jp rajkhowa
-
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ తొలగింపు
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్కోవాను పదవి నుంచి తొలగిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. మేఘాలయ గవర్నర్ షన్ముగనాథన్కు అదనంగా అరుణాచల్ ప్రదేశ్ బాధ్యతలను అప్పగించారు. ఆరోగ్య కారణాల రిత్యా రాజ్కోవాను రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం ఇటీవల కోరిన విషయం తెలిసిందే. అయితే రాజ్కోవా మాత్రం తాను ఆరోగ్యంగానే ఉన్నానని, విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నానని రాజీనామా చేయడానికి నిరాకరించారు. అవసరమైతే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా తొలగించాలని, అప్పటివరకు రాజీనామా చేసే ప్రసక్తే లేదని రాజ్కోవా ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అతడిని తప్పిస్తూ సోమవారం ప్రణబ్ ముఖర్జీ ఉత్తర్వులు జారీ చేశారు. -
మీరు దిగిపోండి!
అరుణాచల్ గవర్నర్‌ను కోరిన కేంద్రం? న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జ్యోతిప్రకాష్ రాజ్‌ఖోవాను పదవి నుంచి దిగిపోవాల్సిందిగా కేంద్రం కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ‘ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానని చెప్పి మీరు పదవి నుంచి తప్పుకోండి’ అని కేంద్ర హోం శాఖ అధికారి, సహాయ మంత్రుల నుంచి గవర్నర్‌కు ఫోన్లు వచ్చాయని తెలిసింది. ఫోన్లు వచ్చాక రాజ్‌ఖోవా స్పష్టత కోసం హోం మంత్రి రాజ్‌నాథ్‌ను సంప్రదించగా పదవి నుంచి దిగిపోవాల్సిందిగా రాజ్‌నాథ్ చెప్పలేదని విశ్వసనీయవర్గాల సమాచారం. రాష్ట్రంలో టుకీ ప్రభుత్వాన్ని కూలదోసి, కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో కలిసి కలిఖోపుల్ గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కలిఖోపుల్ ప్రభుత్వ ఏర్పాటు చెల్లదనీ, నబం టుకీ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు ఈ మధ్యనే తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. -
న్యాయాధికారులను తొలగించిన గవర్నర్
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఆర్.పి.రజ్ఖోవా ఇద్దరు న్యాయాధికారులను తొలగించారు. ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రాంజీ థామస్, అదనపు అడ్వకేట్ జనరల్ ఆర్ హెచ్.నబంను విధుల నుంచి తప్పించారు. రాష్ట్రంలో పలు అంశాలకు సంబంధించి సీజ్ చేసిన పత్రాలను ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించిన అనంతరం ఈ ఇద్దరు అధికారులను గవర్నర్ విధుల నుంచి తప్పించడం గమనార్హం. -
'గవర్నర్ నన్ను బెదిరించారు'
న్యూఢిల్లీ: అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి నబమ్‌టుకీ, గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్ఖోవాల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. గవర్నర్ పదవి చేపట్టిన నాటి నుంచి రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని నబమ్‌టుకీ అన్నారు. తన సహచర మంత్రులతో ఇటానగర్‌లోని రాజ్ భవన్లో గవర్నర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు అవమానించారని తెలిపారు. మీటింగ్‌లో గవర్నర్ బెదిరింపులకు పాల్పడుతూ దుషించారని తెలిపారు. మీటింగ్‌కు వస్తున్నప్పుడ, జరుగుతున్న సమయంలో తమకు తెలియకుండా వీడియో కూడా తీశారని ఆరోపించారు. అయితే బయటకు వచ్చిన వీడియో ఫూటేజీ ఎడిటి చేసిందని తెలిపారు. తనను రెచ్చగొట్టే మాటలను ఆ వీడియోనుంచి తొలగించారన్నారు. అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ప్రకటించటాన్ని సవాల్ చేస్తూ నబమ్‌టుకీ గురువారం తాజా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనితో పాటు.. కాంగ్రెస్ శాసనసభాపక్ష చీఫ్ విప్ రాజేశ్ టాచో వంటి వారు వేసిన పిటిషన్లను జస్టిస్‌జె.ఎస్.ఖేహర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించే అవకాశముంది. ఇంతకుముందు వేసిన పిటిషన్లు రాష్ట్రపతి పాలనను ప్రశ్నించలేదని.. రాష్ట్రపతి పాలన విధించటానికి ముందే వాటిని దాఖలు చేశారని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో..పిటిషన్ల సవరణకు ధర్మాసనం అవకాశం ఇవ్వగా నబమ్‌టుకీ తాజాపిటిషన్ వేశారు. -
లిఫ్టులో ఇరుక్కున్న అరుణాచల్ గవర్నర్
అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవా లిఫ్టులో ఇరుక్కుపోయారు. రాజ్‌భవన్‌లో ఆయన లిఫ్టులో ఉండగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మూడు నిమిషాల పాటు ఆయన లిఫ్టులోనే ఉండిపోయారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి గురైన గవర్నర్.. విద్యుత్ శాఖ అధికారులను పిలిపించి చీవాట్లు పెట్టారు. గవర్నర్ లిఫ్టులో ఉన్న సమయంలో అందులో కనీసం లైటు, ఫ్యాన్ కూడా పనిచేయలేదని, దాంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారని రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనతోపాటు ఉన్న వ్యక్తిగత భద్రతాధికారి వెంటనే అత్యవసర కాల్స్ చేయడంతో.. ఆ తర్వాత విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. సాక్షాత్తు గవర్నర్‌కే ఇలాంటి సమస్య వస్తే.. ఇక సామాన్యుల గతేంటని మండిపడుతున్నారు. సోమవారం ఈ ఘటన జరగడంతో మంగళవారం నాడు గవర్నర్ రాజ్‌ఖోవా విద్యుత్ శాఖాధికారులను పిలిపించి, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఎందుకు ఉందని ప్రశ్నించి, ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.