భయపడలేదు. ఇటీవల ఆమె ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంలో కూడా భద్రత తీసుకొమ్మంటే అందుకు నిరాకరించారు. ఆ మధ్య ఓ వ్యక్తి ఓ వారంపాటు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతూ కనిపించాడు. వాస్తవానికి ఇంకొకరైతే ఫిర్యాదు చేసే వారు. అయితే, లంకేష్ మాత్రం ఆ వ్యక్తితో ఏం కాదులే అనుకొని ధైర్యంగా ఉన్నారు. ఆమెపై వ్యక్తిగత కారణాలతో ఈ దాడి జరగలేదు. మాతండ్రిలాగే మీడియా రచనలో చాలా దూకుడుగా వ్యవహరించేవారు. కానీ, వ్యక్తిగా మాత్రం చాలా సున్నితమైన వారు' అని చెప్పారు.