తండ్రి ఆమెను చిన్నప్పుడు పట్టించుకోలేదు. తల్లి బతుకుతెరువుకు ఆమె దేహం ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించింది. సొంత అక్క ఆమె సంపాదించినది అంతా తీసేసుకుంది. మగ ప్రపంచం ఆమెను నిండా మోసం చేసింది. నెల్లూరు నుంచి వెళ్లి కేరళ సినిమా రంగంలో సంచలనం సృష్టించిన నటి షకీలా. ఆమె జీవితం ఆధారంగా తయారైన సినిమా ‘షకీలా’ ఈ క్రిస్మస్‌కు విడుదల కానుంది. గతంలో సిల్క్ స్మిత జీవితంపై ‘డర్టీ పిక్చర్’ వచ్చింది. ఇప్పుడు షకీలా. షకీలా జీవితానుభవాలు, సినిమాలో అవి వస్తున్న విధం గురించి కథనం.
సినిమాలలో సగటు ప్రేక్షకుల వినోదం కోసం ‘క్లబ్ డాన్సర్’ల పేరుతో స్త్రీల శరీర ప్రదర్శన ఉండేది. ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అలాంటి పాటలను ఐటమ్ సాంగ్స్ అంటున్నారు. వాటిని పెద్ద పెద్ద హీరోయిన్లు చేస్తున్నారు కూడా. కాని గతంలో వాటి కోసంగా వేరే తారలు ఉండేవారు. వారికి సంప్రదాయ ప్రేక్షకుల దృష్టిలో తక్కువ చూపు ఉండేది. హిందీ సినిమాలలో తొలి క్లబ్ డాన్సర్‌గా హెలెన్ చరిత్ర సృష్టించారు. హెలెన్ స్ఫూర్తితో ఆ తర్వాత సౌత్‌లో కూడా చాలామంది తారలు కేవలం క్లబ్ డాన్సర్‌లుగా తమ కెరీర్‌లు మలుచుకున్నారు.
దక్షిణాది సినిమా రంగంలో జ్యోతిలక్ష్మి, జయమాలిని, విజయలలిత, అనురాధ ఆ తర్వాతి కాలంలో సిల్క్ స్మిత చాలా పేరు సంపాదించారు. అయితే ఈ రంగంలో ఉన్న తారలు, ఘర్షణాయుతమైన జీవితం మిగిలిన వారి జీవితాలకు సంబంధించి వెలికి రాలేదు. కాని సిల్క్ స్మిత హటాన్మరణం పెద్ద న్యూస్‌గా మారింది. ఆ తర్వాత ఆమె జీవితం ఆధారంగా హిందీలో ‘డర్టీ పిక్చర్’ అనే సినిమా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు శృంగార నటి షకీలా జీవితం ఆధారంగా ‘షకీలా’ పేరుతో సినిమా ఈ క్రిస్మస్‌కు విడుదల కానుంది. కాని ఈమె డాన్సర్ కాదు. అది తేడా.
నెల్లూరు నుంచి
షకీలా స్వస్థలం నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో ఉండే కోట. దిగువ మధ్యతరగతి కుటుంబం. వారి బంధువులంతా టైలరింగ్ వంటి చిన్న పనులే చేసేవారు. షకీలా తండ్రి చాంద్ బాషా బతుకు తెరువు కోసం చెన్నై వెళ్లి ఆ తర్వాత కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాడు. అక్కడే షకీలా జీవితం సినిమా ప్రపంచం వైపు మెల్లగా మళ్లింది. అయితే జీవితం గడవాలంటే అవసరమైన ‘రాజీ’ పడాల్సిందేనని తల్లి షకీలాను ఒప్పించి ఆమెను సినిమా పరిశ్రమలోకి పంపింది. తల్లికి గాని, షకీలాకు గాని చదువు లేదు. మిగిలిన సంతానం కూడా అంతంత మాత్రమే చదువుకున్నారు. 1995లో షకీలా తొలి శృంగార చిత్రం ‘ప్లేగర్ల్స్’ విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆమె నటించిన మలయాళ సినిమా ‘కిన్నరతుంబిగల్’ విడుదలై పెద్ద హిట్ అయ్యింది. షకీలా మద్రాసులో ఉంటూ మలయాళ సినిమాలలో విస్తృతంగా నటించడం మొదలెట్టారు.
30–40 కేంద్రాలు
పెద్ద హీరోల సినిమాలు భారీ ఖర్చుతో తీయాలి. అన్ని సెంటర్లలో బాగా ఆడాలి. కాని షకీలా నటించిన సినిమాలు ముప్పై నలబై కేంద్రాలలో ఓ మోస్తరు ఆడినా డబ్బు వచ్చేసేది. సాధారణంగా షూటింగ్ అయ్యాక సదరు నటీనటులు ఇళ్లకు వచ్చి స్నానాలు చేస్తారు. కాని షకీల షూటింగ్‌లో ప్రధానమైన సీన్ల షూటింగ్ అయ్యాక దర్శకులు ‘ఒక ఫ్యాంటసీ సీన్’ అనో, ‘ఒక స్నానం సీన్’ అనో అడిగి చివరి గంటల్లో ఆ సీన్లు తీసేవారు. వాటి కోసం షకీల ప్రత్యేకంగా నటించాల్సి వచ్చేది. 1995–2000 మధ్య కాలంలో షకీలా సినిమాలు మలయాళ రంగాన్ని ఊపేశాయి. శృంగార చిత్రాలు ఎవరు నటించినా ‘షకీలా సినిమా’ అనేంతగా ఆమెకు ఇమేజ్ వచ్చింది.
