డుమ్మా కొడితే పదవులకు గండమే!
సాక్షి, హైదరాబాద్: జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్లు మొదలుకొని ఎంపీటీసీ సభ్యుల వరకు అధికారాలతోపాటు విధులు, బాధ్యతలను కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ప్రభుత్వం నిర్దేశించింది. కొత్త సభ్యులు విధులు సక్రమంగా నిర్వహించేలా చట్టంలో ఆయా అంశాలను పొందుపర్చారు. పాలకవర్గాలు ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించేలా కట్టుదిట్టమైన నిబంధనలను విధించారు. మూడు విడతల్లో జరగనున్న పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఎన్నికయ్యే జిల్లా, మండల పరిషత్ సభ్యులకు కొత్త చట్టం ప్రకారం వివిధ నిబంధనలు అమల్లోకి రానుండడంతో వాటికి ప్రాధాన్యం ఏర్పడింది.
మండలాధ్యక్షుల బాధ్యతలు...
కొత్తచట్టంలో ఎంపీపీ అధ్యక్షులపై మరిన్ని బాధ్యతలను పెట్టారు. నిర్లక్ష్యం చేసేవారిపై చర్యలతో పాటు కొన్ని పరిమితులు కూడా విధించింది. మండల ప్రజా పరిషత్ తీర్మానాలను అమలు చేసేలా ఎంపీడీవోలపై పరిపాలనాపరమైన నియంత్రణాధికారాన్ని ఉపయోగించే అవకాశం ఎంపీపీలకు కల్పించారు. సర్వసభ్య సమావేశాలకు అధ్యక్షత వహించడం, ప్రజా పరిషత్ రికార్డుల పర్యవేక్షణపై పూర్తి హక్కులు కల్పించారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, అంటు వ్యాధులు ప్రబలడం, తాగునీటి సరఫరా నిలిచిపోవడం వంటి అత్యవసర పరిస్థితుల్లో అధ్యక్షులు సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, సంబంధిత అధికారులు, ఎంపీడీవోలతో చర్చించి, ప్రజల సేవ, భద్రత నిమిత్తం అత్యవసర పనుల నిర్వహణకుగాను ఎంపీపీలకు అధికారాలిచ్చారు. అత్యవసర పనులు నిర్వహించాక, వాటిని సర్వసభ్య సమావేశాల్లో మండల పరిషత్‌కు తప్పనిసరిగా సమర్పించాలి. అయితే, ప్రభుత్వ నిబంధనలు, ఉత్తర్వులను ఉల్లంఘించే నిర్మాణపు పనులు, ఇతర పనుల కోసం అధికారులపై ఒత్తిడి తేవడం, ఆదేశాలిచ్చే విషయంలో ఎంపీపీలపై ఆంక్షలు విధించారు.
15 రోజులు రాకుంటే...
జడ్పీ చైర్పర్సన్లు, ఎంపీపీ అధ్యక్షులు వరసగా 15 రోజులపాటు జడ్పీ, మండల కార్యాలయానికి రాకపోతే వారిని విధుల్లోంచి తప్పించే నిబంధన విధించారు. ఆ విధంగా విధులకు హాజరుకాని జడ్పీ చైర్పర్సన్ స్థానంలో వైస్చైర్మన్లకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు 15 రోజులు వరుసగా ఆఫీసులకు రాకపోతే సంబంధిత ఎంపీడీవోలు ఆ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. ఎంపీపీల పరిధిలో జరిగే పనుల్లో నిర్లక్ష్యం, ఆస్తుల నష్టం వంటి అంశాలపై సంబంధిత అధికారులకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంపీపీ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులపైనే ఉంటుంది. ఈ విషయంలో వారు ప్రత్యక్షంగా చర్యలు తీసుకునే అధికారం లేదు. మండల పరిషత్‌కు వచ్చిన నిధులన్నీ పరిషత్ నిధిగా ఏర్పాటు చేసి, అందరి ఆమోదంతో వినియోగించాలి. వచ్చిన నిధులను ప్రభుత్వ ఖజానాలోనే జమ చేయాలి. ఉద్యోగ భద్రత పథకం, ఇతర వేతనాలు, ఉపాధి నిధులను జాతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో జమ చేసేలా కొత్త పీఆర్ చట్టం నిబంధనల్లో పొందుపరిచారు.
పెరిగిన ఎంపీటీసీల భాగస్వామ్యం...
గ్రామ పంచాయతీల్లో ఎంపీటీసీల భాగస్వామ్యం పెరగనుంది. ప్రతి ఐదేళ్లకు గ్రామ పంచాయతీ దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళిక, వార్షిక ప్రణాళికను ఎంపీటీసీ సభ్యులు ఆమోదించాలి. తమ నియోజకవర్గం పరిధిలోని ప్రజల్లో స్వయం సహాయçస్ఫూర్తిని, చొరవను పెంపొందించడం, జీవన ప్రమాణాలు పెంచడంలో పరిషత్ సభ్యులు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల పన్నువిధానాల్లో మార్పులు తీసుకువచ్చే అధికారం పరిషత్ సభ్యులకు కల్పించారు. మండలం, జిల్లా, ఇతర విధానాల ద్వారా గ్రామ పంచాయతీలకు అందే నిధులతోపాటు నేరుగా గ్రామపంచాయతీ పన్నులను వసూలు చేసే బాధ్యతలను పరిషత్ సభ్యులకు అప్పగిస్తారు. భూమి సెస్సు, స్థానిక సెస్సులను గరిష్ట పరిమితికి లోబడి, సర్‌చార్జ్ రూపంలో పన్నులను విధించే అధికారం పరిషత్ సభ్యులకు ఉంటుంది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పంచాయతీ కార్మిక బడ్జెట్ ప్రణాళికలను ఆమోదించడం, పనుల పర్యవేక్షణ ఇకపై ఎంపీటీసీ సభ్యులు నిర్వహించవచ్చు. వయోజన విద్య కార్యక్రమాల పర్యవేక్షణ, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ కార్యకలాపాల అమలు, స్వయం సహాయక బృందాలతో స్వయం ఉపాధి, జీవనోపాధి పథకాలు, బ్యాంకులతో అనుసంధానం వంటి వాటిని పరిషత్ సభ్యులే నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాన్ని నిర్వహించే అధికారం పరిషత్ సభ్యులకు కల్పించారు. ఇందు కోసం ఏదైనా సంస్థతో నిర్వహణ ఒప్పందం, నిర్మాణ పనుల అమలు, నిర్వహణ వీరి ప్రత్యేకమైన బాధ్యత. ప్రభుత్వ వైద్యశాలలు, శిశు సంక్షేమ కేంద్రాల నిర్వహణ అధికారం ఎంపీటీసీలకే కల్పించారు.