ఒక్క భాషలో ఆమె నటిస్తే అన్ని భాషల్లోనూ అవి డబ్ అయ్యేవి. ఇంకా నేపాల్, శ్రీలంకలలో కూడా రిలీజ్ అయ్యేవి. ‘రోజుకు మూడు లక్షలు తీసుకున్న రోజులు ఉన్నాయి’ అని షకీలా చెప్పుకున్నారు. మలయాళ సూపర్‌స్టార్లు ఆమె సినిమా కలెక్షన్లు చూసి నామోషీ ఫీల్ అయ్యారని, ఆమె సినిమాలు విడుదల కాకుండా చూశారని ఒక వార్త ఉంది. 2002లో షకీల ఇక మీదట తాను అలాంటి సినిమాలలో నటించనని ప్రకటన చేసి వాటిని విరమించుకున్నారు. కేరెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించారు. అయితే ఆ కెరీర్ సజావుగా లేదు. ఆమె సంపాదించిన డబ్బులో ఏదీ ప్రస్తుతం ఆమె దగ్గర లేదు. ఆమె అతి సామాన్య జీవనం గడిపే స్థితికి చేరుకున్నారు.
అయిన వారే
‘మా అమ్మ నన్ను బంగారు బాతులా చూసింది. నా ఆర్థిక లావాదేవీలన్ని నా పెద్దక్క చూసింది. దాదాపు రెండు కోట్ల రూపాయలు నా డబ్బు ఆమె దగ్గర ఉండిపోయింది. అది నాకు ఇవ్వలేదు. మా అమ్మ నా పేరున ఏదైనా ఆస్తి ఉంటే నేను వేరుగా వెళ్లిపోయి స్థిరపడతానని అసలు ఏ ఆస్తీ నా పేరున కొననివ్వలేదు. నా వాళ్లు నా సంపాదనతో స్థిరపడి తమ వేడుకలకు నేను వస్తే నన్ను బంధువులకు పరిచయం చేయడానికి ఇబ్బంది పడే స్థితికి వచ్చారు. అందుకని ఇప్పుడు వాళ్లందరితో తెగదెంపులు చేసుకున్నాను. నాకు ఎవరూ లేరు’ అని షకీల చెప్పుకున్నారు. ఆమె ఒక ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకున్నారు. తమిళనాడులో ఉండే ట్రాన్స్‌జెండర్‌ల సమూహం ఆమెను తమ మనిషిగా స్వీకరించింది. వారే ఇప్పుడు షకీల మంచి చెడ్డలు చూసుకుంటున్నారు. ‘నాతో రిలేషన్‌లో ఉన్న మగవారు కూడా నాకు దూరమైపోయారు’ అని ఆమె అన్నారు
.
ఆత్మకథ– సినిమా
షకీలా ఆత్మకథ మలయాళంలో ‘షకీలా ఆత్మకథ’ పేరుతో విడుదలైంది. అది అక్కడ చర్చకు పాత్రమైంది. హిందీలో ఆమె కథ స్ఫూర్తిగా ప్రసిద్ధ బాలీవుడ్ నటి రీచా చద్దా ముఖ్యపాత్రలో సినిమా తయారైంది. అది ఈ సంవత్సరం మొదలులోనే రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా వల్ల ఈ డిసెంబర్‌లో క్రిస్మస్ సందర్భంగా విడుదలవుతోంది. అదీ నేరుగా థియేటర్లలో. ‘సినిమా రంగంలోకి రావాలనుకున్న యువతులు ఇక్కడ గ్లామర్, పేరుతో పాటు ఇంకా ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకోవాలి. అందుకు ఈ సినిమా కథ ఉపయోగపడుతుంది’ అని దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్ అన్నాడు. రిచా చద్దా ‘గాంగ్స్ ఆఫ్ వాసేపూర్’, ‘మసాన్’ సినిమాలతో మంచి నటిగా గుర్తింపు పొందారు. ‘షకీలా’ సినిమా కచ్చితంగా విమర్శకులు మెచ్చే స్థాయిలో ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
ఒక పల్లెటూరు అమ్మాయి చేసిన ఒక వినూత్న ప్రయాణం ఈ కథ. ఇది సమాజంలో ఉండే నిచ్చెనలను, పాములను కూడా చూపిస్తుంది. ఇది నమ్మకాలను, నమ్మకద్రోహాలను కూడా చూపిస్తుంది. జీవితం పట్ల ఎంత అప్రమత్తతతో ఉండాలో కూడా హెచ్చరిస్తుంది.
– సాక్షి ఫ్యామిలీ
Comments
Please login to add a commentAdd a comment